సాక్షి, హైదరాబాద్ : నిధుల వినియోగ ధ్రువీకరణ (యూసీ) విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం అసత్యాలు చెబుతున్నారంటూ ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్‌లో గురువారం సాక్షితో ఐవైఆర్ మాట్లాడారు.
‘లోటు బడ్జెట్ విషయంలో కేంద్రం యూసీ అడుగుతోందంటూ చంద్రబాబు చెప్పేదాంట్లో ఎలాంటి నిజం లేదు. సంక్షేమ రంగాలకు కేటాయించిన నిధుల విషయంలో మాత్రమే యూసీ ఇవ్వాల్సి ఉంటుంది. నిధుల దుర్వినియోగం జరగకపోతే యూసీ ఇవ్వటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం తటపటాయించటం అనుమానాలకు తావిస్తోంది’ అని ఐవైఆర్ పేర్కొన్నారు.
కాగా, రాజధాని నిర్మాణానికి అప్పులు ఇవ్వాలంటూ ప్రజలకు చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తి ప్రమాదకరంగా మారుతోందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో మూడు పెద్ద నగరాలు ఉన్నాయని.. అలాంటప్పుడు మెగాసిటీ ఎందుకని? ప్రశ్నించారు. కేవలం పాలనా పరమైన రాజధాని నిర్మిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రాజధానికి ఎవరూ వ్యతిరేకం కాదన్న ఐవైఆర్.. అందుకోసం రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టడం సరైందని కాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment