
తెలుగుదేశం పార్టీ చేస్తున్న విన్యాసాలు గమ్మత్తుగా ఉన్నాయి. వారికి ఎప్పుడు ఏ నిరసన చేపట్టాలో కూడా తెలియనట్లుగా ఉంది. గతంలో యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్న సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పట్లో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కుట్రపూరిత కేసులు పెట్టినప్పుడు ఆయన ఎదుర్కున్న తీరు.. అవినీతికి పాల్పడి ప్రభుత్వ నిధులు కైంకర్యం చేశారన్న ఆరోపణలకు గురై జైలు పాలైన చంద్రబాబు నాయుడు వైనానికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
జగన్ కనీసం ప్రభుత్వంలో మంత్రి కాదు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ చేపట్టిన కొన్ని పరిశ్రమలలో కొందరు పెట్టుబడులు పెట్టడాన్నే అవినీతిగా చూపించి, దానికి క్విడ్ ప్రోకో అని పేరుపెట్టి ఆయనను నిర్భంధించారు. విశేషం ఏమిటంటే ఆనాడు మంత్రివర్గం వివిధ పరిశ్రమలకు సాధారణంగా ఇచ్చిన రాయితీలను సైతం తప్పుపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. మంత్రివర్గ నిర్ణయాలకు తనను బాధ్యుడిగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినీతికి పాల్పడ్డారని సీఐడీ పలు ఆధారాలు చూపుతోంది. అయినా చంద్రబాబు అవినీతిపరుడు కాడని తెలుగుదేశం అంటోంది.ఆ పార్టీ వాదనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారు.
✍️ఇక ఆయన కుటుంబ సభ్యులు అబ్బే! మాకు ఎంతో ఆస్తి ఉంది. హెరిటేజ్ లో రెండు శాతం షేర్లు అమ్ముకుంటే రూ.400 కోట్లు వస్తాయి.. అని చెబుతున్నారు. అలాంటప్పుడు ఎంత పద్దతిగా ,ఎంత నిజాయితీగా పాలన సాగించి ఉండాలి. కాని అందుకు విరుద్దంగా నానా రకాల స్కామ్ లకు చంద్రబాబు బృందం పాల్పడింది.జగన్ పై కేసులు పెట్టడం కోసం ఆనాడు న్యాయ వ్యవస్థను వాడుకున్నారని పలువురు మేధావులు బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. ఎందుకంటే జగన్ తో కాని, ఆయన సంస్థలతో కాని సంబంధం లేని వ్యక్తి ఒకరు హైకోర్టుకు లేఖ రాస్తే.. దానిపై కనీసం సంతకం లేకపోయినా విచారణకు తీసుకున్న తీరు విమర్శలకు గురి అయింది. దానిని అత్యంత వేగంగా సీఐబీకి అప్పగించారు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తికి ఉమ్మడి ఏపీలో ఒక ఉన్నత పదవి కూడా ఇవ్వడంతో పలు విమర్శలు వచ్చాయి. సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ పై ఒక కేసు కాదు.. పదకొండు కేసులు పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అప్పట్లో ఎంతగానో నష్టపోయింది. సోనియాగాంధీ, చంద్రబాబు, ఆ సీబీఐ అధికారి అందుకు కారణం అని నిర్వివాదాంశంగా అంతా భావిస్తారు.
పరిశ్రమలు పెట్టకుండా బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినవారేమో దర్జాగా బయట తిరుగుతుంటే వారి జోలికి వెళ్లని సీబీఐ.. ఏపీలో మాత్రం పరిశ్రమలు పెట్టేవారిని అరెస్టు చేసింది. వీరి కుట్ర కారణంగా చీరాల,రేపల్లె ప్రాంతంలో రావాల్సిన పలు భారీ పరిశ్రమలు ఆగిపోయాయి. పదమూడువేల ఎకరాలు సేకరించినప్పటికీ వాటిని నిరుపయోగంగా ఉంచేయవలసి వచ్చింది. అది వినియోగంలోకి వచ్చి ఉంటే వేలాది మందికి ఉపాది కల్పిస్తున్న మరో శ్రీసిటీ తయారయ్యే అవకాశం ఉండేది. అలా జరగనివ్వకుండా అభివృద్దిని అడ్డుకోవడమే కాకుండా ,జగన్ ను ఎలాగైనా రాజకీయాలలో లేకుండా చేయాలని సోనియా, చంద్రబాబులు విపరీతమైన కృషి చేశారు. అప్పట్లో హైకోర్టులో ఈ కేసు రాగానే ఇదేదో కుట్రేమో అని చాలామంది అనుకున్నారు. అలాగే ఆ వ్యవహారం కొనసాగింది.
✍️సీబీఐ జగన్‌కు నోటీసు ఇస్తే.. ఆయన దానిపై విమర్శలు చేయలేదు. మాచర్ల వద్ద ఆయన ప్రచార సభలో ఉన్నప్పటికీ, నిర్దిష్ట తేదీ ప్రకారం సీబీఐ విచారణకు వెళ్లారు. కొన్ని రోజులు ఆ విచారణ చేశాక ఆయన్ని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఉమ్మడి ఏపీ అంతటా అలజడి ఏర్పడింది. కాని గొడవలు జరగలేదు. ప్రజలంతా ఇది కుట్ర అని నమ్మారు. అందుకే ఆ టైమ్ లో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 ఉప ఎన్నికలకుగాను.. పదిహేను చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల, టీఆర్‌ఎస్ ఒక చోట గెలిచాయి. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడింది. కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అలా ప్రజల మద్దతు జగన్ కు లభించింది.
✍️ఆయన జైలులో ఉన్న పదహారు నెలలు న్యాయ పోరాటం చేశారే కాని, రోడ్లపై ఆందోళనలు జరపలేదు. కేవలం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టుకున్నందుకే జగన్ అన్ని కష్టాలు పడవలసి వచ్చింది. తనకు సమస్యలు వస్తాయని తెలిసినా.. జగన్ ధైర్యంగా తట్టుకుని నిలబడ్డారే కాని, ఎక్కడా తగ్గలేదు. డప్పులు కొట్టడాలు, ఈలలు ఊదడాలు వంటివి చేయలేదు. ఆ రోజుల్లో జగన్ పై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత ఘోరమైన కధనాలు రాసేవో తలచుకుంటే చీదర వేస్తోంది. సీబీఐ విచారణ పేరుతో ఉన్నవి.. లేనివి రాసేవారు. పలుమార్లు జగన్‌ను తీహారు జైలుకు పంపేస్తారని, ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదని వార్తలు వండేవారు. తెలుగుదేశం పార్టీ ఎంత నీచంగా విమర్శలు చేసేది అంటే.. వ్యక్తిగత ఆరోపణలకు కూడా దిగేది. చివరికి జగన్ సతీమణి భారతి వెళ్లి ఆయనను జైలులో కలిస్తే కూడా టీడీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేసేవారు..అయినా జగన్ ఓర్పు వహించారు. సహించారు. ధైర్యంతో నిలబడ్డారు. తదుపరి 2014లో అనూహ్యంగా తన పార్టీ గెలవకపోయినా ఆయన చలించకుండా తనదైన శైలిలో ప్రజలలో తిరిగి వారి ఆదరణ పొందారు. అది జగన్ ధైర్యం.
ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలానివి. జగన్ ప్రభుత్వం రాగానే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వాటిలో వాస్తవాలను వెలికితీయించింది. అవినీతికి ఆధారాలను కనుగొంది. రాష్ట్ర ప్రభుత్వమే కాదు. కేంద్రానికి చెందిన ఆదాయపన్ను శాఖ చంద్రబాబు కు ఒక నోటీసు పంపి రూ. 118 కోట్ల రూపాయల నల్లధనం ఆయన ఖాతాలలోకి వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపి వివరణ కోరింది. అంతకుముందు చంద్రబాబు పీఎస్‌గా ఉన్న శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరపడం, చంద్రబాబు టైమ్ లో కాంట్రాక్టులు పొందిన షాపూర్ జీ సంస్థలలో దొరికిన ఆధారాలతో రెండువేల కోట్ల అవకతవకతలు జరిగినట్లు అధికారికంగానే సీబీటీడీ ప్రకటించింది. అయినప్పటికీ చంద్రబాబు అత్యంత నీతిమంతుడని తెలుగుదేశం కాని, ఆయన కుటుంబ సభ్యులు కాని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని అవినీతిని సహించను అంటూ బీరాలు పలికిన రామోజీరావు కూడా చంద్రబాబు అసలు అవినీతికి పాల్పడలేదని డబాయిస్తూ కధనాలు ఇస్తున్నారు. తెలుగుదేశం కరపత్రికగా ఈనాడు మీడియాను ఆయన మార్చేశారు. ఆయన పత్రిక చూసినా, ఆయన టీవీని చూసినా నిత్యం అబద్దాలు తప్ప ఇంకేవీ కనిపించడం లేదు. పూర్తిగా విశ్వసనీయతను రామోజీ కోల్పోయారు.
✍️ఇక ఆంద్రజ్యోతి ,టివి 5 వంటి వాటి గురించి రాయడం వృధా. వారు ఎప్పటినుంచో బట్టలు ఊడదీసుకుని శరభ,శరభ అంటూ వేప రెమ్మలు కట్టుకుని తిరుగుతున్నారు. సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేసింది. తెలుగుదేశం వారంతా తమ అధినేత దొరికిపోయారే అని మదనపడుతున్న తరుణంలో ,ఎల్లో మీడియా మాత్రం అసలు ఏమీ జరగలేదని, స్కిల్ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి శిక్షణ ఇచ్చారంటూ పిచ్చి ప్రచారం ఆరంభించింది. అంతే తప్ప 240 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు, లోకేష్ లకే చేరిందన్న సీఐడీ వాదనకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు,అమరావతి అస్సైన్డ్ భూములు మొదలైన స్కాములన్నిటిపైన సాక్ష్యాధారాలతో ఏపీ సీఐడీ కేసులు పెడుతుంటే.. వీరికి గుక్క తిరగడం లేదు.గతంలో జగన్ పై కేసులు పెట్టి సీబీఐ విచారణ పేరుతో తంతు సాగిస్తే, ఇప్పుడు సీఐడీ పూర్తి విచారణ చేపట్టి, ఆధారాలు దొరికిన తర్వాతే ,వందల కోట్లు స్వాహా అయ్యాయని నమ్మిన తర్వాతే చంద్రబాబుపై, ఆయన అనుచరులపై కేసులు పెట్టింది.
✍️గతంలో న్యాయ వ్యవస్థలో తాము ఏమి అనుకుంటే అది జరుగుతుందని భావించిన తెలుగుదేశం పార్టీవారికి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటే వాటిని తట్టుకోలేకపోతున్నారు. జగన్ కేసుల్లో కాని, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వివిధ విషయాలలో న్యాయ వ్యవస్థ అనుసరించిన వైఖరిపై కూడా విమర్శలు వస్తే , ఆ వ్యవస్తనే తప్పు పడతారా అంటూ తెలుగుదేశం దీర్ఘాలు తీసేది.కాని తన విషయానికి వచ్చేసరికి మాత్రం జడ్జిలను వ్యక్తిగతంగా దూషించడానికి వెనుకాడలేదు. కోర్టులు అన్నిటిని పరిశీలించి చంద్రబాబును రిమాండ్ ద్వారా జైలుకు పంపింది. కింది కోర్టులలో సానుకూల తీర్పులు రాకపోవడంతో ప్రస్తుతం సుప్రింకోర్టుకు చంద్రబాబు వెళ్లారు.ఈలోగా కేసులకు భయపడి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఢిల్లీకి చిత్తగించి ఇరవై రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఇంతకాలం మమ్మల్ని ఏమీ చేయలేరు.. ఏం పీకారు..అంటూ రోతరోతగా మాట్లాడిన వీరు ఇప్పుడు హడలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్రమ కేసులు అంటూ నిరసనలు, ర్యాలీలు తీస్తున్నారు. క్యాండిళ్లు వెలిగిస్తున్నారు. డప్పులు కొడుతున్నారు. విజిల్స్ ఊదుతున్నారు.వాటిని చూసేవారు ఆశ్చర్యపోయే పరిస్థితి.
✍️చంద్రబాబు జైలుకు వెళితే వీరు సంబరాలు చేసుకున్నట్లు ఉంది తప్ప బాధపడుతున్నట్లు లేదని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. నిజంగానే చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఆ డప్పు కొట్టడం ఏమిటి? విజిల్ ఊదడం ఏమిటి? శాసనసభలో ఆమె తండ్రి బాలకృష్ణ అలాగే విజిల్ ఊది నవ్వులపాలైతే, అదే దారిలో ఆమె కూడా వ్యవహరించడం విడ్డూరంగానే ఉంది. వీరు ప్లేట్లు తీసుకుని మోత చేస్తుంటే, గతంలో చంద్రబాబు పాలనలో కాపు రిజర్వేషన్ ఆందోళనకారులు కంచాలు కొట్టినప్పుడు ఆ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించింది అందరికి గుర్తుకు వచ్చింది.గతంలో జగన్ ను కోర్టు జైలుకు పంపింది కనుక అవన్ని సక్రమ కేసులని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేసేవారు. మరి ఇప్పుడు అదే కోర్టు తనను జైలుకు పంపితే మాత్రం అది అక్రమం అని అంటున్నారు.ఆయన నిరసన దీక్ష చేశారట ఆయనకు సంఘీబావంగా ఆయన భార్య భువనేశ్వరి కూడా దీక్ష చేశారు.ఇవి నిరసనలతో పోయే కేసులా? కోర్టులలో రుజువు చేసుకోవలసిన కేసులు కదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కాకపోతే చంద్రబాబు జైలుకు వెళితే వెళ్లారు ..కనీసం సానుభూతి అయినా సంపాదించాలన్న యావలో ఇలా చేస్తున్నట్లుగా ఉంది.
✍️అప్పట్లో జగన్ ముందుగా బెయిల్ కోసం ప్రయత్నించారు.కాని దానికి కూడా అడుగడుగునా అడ్డుపడేవారు. మామూలుగా అయితే మూడు రోజులలో బెయిల్ రావల్సిన కేసుల్లో జగన్ ను కాబట్టి పదహారు నెలలు ఉంచారని ఒక సీనియర్ న్యాయవాది అప్పట్లో నాతో చెప్పారు. ఇప్పుడు బెయిల్ కోసం కాకుండా కేసును కొట్టివేయించుకోవాలని చంద్రబాబు లాయర్ల ప్రయత్నమట.అందుకే కేసు లోతుల్లోకి వెళ్లకుండా సాంకేతిక అంశాలకే పరిమితమై వాదనలు చేస్తున్నారు. అప్పట్లో జగన్ లాయర్లు ఎక్కడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు. కాని చంద్రబాబు లాయర్ మాత్రం తాము కోరుకున్న న్యాయం దొరకకపోతే కత్తిపట్టాలన్న ఒక సూక్తిని ప్రచారంలోకి తెచ్చారు.తద్వారా వారు ఎంత డిస్పరేట్ గా ఉందీ తెలియచెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థలో తన ఇష్టం వచ్చినట్లు చెలామణి చేసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు కాలం మారిందన్న సంగతి అర్దం అవుతుండాలి.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment