రాజ్యాంగేతర శక్తిగా ‘సీఎంవో’ | Former CS IYR 'pill' in High court on CMO | Sakshi
Sakshi News home page

రాజ్యాంగేతర శక్తిగా ‘సీఎంవో’

Published Tue, Oct 24 2017 3:59 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Former CS IYR 'pill' in High court on CMO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం(సీఎంవో) పనితీరుపై  రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఐవైఆర్‌ కృష్ణారావు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. కొంతకాలంగా సీఎంవో రాజ్యాంగేతర శక్తిగా, రాజకీయ కార్యాలయంగా మారిపోయిందని.. దీన్ని సంస్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. సీఎంవో పారదర్శకంగా పనిచేసేందుకు ఓ నిర్ధిష్ట విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. సీఎంవో పనితీరు సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, ప్రజల విషయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా ఏపీ సెక్రటేరియట్‌ ఆఫీస్‌ మాన్యువల్, ఏపీ బిజినెస్‌ రూల్స్‌కు సవరణలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సవరణలు సీఎంవోకు వర్తింపచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. 

అనధికార నోట్స్‌ ధ్వంసం చేస్తున్నారు...
‘గతంలో నేను సీఎస్‌గా పనిచేశా. ఆ అనుభవంతో సీఎంవో పనితీరు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సీఎంకు వచ్చే ఫైళ్లను పరిష్కరించేందుకు ఏర్పాటైన ఓ చిన్న వ్యవస్థే సీఎంవో. ఆ తరువాత కాలంలో సీఎంవో విస్తృతి పెరిగి సమాంతర సచివాలయంగా మారిపోయింది. ఇందులో ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇతర సర్వీసుల్లోని అధికారులు, ఇతర కేడర్‌కు చెందిన అధికారులకు సైతం సీఎంవోలో స్థానం కల్పిస్తారు. ప్రస్తుతం సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, అదనపు కార్యదర్శి ఉన్నారు. ఈ హోదాల్లో వీరు సీఎంకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. వీటికి సంబంధించి సీఎంవో ఎలాంటి రికార్డులను నిర్వహించడం లేదు. దీనికి సంబంధించి ఫైళ్లపై ఈ అధికారుల సంతకాలు కూడా ఉండటం లేదు. ఈ అధికారులు తమ సౌకర్యాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో అనధికార నోట్స్‌ తయారు చేసి  తరువాత ధ్వంసం చేస్తుంటారు.

సీఎంవో అధికారులు అనుసరించేందుకు నిర్ధిష్ట విధానం అంటూ ఏదీ లేదు. తమకు ఎటువంటి బాధ్యత లేదనట్లే వ్యవహరిస్తారు. ఇది ప్రజాప్రయోజనాలకు విరుద్ధం. సీఎంవో పనితీరును నియంత్రించే ఎలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లే అంతా ఇష్టానుసారం జరుగుతూ వస్తోంది. ఫైలు సిద్ధం చేసిన అధికారిపైనే దానికి సంబంధించిన బాధ్యత అంతా ఉంటుంది. ఈ మ్యాన్యువల్‌ను సీఎంవోకు వర్తింప చేస్తే అక్కడ పనిచేసే అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సచివాలయ నిర్వచన పరిధిలో సీఎం కార్యదర్శి లేరని చెబుతూ సీఎంవోకు సెక్రటేరియట్‌ మ్యాన్యువల్‌ను వర్తింప చేయడం లేదు. సీఎంవో పనితీరును తెలుసుకునేందుకు ఈ ఏడాది జూలై 17న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి ఓ ఫైల్‌ కాపీ ఇవ్వాలని కోరితే ఎలాంటి స్పందన లేదు. దీన్ని బట్టి అక్కడ ఫైళ్లకు సంబంధించిన రికార్డులను నిర్వహించడం లేదని అర్థమవుతోంది’ అని ఐవైఆర్‌ పేర్కొన్నారు.

ప్రధాని, గవర్నర్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు..
‘గవర్నర్‌ కార్యాలయానికి సెక్రటేరియట్‌ మ్యాన్యువల్‌ వర్తించనప్పటికీ అక్కడి అధికారులు మాత్రం రికార్డులను చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఫైలుపై అక్కడి అధికారుల సంతకం ఉంది. ఈ విషయం కూడా నాకు స.హ దరఖాస్తు ద్వారా తెలిసింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో కూడా రికార్డులను నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల మొదలు పీఎంవో వరకు రికార్డులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బాధ్యత లేని అపరిమిత అధికారం వల్ల వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ఇక్కడ రహస్యమనే మాటకే తావులేదు. కేవలం అధికారం మీద మాత్రమే దృష్టి సారించడం వల్ల సీఎంవో రాజ్యాంగేతర శక్తిగా మారింది. కొంత కాలంగా సీఎంవో ఓ రాజకీయ కార్యాలయంగా మారిపోయింది.’ అని కృష్ణారావు తన పిటిషన్‌లో వివరించారు. దీనిపై జోక్యం చేసుకుని నిర్ధిష్ట విధానం ప్రకారం సీఎంవో పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement