
నెల్లూరు : ఏపీ రాజధానిని అందరి అంగీకారంతోనే నిర్మించాలని మాజీ సీఎఎస్ ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. ఏక పక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదని హెచ్చరించారు. రాజధానులు మహానగరాలుగా ఉండాల్సిన అవసరం లేదని, మహానగరమే అవసరమనుకుంటే విశాఖను ఎంపిక చేసి ఉండాల్సిందని అన్నారు. రాజధాని సమీపంలో ప్రభుత్వ భూములు అధికారంగా ఉండాలని అప్పుడే నగరం వేగంగా అభివృద్ధి చెందతుందని అన్నారు.
హైదరాబాద్ సమీపంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటం వల్లే వందలాది కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని అన్నారు. ల్యాండ్ పూలింగ్ భవిష్యత్‌లో ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని హెచ్చరించారు. శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని రాజధానిని ఎంపిక చేసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అమరావతితో పోలిస్తే దోనకొండ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని, దొనకొండలో ప్రభుత్వ భూములతోపాటు అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. రాజధాని ఎంపికలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు.