20 ఏళ్ల కిందటే అత్యంత భారీ దోపిడీకి స్కెచ్
ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపిన చంద్రబాబు
హైదరాబాద్‌లో విలువైన 850 ఎకరాలు.. రూ.2 కోట్లకే కేటాయింపు
అప్పట్లోనే వాటి విలువ రూ.20వేల కోట్లు... ఇప్పుడు రూ.60వేల కోట్లపైనే
స్టేడియంలన్నీ లీజుకివ్వటంతో పాటు నిర్వహణ వ్యయాలు సర్కారువే
మొత్తం క్రీడారంగాన్ని బిల్లీరావు చేతిలో పెట్టేసిన నారా వారి నిర్వాకం
అలా మరో రూ.50–60వేల కోట్లు లబ్ధి చేకూర్చేందుకు పన్నాగం
అదే జరిగితే రాష్ట్రంలో సామాన్యులకు క్రీడలే దూరమయ్యేవి
2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే అన్నీ కానిచ్చేసిన తీరు
2004లో వైఎస్సార్ గెలవటంతో ఒప్పందం వెనక కుట్ర బట్టబయలు
రద్దు చేసి భూముల్ని వెనక్కి తీసుకుని... సీబీఐ విచారణకు ఆదేశం
తగిన సిబ్బంది లేరంటూ సీబీఐ విచారణ చేయని లక్ష్మీనారాయణ
భూములు వెనక్కి తీసుకోవటంపై కోర్టుకెక్కిన చంద్రబాబు బినామీ బిల్లీ
కోర్టుల్ని ‘మేనేజ్’ చేయటానికి మొత్తం స్కీమ్‌తో సిద్ధమైన ముఠా
రహస్య కెమెరాల ‘సాక్షి’గా 2009 లోనే ఇవన్నీ వెల్లడించిన బిల్లీ రావు
కుట్ర మొత్తం బట్టబయలవటంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్
బిల్లీ వేసిన కేసును గురువారం నాడు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
సీబీఐ విచారణ ఎందుకు జరిపించ లేదని తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్న
కుదరదని చెబితే తామే ఆదేశిస్తామంటూ... వారం రోజుల గడువు
అప్పట్లోనే సీబీఐ దర్యాప్తు జరిగితే ఈ పాటికి బాబు జైల్లోకి
సాక్షి, అమరావతి: చంద్రబాబు నిజంగా విజనరీయే. 20 ఏళ్ల కిందటే రూ. లక్ష కోట్లు కొట్టేయడానికి పన్నాగం పన్నారంటే... అందుకోసం ఎవ్వరి దృష్టీ పడని క్రీడా రంగాన్ని ఎంచుకున్నారంటే ఏమనుకోవాలి. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబిలరావు చేత ‘ఐఎంజీ అకాడెమీస్ భారత్’ అనే కంపెనీని పెట్టించి... అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి... హడావుడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి, సేల్‌డీడ్ కూడా చేసేశారంటే ఏమనుకోవాలి?
శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించటంతో పాటు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్ల పాటు లీజుకిచ్చేసి... వాటి నిర్వహణ ఛార్జీలను కూడా ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారంటే ఏమనుకోవాలి? క్రీడల ద్వారా, వాటి అడ్వర్టయిజ్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే డబ్బులన్నీ ఐఎంజీ అకాడెమీస్‌కే చెందేలా భారీ దోపిడీకి పథకం వెయ్యగలిగారంటే ఆయన విజనరీయే కదా? ఇప్పటి విలువల ప్రకారం చూస్తే ఈ స్కామ్ విలువ లక్ష కోట్లపైనే.
స్పై కెమెరాకు పట్టుబడిన బిల్లీ...
ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుంది కాబట్టే 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచారు. బాబు ఓడిపోయారు. వైఎస్సార్ ప్రభుత్వం ఐఎంజీ కేటాయింపుల్ని సమీక్షించినపుడు మొత్తం బోగస్ కంపెనీలేనని తేలటంతో ఒప్పందాన్ని రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంది. కానీ బాబు గారి ముఠా ఊరుకోలేదు. తమకు కోర్టుల్లో బలం ఉంది కనక... న్యాయస్థానంలో సవాల్ చేశారు. 2009 ఎన్నికల ముందు... ఈ కేసులో తీర్పు వెలువడవచ్చని బిల్లీరావు భావించారు. ఆ సమయంలో ఆయన సన్నిహితుడొకరు ఆయన్ను కలిసి.. తమ సంభాషణను స్పై కెమెరాతో రికార్డు చేశారు.
వ్యవస్థ నిర్ఘాంతపోయే నిజాల్ని అప్పట్లో బిల్లీరావు వెల్లడించారు. వాటిని ‘సాక్షి’ ప్రచురించింది కూడా. అప్పట్లో అది సంచలనం కావటంతో... తీర్పు వాయిదా పడింది. న్యాయమూర్తులు మారటంతో సుదీర్ఘకాలం కొనసాగింది. తాజాగా గురువారంనాడు బిల్లీరావు తమకే కేటాయించిన భూముల్ని తమకు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు... అది మొత్తం వ్యవస్థ నివ్వెరపోయే కుంభకోణమని తేల్చింది. చంద్రబాబు దోపిడీని బయటపెట్టింది. దీనిపై వైఎస్సార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా... అప్పట్లో ఇన్‌ఛార్జిగా ఉన్న సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ... తమకు తగిన సిబ్బంది లేరన్న సాకుతో దాన్ని చేపట్టలేదు.
తాజాగా గురువారంనాడు హైకోర్టు ఈ వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ... దీనిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశిస్తామని కూడా స్పష్టంచేసింది. ఈ అంశంపై సమాధానమివ్వాలంటూ అక్కడి ప్రభుత్వానికి వారం రోజుల గడువునిచ్చింది. నిజానికి అప్పట్లోనే సీబీఐ దర్యాప్తు జరిపి ఉంటే.. ఈ పాటికే బాబు దోపిడీ బయటపడి, చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కబెడుతుండేవారని స్పష్టంగా చెప్పొచ్చు.
బాబు... నా జేబులో ఉంటారన్న బిల్లీ
తాజా పరిణామాల నేపథ్యంలో... అప్పట్లో బిల్లీరావు స్పై కెమెరాల సాక్షిగా ఏమన్నారు... బాబు ఎంత ఎంత పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు? వ్యవస్థలో ఎంతమందిని వాడేశారు? వంటి వివరాలు మరొక్కసారి చూద్దాం. ‘‘ఇదిగో తీర్పు ...ఇదే మనకు అనుకూలంగా రాబోతున్న కోర్టు తీర్పు కాపి. ఈ తీర్పును నేనే రాశాను. నేను ఏది రాస్తే అదే తీర్పుగా వస్తుంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ––– కు ఎంత డబ్బులు ఇవ్వాలో చంద్రబాబే చెప్పారు.
అసలు ఆయనకు ఉన్న జ్ఞాపక శక్తి అలాంటిది. ఆయనే అన్నీ చూస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలేపి అడిగినా ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన చెప్పేస్తారు. నేను ఏం చెబితే చంద్రబాబు అది చేస్తారు’’. వాస్తవానికి నాటి వీడియోలో న్యాయ వ్యవస్థలోని పలువురి పేర్లను బిల్లీ వాడేశారు. ‘సాక్షి’ వాటిని ప్రచురించలేదు. ఆ వీడియో కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది కూడా.
క్రీడా వ్యవస్థను చెరబట్టేందుకు పన్నాగం
కేవలం కాగితాలకే పరిమితమైన ఐంఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మిడి ఆంధ్ర ప్రదేశ్‌లోని యావత్ క్రీడా వ్యవస్థను ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు కుతంతం్ర పన్నారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం గెలిచినా, వైఎస్సార్ ప్రభుత్వం నాటి ఒప్పందాన్ని రద్దు చేయకపోయినా... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థ మొత్తం ఓ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయేది. సామాన్యులెవ్వరూ క్రీడల్లోకి ప్రవేశించే ఆలోచన కూడా చేయలేకపోయేవారు. ఎందుకంటే ఐఎంజీ భారత్ కంపెనీతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అలాంటిది.
కేవలం హైదరాబాద్ గచ్చిబౌలిలోని 850 ఎకరాలను కేటాయించడమే కాదు. 16 స్టేడియంలు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని యావత్ క్రీడా వ్యవస్థను తన బినామీ బిల్లీ రావుకు 45 ఏళ్లపాటు లీజు పేరిట కట్టబెట్టేశారు. ఆ సమయంలో ఆ స్టేడియంలు, వాటి ఆస్తుల నిర్వహణ అంతా ఐంఎంజీ భారత్ పెత్తనం కిందకే వస్తాయి. కానీ ఏటా నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. బీమా ప్రీమియాన్నీ చెల్లిస్తుంది. స్టేడియాల నిర్వహణ కోసం ఆ కంపెనీకి ఉచిత నీరు, ఉచిత విద్యుత్, వినోద పన్ను రాయితీ, విదేశీ సుంకం రాయితీలు అన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. టీవీ ప్రసార హక్కుల ఆదాయం ఆ కంపెనీకే దక్కుతుంది.
అంతేకాదు.. మరో ప్రమాదకరమైన నిబంధననూ చేర్చారు. స్టేడియంలు, వాటి ఆస్తులను ఐఎంజీ భారత్ తన విచక్షణ మేరకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసుకోవచ్చనే క్లాజును చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే ఆ క్లాజు కింద ఆ స్టేడియంలను ఐఎంజీ భారత్ తన సొంతం చేసుకునే హక్కు కల్పించడమన్న మాట. అంటే రాష్ట్రంలో 45 ఏళ్ల పాటు క్రీడా వ్యవస్థ అంతా ఐఎంజీ భారత్ కంపెనీ ముసుగులో చంద్రబాబు గుత్తాధిపత్యం కింద ఉంటుంది. ఏదో ఒక సాకు చూపించి స్టేడియంలు, వాటి ఆస్తులన కూడా ఆ కంపెనీ తాను నిర్ణయించిన నామమాత్రపు ధర కింద కొనుగోలు చేసేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం చంద్రబాబు భాషలో చెప్పాలంటే... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను చంద్రబాబు కుర్చీ మాదిరి మడతపెట్టేస్తారన్నది సుస్పష్టం.
కాగా న్యాయ వ్యవస్థ తన నిబద్ధతను, విశ్వసనీయతను మరోసారి చాటిచెప్పింది. చంద్రబాబు, ఐఎంజీ భారత్ కంపెనీ కుతంత్రాలను తిప్పికొట్టింది. ఐంఎంజీ భారత్‌కు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌లో 850 ఎకరాలను కేటాయించడాన్ని రద్దు చేస్తూ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆ భూకేటాయింపులు సరైన నిర్ణయమేనని తీర్పునిచ్చింది. దాంతో చంద్రబాబు భూబాగోతం బెడిసికొట్టింది. ఇపుడు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తే... చంద్రబాబు ఊచలు లెక్కబెట్టడం ఖాయమనేది న్యాయవర్గాల మాట.
Comments
Please login to add a commentAdd a comment