ఓవరాక్షన్‌ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు? | Yellow Media Chandrababu Over Action On Avinash Reddy Episode | Sakshi
Sakshi News home page

‘అచ్చెన్నాయుడు పైల్స్.. వాళ్ల మాయరోగాలు గుర్తున్నాయా?’

Published Thu, May 25 2023 9:19 AM | Last Updated on Thu, May 25 2023 12:16 PM

Chandrababu Over Action On ys vivekananda case - Sakshi

‘ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అది బయటి వారికి  చాలా అసహ్యంగానూ అనిపిస్తోంది. రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోవాలా? అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. అవినాష్ రెడ్డిని  సిబిఐ ఇంకా  అరెస్ట్ చేయకపోవడం ఏంటి? సిబిఐ ఇంత బలహీనంగా ఉందా? అంటూ  ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. టిడిపి అనుకూల మీడియాల్లో డిబేట్స్ చూస్తోంటే సీబీఐ అరెస్ట్ చేయకపోతే  మీడియా ప్రతినిథులే వెళ్లి అవినాష్ ను అరెస్ట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇటువంటి ట్రెండ్  గతంలో  ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.‘


ఏపీలో 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ హత్య జరిగే నాటికి ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. కొంతకాలంగా ఈ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితులను విచారించిన సీబీఐ..  ఆ తర్వాత మరి కొందరిని పిలిచి విచారిస్తోంది. ఈ క్రమంలో భాగంగా వివేకా మరో సోదరుడు వైఎస్ భాస్కర రెడ్డి తో పాటు ఆయన తనయుడు.. కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని సీబీఐ  విచారించింది. భాస్కర రెడ్డిని రిమాండ్ లో తీసుకున్న సీబీఐ.. అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు దఫాలు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు పిలిచింది. అయితే.. 

అవినాష్ రెడ్డి తల్లికు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించేందుకు వెళ్లాల్సి రావడం.. తాను విచారణకు రాలేనని  అవినాష్ రెడ్డి సిబిఐ కి లేఖ రాశారు. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తన బెయిల్ పిటిషన్ ను విచారించాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరారు. 

అవినాష్ రెడ్డి తల్లికి కర్నూలు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు కూడా బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూ లో కొద్ది రోజులు చికిత్స అందించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. తన తండ్రి భాస్కర రెడ్డి  అరెస్ట్ అయి ఉన్నందున తన తల్లిని తానే చూసుకోవాలి కాబట్టి ఈ నెల 27 వరకు  తనకు గడువు నివ్వాలని.. ఆ తర్వాత తాను  విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో కోరారు. అంతే.. 

ఈ వార్తలు మీడియాలో  ప్రసారం అవుతుండగానే  అటు టీడీపీ నేతలు, ఇటు  టీడీపీ అనుకూల ఛానెళ్లూ కూడా.. ‘‘అదేంటీ?.. అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి?.. ఏం! సీబీఐ మరీ అంత బలహీనంగా ఉందా?’’ అంటూ డిబేట్స్ నడపడం మొదలు పెట్టారు. అటు టిడిపి నేతలు అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలంటే డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం  ఏ మాత్రం సహకరించకపోగా..  వ్యతిరేకంగా పావులు కదుపుతోందంటూ  కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనిపై న్యాయ రంగ నిపుణులు మండి పడుతున్నారు.

👉 ‘అసలు ఎవరిని అరెస్టు చేయాలి?..’ అది చెప్పడానికి మీడియా ఎవరు? సీబీఐ ఎవరిని అరెస్ట్ చేయాలో ఎప్పుడు అరెస్ట్ చేయాలో అసలు చేయాలో చేయకూడదో మీడియా చెప్పడం ఏంటి? దర్యాప్తు సంస్థకు దమ్ము ఉందా లేదా అన్నది కూడా మీడియానే  తేల్చేయడం ఏంటి? తమ రాజకీయ ప్రత్యర్ధులు అయితే వెంటనే అరెస్ట్ చేసేయాలి అదే తమపై కేసులు వచ్చి తమని అరెస్ట్ చేస్తే రాజకీయంగా కక్షసాధిస్తారా? అంటూ దబాయింపు సెక్షన్  విరుచుకు పడిపోతారు . ఇదేం పద్ధతి? అంటున్నారు న్యాయ రంగ నిపుణులు. 

👉 వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు కారు. ఆయనపై ఉన్న అభియోగం  అల్లా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు  తారు మారు చేయించారని. అది కూడా ఆయన చేశారని కాదు. అసలు వివేకానంద రెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు దస్తగిరి బెయిల్ పై హాయిగా బయట తిరుగుతున్నాడు.  అనుమానాలు మాత్రమే ఉన్న అవినాష్ రెడ్డిని మాత్రం.. తక్షణమే అరెస్ట్ చేసేయాలంటూ టీడీపీ నేతలు  పట్టుబడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ  ఓ పత్రిక రాసి పారేసింది. నిజానికి సీబీఐ ఇంత వరకు దీనిపై ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. ప్రభుత్వంపై కానీ అవినాష్ రెడ్డిపై కానీ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. అవినాష్ రెడ్డి అడిగింది కూడా నాలుగు రోజుల పాటు విచారణకు గడువు ఇమ్మనమనే.  అది కూడా తల్లి ఆరోగ్యం బాగా లేదు కాబట్టి. అయితే టీడీపీ నేతలు.. వారి అనుకూల ఛానెళ్లు సీబీఐకి ఏదో అపచారం జరిగిపోతోన్నట్లు.. ధర్మాన్ని ఎవరో అడ్డుకుంటోన్నట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు.

👉 కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి సహకరించకపోవడం క్షమించరాని నేరం అంటున్న  ఆ పత్రిక.. గతంలో చంద్రబాబు నాయుడు, ఇదే సీబీఐ ఏపీలో అడుగు పెట్టనివ్వకుండా ఏకంగా జీవో జారీ చేస్తే  అపుడు సిబిఐ దుర్మార్గమైన దర్యాప్తు సంస్థ అన్నట్లు.. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందన్నట్లు కథనాలు  వండి వార్చింది. అపుడు టిడిపి నేతలు కూడా సీబీఐని పనికిమాలిన సంస్థగా ఏకి పారేశారు. ఇపుడు  తాము ప్రతిపక్షంలోకి వచ్చే సరికి  తమ ప్రత్యర్ధులపై  ఓ కేసు వచ్చింది కాబట్టి  టిడిపి నేతలు ఇపుడు సిబిఐని  కీర్తిస్తున్నారని  న్యాయ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని అవినాష్ అంటోంటే ‘అదంతా నాటకం.. డ్రామా..’ అంటూ  టీడీపీ నేతలు, మాజీ మంత్రులు  ప్రచారం చేస్తున్నారు.

‘‘2019లో టిడిపి ప్రతిపక్షంలోకి జారుకున్నాక  వారి హయాంలో చేసిన అవినీతికి సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసే సందర్భాల్లో టిడిపి నేతలు కూడా ఆసుపత్రుల్లో చేరారు. అచ్చెంనాయుడు అయితే తనకి పైల్స్ ఆపరేషన్ అయ్యిందని నెలల తరబడి ఆసుపత్రి బెడ్ దిగలేదు. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోనని చెప్పి టిడిపి అనుకూల వర్గీయులది అయిన రమేష్ హాస్పిటల్ లో ఆయన కాలక్షేపం చేసి విచారణ నుండి తప్పించుకున్నారు.  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి.. టిడిపి తరపున వ్యవహారాలు నడుపుతోన్న రఘురామ కృష్ణం రాజు  కులాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తనని కొట్టేశారంటూ  ఆరోపణలు చేసి  బెయిల్ తెచ్చుకుని   తనకు అనుకూలంగా ఉండే ఆర్మీ ఆసుపత్రిలో  చికిత్స పొందారే తప్ప ఏపీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందలేదు. మార్గదర్శి  చిట్స్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై  సిఐడీ అధికారులు సోదాలకు వెళ్లినపుడు  ఆ సంస్థ అధినేత రామోజీ రావు అమాంతం మంచం పై పడుక్కుని ఆరోగ్యం బాగా లేదని చెప్పుకున్నారు. విచారణకు కూడా  సిద్ధంగా లేనని చెప్పించారు. అయితే అలాగని లిఖిత పూర్వకంగా రాసి  ఇస్తారా అని డాక్టర్లను సిఐడీ అధికారులు అడగడంతో వాళ్లు నీళ్లు నమిలి విచారణకు హాజరు కావచ్చునని ఒప్పుకున్నారు. టిడిపి నేత సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసంలో ఓ సినీ నిర్మాతపై  తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో బాలయ్యను అరెస్ట్ చేయాల్సి వచ్చినపుడు అమాంతం బాలయ్యకు మానసిక పరిస్థితి బాగా లేదని మతి చలించిందని వైద్యుల చేత సర్టిఫికెట్ పుట్టించుకుని  అరెస్ట్ నుండి తప్పించుకున్నారు.’’ ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వీటినే గుర్తు చేస్తున్నారు.


అప్పట్లో.. ఆస్పత్రిలో అచ్చెన్న

👉 టిడిపి నేతలను అరెస్ట్ చేసే సందర్భాల్లో వాళ్లకి మాయరోగాలు వస్తాయి.. వాళ్లు తమకు అనుకూలమైన ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు.. చివరకు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు.. అదే అవినాష్ రెడ్డి తల్లి పరిస్థితి బాగా లేక విచారణకు సమయం కావాలని అడిగితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరు? అంటూ టిడిపి నేతలు, టిడిపి అనుకూల పత్రికలు  ప్రశ్నించడంలో అర్ధం లేదని పాలక పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిపై  పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో విచారణలు జరక్కుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకుని  కాలక్షేపం చేస్తున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడి పార్టీ నేతలు   గురివింద గింజలాగా   నీతులు చెప్పడం  విడ్డూరంగా ఉందంటున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు.

👉 ప్రస్తుతానికి  అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా తెలంగాణా హై కోర్టును  సుప్రీం కోర్టు  ఆదేశించింది. హై కోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా  అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను సూచించింది.   ఈఘటనలో టిడిపి నేతలతో సమానంగా మీడియా ప్రతినిథులు కూడా తామే న్యాయమూర్తులు అయినట్లు, దర్యాప్తు సంస్థల అధికారులు అయినట్లు  విచారించేసి తీర్పులు ఇచ్చేస్తున్నారనే చర్చ కూడా ఒకటి నడుస్తోంది. ఈ పద్ధతి మారాలని అంటున్నారు కొందరు. 

అసలు సీబీఐని ఏపీలోకి అనుమతించాలా? అడ్డుకోవాలా? అన్న అంశంపై టిడిపి నేతలు తమ వైఖరి ఏంటో ఇప్పటికైనా స్పష్టం చేయాలంటున్నారు పాలక పక్ష నేతలు. అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే అందుకు పూర్తి భిన్నంగా యూటర్నులు తీసుకోవడం చంద్రబాబు నాయుడికి మొదట్నుంచీ అలవాటే అంటున్నారు రాజకీయ పండితులు.

::: CNS యాజులు, సాక్షి టీవీ

ఇదీ చదవండి: ఆ టీడీపీ ఎమ్మెల్యే వస్తే ఊరంతా హడల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement