Utilization Certificates
-
అసెంబ్లీలో చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారు
-
ఆ ప్రచారం అవాస్తవం : ఐవైఆర్
సాక్షి, హైదరాబాద్ : నిధుల వినియోగ ధ్రువీకరణ (యూసీ) విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం అసత్యాలు చెబుతున్నారంటూ ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్‌లో గురువారం సాక్షితో ఐవైఆర్ మాట్లాడారు. ‘లోటు బడ్జెట్ విషయంలో కేంద్రం యూసీ అడుగుతోందంటూ చంద్రబాబు చెప్పేదాంట్లో ఎలాంటి నిజం లేదు. సంక్షేమ రంగాలకు కేటాయించిన నిధుల విషయంలో మాత్రమే యూసీ ఇవ్వాల్సి ఉంటుంది. నిధుల దుర్వినియోగం జరగకపోతే యూసీ ఇవ్వటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం తటపటాయించటం అనుమానాలకు తావిస్తోంది’ అని ఐవైఆర్ పేర్కొన్నారు. కాగా, రాజధాని నిర్మాణానికి అప్పులు ఇవ్వాలంటూ ప్రజలకు చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తి ప్రమాదకరంగా మారుతోందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో మూడు పెద్ద నగరాలు ఉన్నాయని.. అలాంటప్పుడు మెగాసిటీ ఎందుకని? ప్రశ్నించారు. కేవలం పాలనా పరమైన రాజధాని నిర్మిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రాజధానికి ఎవరూ వ్యతిరేకం కాదన్న ఐవైఆర్.. అందుకోసం రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టడం సరైందని కాదని పేర్కొన్నారు. -
యూసీల్లేవ్...!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ఖర్చులకు కనీసం లెక్కలు చూపించే పరిస్థితి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సొసైటీల ద్వారా ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల నిధులకు గాను ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) చూపెట్టలేదు. ఇలా జిల్లా మొత్తంగా దాదాపు రూ.1.8 కోట్లకు ఖర్చులు చూపలేదని కలెక్టర్ డాక్టర్.కె.ఇలంబరితి ఇటీవల జరిపిన సమీక్షలో వెల్లడయినట్టు సమాచారం. దీంతో యూసీల వ్యవహారంపై సీరియస్ అయిన కలెక్టర్.. వైద్య శాఖ అధికారులను పురమాయించడంతో ఇటీవలే రూ.1.2 కోట్లకు స్టేట్మెంట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. మిగిలిన దాదాపు రూ.60 లక్షలకు ఇంతవరకు లెక్క తేలలేదని సమాచారం. లెక్కలెందుకు చూపెట్టలేదు బాబూ! జిల్లాలో ఐదు ఏరియా ఆసుపత్రులు, 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖల నుంచి ఏటా రూ. కోట్ల నిధులు వస్తాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఆరోగ్యశ్రీతో పాటు అభివృద్ధి సొసైటీ నిధుల కింద ఏటా రూ.50 లక్షల వరకు, ఒక్కో ఏరియా ఆసుపత్రికి ప్రతి ఏడాది రూ.5 లక్షలు, ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75 లక్షల నిధులు వస్తాయి. ఈ నిధులతో జిల్లాలోని ఆసుపత్రులలో శానిటేషన్ నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, ప్రయోగశాలల ఆధునీకరణ, నూతన భవనాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అయితే, ఈ అభివృద్ధి నిధుల వినియోగం పకడ్బందీగానే జరుగుతున్నా వాటికి సంబంధించిన యూసీలు సమర్పించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని కలెక్టర్ జరిపిన సమీక్షలో వెల్లడయింది. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల నుంచి రావాల్సిన ఈ యూసీలు, స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ (ఎస్ఓఈ)లు రాకపోవడం వల్ల ఆ మేరకు జిల్లా ఆసుపత్రులకు రావాల్సిన కొత్త నిధులు కూడా ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే యూసీలు, ఎస్వోఈలు వచ్చేలా ఏర్పాటు చేయాలని వైద్యశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో దాదాపు 1.2 కోట్ల రూపాయల వరకు వెంటనే యూసీలు, ఎస్ఓఈలు వచ్చాయని, మరో రూ. 60 లక్షల వరకు లెక్క తేలాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు. అధికారాల వికేంద్రీకరణ, కంప్యూటరైజేషన్‌పై దృష్టి మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖను గాడిలో పెట్టడంలో భాగంగా అధికార వికేంద్రీకరణ చేయడంతో పాటు ఆసుపత్రుల వ్యవస్థను ఆన్లైన్ చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న వివిధ విభాగాల ఉన్నతాధికారులకు ఒక్కో పని అప్పగించే పనిలో కలెక్టర్ ఉన్నారు. సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సహకారంతో సంబంధిత సాఫ్ట్వేర్ కూడా తయారవుతోంది. ఆసుపత్రుల అభివృద్ధికి వచ్చే నిధులు, వాటి వినియోగంతో పాటు అన్ని స్థాయిల్లోని ఆసుపత్రులకు వస్తున్న రోగులు, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. తద్వారా కంప్యూటర్ను ఒక్కసారి క్లిక్ చేస్తే ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులోకి వచ్చేలా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. -
‘ఫాస్ట్’ కోసం నిరీక్షణ
ఖమ్మం హవేలి: తెలంగాణ విద్యార్థుల ఫీజులు చెల్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం అమలుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు కాలేదు. పైగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా పెండింగ్‌లో ఉన్న ఫీజులు ప్రభుత్వం నుంచి రాలేదు. విద్యార్థుల స్థానికతకు సంబంధించి ఇంకా కచ్చితమైన నిర్ణయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 410 కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మార్గదర్శకాలు వెలువడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల వివరాలు పొందుపరిచిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఆన్లైన్ ద్వారా వివరాలు పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కళాశాలలు ఆన్లైన్లో డేటా ఇచ్చి అందుకు సంబంధించిన కాపీలు తీయాలి. ప్రిన్సిపాల్ సంతకం పెట్టి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు వీటిని అందజేయాలి. కానీ జిల్లాలో ఉన్న కళాశాలల్లో సుమారు 100 కాలేజీలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు కూడా ఉండటం గమనార్హం. 2007-08 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు బీసీ సంక్షేమశాఖ ద్వారా బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.277 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించింది. రూ.212 కోట్లకు సంబంధించి కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చాయి. మరో రూ.65 కోట్లకు సంబంధించి బీసీ సంక్షేమశాఖకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కళాశాలల నుంచి రావాల్సి ఉంది. మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా మైనారిటీ విద్యార్థులకు రూ.6 కోట్ల వరకు ఫీజులు వచ్చాయి. ఇందులో రూ.1.2 కోట్లకు సంబంధించి కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.220 కోట్ల ఫీజులు వచ్చాయి. వీటిలో రూ.40 కోట్లకు కళాశాలల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఈ శాఖకు అందాల్సి ఉంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు నిర్లక్ష్యం వీడితే గత విద్యాసంవత్సరం పెండింగ్‌లో ఉన్న ఫీజులు విడుదల అయ్యే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులకు రూ.36 కోట్లకు గాను రూ.26 కోట్లు రాగా మరో రూ.10 కోట్లు రావాల్సి ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.1.33 కోట్లకు రూ.1.13 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.20 లక్షలు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులకు రూ.17కోట్లు, ఈబీసీ విద్యార్థులకు రూ.6 కోట్లు రావాల్సి ఉంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజులతో పాటు కొత్త పథకం వేగంగా అమలు కావాలంటే కళాశాలలు వెంటనే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందజేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.