సెక్షన్‌ 6 తొలగింపుతోనే సీబీఐకి స్వేచ్ఛ | IYR Krishna Rao Article On Chandrababu Government Bans CBI From Entering AP | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 2 2018 1:18 AM | Last Updated on Sun, Dec 2 2018 1:19 AM

IYR Krishna Rao Article On Chandrababu Government Bans CBI From Entering AP - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక తాత్కాలిక సంచలనాన్ని సృష్టిం చింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్మెంట్‌ చట్టం కింద íసీబీఐ పరిధిని రాష్ట్రానికి వర్తింపజేయడానికి అనువుగా సెక్షన్‌ 6 కింద ఇచ్చే అనుమతిని ఉపసంహరించుకుంది. సాధారణంగా ప్రత్యేకతలేని ఈ వార్త ముందుగానే అనుకున్న విధంగా కొన్ని పత్రికలలో విపరీత ప్రచారం చేయటం ద్వారా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. పేరు ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టమని ఉన్నా ఇది పార్లమెంటు ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ చట్టం.

ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 ఆగస్టులో సీబీఐ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖలపై దర్యాప్తు చేసే అధికారాన్ని పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. 1994 నుంచి సీబీఐకి వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా దర్యాప్తు చేసే అధికారాన్ని కొనసాగిస్తూ వస్తోంది. తెలంగాణలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. 2016లో ఇచ్చిన  ఉత్తర్వుల ద్వారా ఈ అధికారాన్ని వినియోగించుకోవటానికి సీబీఐకి అనుమతిచ్చారు. 

దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలపైగానీ, శాఖలపైగానీ సీబీఐ ఏదైనా దర్యాప్తు చేయాలంటే ప్రతి ఒక్క కేసులో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవటం తప్పనిసరి అవుతుంది. కానీ కొన్ని కేసుల్లో కేసు విస్తృతి వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నప్పుడు ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాల్లో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విశదీకరించబడింది.

న్యాయపరంగా చూస్తే ఈనాడు ఢిల్లీ పోలీస్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ చట్టంలో ఉన్న సెక్షన్లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పు పట్టడానికి లేదు. ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలపై దర్యాప్తు చేయాలంటే చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవడం తప్పనిసరి. దర్యాప్తు జరిపే సంస్థ, దర్యాప్తు చేయబడే శాఖలు, సంస్థలు కేంద్ర ప్రభుత్వానివే  అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలనే నిబంధనను చట్టంలో ఎందుకు పెట్టారో కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. కానీ సీబీఐ దర్యాప్తు సంస్థగా పరిణతి చెందిన విధానాన్ని పరిశీలిస్తే ఈ ఆశ్చర్యం తొలగిపోతుంది.

సీబీఐ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే అవకతవకలను పరిశోధించే సంస్థగా మాత్రమే ఏర్పడింది. ఆపైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దర్యాప్తు సంస్థగా ఉండాలని నిర్ణయించి ఢిల్లీ పోలీస్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ యాక్ట్‌ ద్వారా దీనిని కొనసాగించారు. అప్పుడు చట్టంలో దీని పరిధిని కేవలం కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తింప చేస్తూ సెక్షన్‌ 5 కింద వివిధ రాష్ట్రాలకు దీనిని విస్తరించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈనాడు దేశవ్యాప్తంగా íసీబీఐకి ఉన్న పరిధి సెక్షన్‌ 5 కింద కేంద్ర ప్రభుత్వం విస్తరించడం వలన మాత్రమే కానీ స్వతహాగా చట్టంతో వచ్చిన అధికారం కాదు. సెక్షన్‌ 5 కింద దీని పరిధిని విస్తరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూనే సెక్షన్‌ 6 కింద అనుమతిచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు.

దర్యాప్తు జరిపే సంస్థ, దర్యాప్తు జరుపబడే సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వానివే అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవటం కొంత అసంబద్ధంగానే కనిపిస్తుంది. ఈ విచక్షణాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో ఉపయోగించినంత కాలం సమస్య ఉత్పన్నం కాలేదు. ఈనాడు కొన్ని రాష్ట్రాలు ఈ సాంకేతికమైన అంశాన్ని మౌలికమైన అంశంగా పరిగణిస్తూ తమ అధికారాలను ఉపయోగిస్తున్నాయి. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని   క్షుణ్ణంగా పరిశీలించి చట్టంలోని ఈ ప్రకరణను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాత్కాలికంగా కొన్ని సమస్యలతో íసీబీఐ కొట్టుమిట్టాడుతున్నా, దీర్ఘకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఇది ప్రధాన పరిశోధనా సంస్థ అనేది నిర్వివాదాంశం. అటువంటి సంస్థ ప్రతి ఒక్క దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తే సంస్థ నిర్వీర్యమయ్యే  అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మీద కానీ, అధికారుల మీద గానీ సీబీఐ దర్యాప్తు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
 
ఈ చర్చలో కొంత విపరీతమైన వాదనలను కొందరు లేవదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏసీబీ దర్యాప్తు చేయగలదు అనేది వీరి వాదన. ఇది సరికాకపోవచ్చు. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను దర్యాప్తు చేయడానికి సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమైనప్పుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను దర్యాప్తు చేయడానికి ఏసీబీకి కేంద్రం అనుమతి అవసరం కదా. కేంద్ర సంస్థలలో నిధులు, పర్యవేక్షణ, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రావు. అలాంట ప్పుడు దర్యాప్తు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేయాలనటం హాస్యాస్పదం.


వ్యాసకర్త : ఐవైఆర్‌ కృష్ణారావు ,ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఈ–మెయిల్‌ :iyrk45@gmail.com
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement