‘ఫాస్ట్’ కోసం నిరీక్షణ | students waiting for fast scheme implementation | Sakshi
Sakshi News home page

‘ఫాస్ట్’ కోసం నిరీక్షణ

Published Sun, Jul 27 2014 2:32 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

students waiting for fast scheme implementation

ఖమ్మం హవేలి: తెలంగాణ విద్యార్థుల ఫీజులు చెల్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం అమలుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు మంజూరు కాలేదు. పైగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా పెండింగ్‌లో ఉన్న ఫీజులు ప్రభుత్వం నుంచి రాలేదు.

విద్యార్థుల స్థానికతకు సంబంధించి ఇంకా కచ్చితమైన నిర్ణయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలోని 410 కళాశాలల్లో  ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మార్గదర్శకాలు వెలువడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల వివరాలు పొందుపరిచిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఆన్‌లైన్ ద్వారా వివరాలు పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

కళాశాలలు ఆన్‌లైన్‌లో డేటా ఇచ్చి అందుకు సంబంధించిన కాపీలు తీయాలి. ప్రిన్సిపాల్ సంతకం పెట్టి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు వీటిని అందజేయాలి. కానీ జిల్లాలో ఉన్న కళాశాలల్లో సుమారు 100 కాలేజీలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు కూడా ఉండటం గమనార్హం.

2007-08 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు బీసీ సంక్షేమశాఖ ద్వారా బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.277 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించింది. రూ.212 కోట్లకు సంబంధించి కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చాయి. మరో రూ.65 కోట్లకు సంబంధించి బీసీ సంక్షేమశాఖకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కళాశాలల నుంచి రావాల్సి ఉంది. మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా మైనారిటీ విద్యార్థులకు రూ.6 కోట్ల వరకు ఫీజులు వచ్చాయి. ఇందులో రూ.1.2 కోట్లకు సంబంధించి కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది.

సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.220 కోట్ల ఫీజులు వచ్చాయి. వీటిలో రూ.40 కోట్లకు కళాశాలల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఈ శాఖకు అందాల్సి ఉంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు నిర్లక్ష్యం వీడితే గత విద్యాసంవత్సరం పెండింగ్‌లో ఉన్న ఫీజులు విడుదల అయ్యే అవకాశం ఉంది.

గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులకు రూ.36 కోట్లకు గాను రూ.26 కోట్లు రాగా మరో రూ.10 కోట్లు రావాల్సి ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.1.33 కోట్లకు రూ.1.13 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.20 లక్షలు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులకు రూ.17కోట్లు, ఈబీసీ విద్యార్థులకు రూ.6 కోట్లు రావాల్సి ఉంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజులతో పాటు కొత్త పథకం వేగంగా అమలు కావాలంటే కళాశాలలు వెంటనే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందజేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement