నాలుగు సంవత్సరాల నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టలేని, ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేని సీఆర్డీఏ ఎన్నికల సంవత్సరంలో రూ. 60వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఆర్థిక ప్రణాళిక సక్రమంగా ప్రకటించలేదు. అమరావతికి ప్రభుత్వ హామీ ఉన్నది. ఉండటమే కాదు ఈ రుణాన్ని నేరుగా గాని సీఆర్డీఏకు గ్రాంట్లు సమకూర్చిగానీ తీర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది. అంటే పరోక్షంగా ఇది రాష్ట్రప్రభుత్వం అధిక వడ్డీ రేటుతో చేసిన అప్పు. అట్లాంటప్పుడు విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అంశం దీనిలో ఏమున్నది? ఒక పరిపాలన రాజధానిని 10 వేల కోట్లలో నిర్మించడమే సమస్యకు పరిష్కారం. అలా కాకుండా ఇప్పటికిప్పుడు ఒక మహానగరం ఏర్పడాలనే భావనతో ముందడుగు వేస్తే ఆ కార్యక్రమం అటు అమరావతికి, ఇటు మొత్తం రాష్ట్ర అభివృద్ధికి గుదిబండగా మారుతుంది.
ఈ మధ్య అమరావతి బాండ్లు పదమూడు వందల కోట్ల రూపాయ లకు విడుదలైతే రెండువేల కోట్ల రూపాయల విలువైన బాండ్లకు మద్దతు లభించిం దని, ఇది ‘బ్రాండ్ అమరా వతి’ ఘనవిజయమని రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని ప్రసార మాధ్యమాలు విజయోత్సవాలు జరుపుకుంటు న్నాయి. కేవలం అప్పు తీర్చాలి అన్న ఉద్దేశం లేని వ్యక్తులు మాత్రమే అప్పు పుట్టిందనే సంతోషంతో ఉత్సవాలు చేసుకుంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణం తీర్చకపోయే సమస్య లేదు. రుణాల మార్కెట్లో అప్పు తీర్చాల్సిన బాధ్యత అది తీసుకున్న సంస్థ మీదనే ఉంటుంది. ఇక అమ రావతి బాండ్ల వ్యవహారానికి వస్తే ఫిబ్రవరి నెలలో ఈ విధమైన బాండ్ల ద్వారా అధిక వడ్డీ రేటుతో అప్పులు తీసుకునే విధానాన్ని పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ రెండు కూడా పూర్తిగా వ్యతిరేకించాయి. 2018 ఫిబ్రవరి 8న నగర పాలక శాఖ విడుదల చేసిన జీవో 65లో ఈ అంశాన్ని పొందుపరిచారు. వడ్డీరేట్లు తగ్గుతున్న వాతావరణంలో స్థిర వడ్డీ రేట్లతో బాండ్ల ద్వారా దీర్ఘకాలిక రుణాలు సేకరించేటప్పుడు మార్కెట్ వడ్డీ రేటు కన్నా చెల్లించే వడ్డీ రేటు చాలా తక్కువ ఉన్నప్పుడు తిరిగి ముందుగానే చెల్లించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలోనే ఈ బాండ్ల సదుపాయాన్ని ఉపయోగించు కోవాలని ఆ జీవోలో సూచించారు.
కానీ ఈ మధ్య కాలంలో ఏమైందో కానీ 2018 ఆగస్టు 9న మరో జీవో (నంబర్ 266) జారీ చేశారు. దీని ద్వారా సీఆర్డీఏకు మార్కెట్ రేటుకు మించి 10. 32 శాతం వడ్డీ రేటుతో పద మూడు వందల కోట్లు బాండ్ల రూపంలో సేకరించడా నికి, మరో ఏడు వందల కోట్లు అదనంగా ఉంచుకునే అవకాశం ఉండేవిధంగా బాండ్లు జారీ చేయటానికి అనుమతి ఇచ్చారు. ఈ మొత్తం అప్పును రాష్ట్ర ప్రభు త్వమే తీర్చవలసి ఉంటుంది. ఒక ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు ద్వారా ముందుగానే ఈ చెల్లింపులకు కావ లసిన నిధులు ఆ ట్రస్టులోకి జమ చేసే విధానం కూడా రూపొందించారు. ఈ ట్రస్ట్‌లోకి జమచేసే సొమ్ము రాష్ట్ర బడ్జెట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఈ బాండ్ల జారీ ప్రక్రియ నిర్వహించినందుకు ఏకే క్యాపి టల్ సంస్థ వారికి 0.85 శాతం ఫీజు కింద చెల్లిస్తారు. ఈ ఫీజే దాదాపు 17 కోట్ల రూపాయలు అవుతుంది. ఇక ఇతర రాష్ట్రాల్లోని నగరపాలక సంఘాలు ప్రభుత్వ హామీ లేకుండానే చాలా తక్కువ వడ్డీ రేట్లకు ఇలాంటి బాండ్ల ద్వారా నిధులు సేకరిం చాయి. పుణే నగరపాలక సంస్థ 7.59 శాతం వడ్డీ రేటులో బాండ్ల ద్వారా నిధులు సేకరించగా, హైదరా బాద్ నగరపాలక సంస్థ ఒక విడతలో 8. 9 శాతం వడ్డీ రేటుకు, మరొక విడతలో 9. 38 శాతానికి నిధులు సేకరించింది. అమరావతిని వీటితో పోల్చ డం సరికాకపోయినా గమనించవలసిన ముఖ్య విష యం ఏమిటంటే– పైరెండు నగరపాలక సంస్థలు ప్రభుత్వ హామీ లేకుండా ఈ బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి.
అమరావతికి ప్రభుత్వ హామీ ఉన్నది. పైగా ఈ రుణాన్ని నేరుగా గాని సీఆర్డీఏకు గ్రాంట్లు సమకూర్చిగానీ తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. నాలుగేళ్ల నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టలేని, ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేని సీఆర్డీఏ ఎన్నికల సంవత్సరంలో రూ. 60వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఆర్థిక ప్రణాళిక సక్రమంగా ప్రకటించలేదు. రూ. 20 వేల కోట్లు హడ్కో నుంచి, ఆరు వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి, రూ.10 వేల కోట్లు ఇండి యన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ నుంచి, రూ.7 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ మూలధన వాటా కింద, రూ. 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం మూలధన వాటా కింద వస్తాయని మదుపర్ల సమావేశాల్లో తెలిపారు. హడ్కో నుంచి 8 శాతం కన్నా తక్కువ వడ్డీకి వస్తేనే రుణం తీసుకోవా లన్న నిబంధన ను జనవరిలో నగర పాలక సంస్థ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో విధించారు. అంత పెద్ద మొత్తంలో రూ. 20 వేల కోట్లు ఒక సంస్థ ఇచ్చే అవ కాశం లేదు. నిరర్థక ఆస్తులతో సతమతమవు తున్న ఇండియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ పదివేల కోట్లు ఇస్తారనుకోవటం వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా కని పిస్తోంది. ఇక ప్రపంచ బ్యాంకు అంశం సరేసరి. ఎటు వంటి వెసులుబాటు లేని రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ. 7వేలకోట్లు మూల ధన వాటా రూపంలో ఎలా ఇస్తారో అర్థం కావడంలేదు.
వాస్తవాలకు పూర్తి విరు ద్ధంగా నిధులను చూపెట్టి రూ. 60 వేల కోట్ల టెండర్లు పిలిచారు. ఇది ఎటు తిరిగి చాలా హెచ్చు వడ్డీరేట్లతో ఇటు ఆర్థిక సంస్థల నుంచి గాని, బాండ్ల రూపంలోగాని ప్రభుత్వ హామీ మీదనే సేకరించాల్సి ఉంటుంది. అంటే ఇది ప్రభుత్వం అదనంగా చేస్తున్న అప్పు. ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పుతో మూలు గుతున్న రాష్ట్ర ప్రజల మీద పడే అదనపు తాటికాయ అమరావతి అప్పులు. ఇవి రాజధాని కోసం చేస్తున్న అప్పులు కావు. కాలక్రమంలో పరిణతి చెందాల్సిన మహానగరాన్ని ఒకేసారి నిర్మించాలనే వాస్తవ దూర మైన ప్రాతిపదికపై జరుగుతున్న కార్య క్రమానికి చేస్తున్న అప్పులు. ఇక ఈ మహా నగర నిర్మాణ భారం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. రాష్ట్రంలో 2016–17 సంవత్సరం మూల ధన వ్యయం 15వేల కోట్ల రూపాయలు. ఈ మూలధన వ్యయం చేయడం కోసం రూ. 60 వేల కోట్ల అప్పులు చేశారు. భవి ష్యత్తులో ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసే అవ కాశం లేదు కాబట్టి మూలధన వ్యయం సంవ త్సరానికి రూ. 10 వేల కోట్లకు మించకపోవచ్చు. అంటే రానున్న నాలుగైదు సంవత్సరాల్లో ఒక్క అమ రావతి మహానగర టెండర్ల పనుల చెల్లింపులకు మాత్రమే మొత్తం మూలధనవ్యయం సరిపోతుంది. ఇప్పటికే నీటిపారుదల రంగంలో పూర్తి కాని ప్రాజె క్టుల కారణంగా 50 వేల కోట్ల రూపాయలు నిర ర్థకంగా ఉండిపోయాయి. ఇంకొక రూ. 60 వేల కోట్ల నిరర్థక ఆస్తులు దానికి జత కావచ్చు. ఒక పరిపాలన రాజధానిని 10 వేల కోట్లలో నిర్మించడమే సమస్యకు పరిష్కారం. ఒక పరిపాలన రాజధానిని 10 వేల కోట్లలో నిర్మించడమే సమస్యకు పరిష్కారం. అలా కాకుండా ఇప్పటికిప్పుడు ఒక మహానగరం ఏర్పడా లనే భావనతో ముందడుగు వేస్తే ఆ కార్యక్రమం అటు అమరావతికి, ఇటు మొత్తం రాష్ట్ర అభివృద్ధికి గుదిబండగా మారుతుంది.
ఐవైఆర్ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment