పరీక్షలకు హాల్‌టికెట్లు ఇవ్వబోమంటున్న కాలేజీలు
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి
విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఖరారు కాని ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు
మరో నెలలో తుది పరీక్షలున్నా ఫీజులపై కొరవడిన స్పష్టత
తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్న విద్యార్థి సంఘాలు
సాక్షి, హైదరాబాద్: వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింపు విషయం ఇప్పటికీ తేలకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పథకాన్ని టీ సర్కార్ ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్)’గా మార్చినప్పటికీ దాని మార్గదర్శకాలను విద్యాసంవత్సరం చివరి దాకా విడుదల చేయకపోవడం సమస్యలకు దారి తీస్తోంది.
విద్యార్థుల స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యార్థులకే ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, దానిపై వివాదాలు రేగి విషయం కోర్టుకు వెళ్లడం తెలిసిందే. దీనిపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణలో భాగంగా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ కౌంటర్‌ను దాఖలు చేయాలి. ఈ కౌంటర్‌పై కూడా ఇంకా తేల్చకపోవడంతో విద్యార్థి లోకంతో పాటు కాలేజీల యాజమాన్యాలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
ప్రాక్టికల్స్‌కు హాల్ టికెట్ల నిలిపివేత!
ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ త్వరలోనే జరగాల్సి ఉండగా ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజు కట్టకపోతే హాల్‌టికెట్ ఇవ్వబోమని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోతే తామే చెల్లిస్తామంటూ విద్యార్థులతో కొన్ని యాజమాన్యాలు ప్రామిసరీ నోట్లు కూడా రాయించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పథకం అమలుపై ఏర్పడిన గందరగోళంతో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. అలాగే స్కాలర్‌షిప్ బకాయిలు కూడా అందకపోవడం చాలా మంది విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది.
వీటిపైనే ఆధారపడి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చేస్తున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు, పాత విద్యార్థుల రెన్యూవల్స్‌కు 2,600 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని అధికారవర్గాల అంచనా. పాతబకాయిలను కూడా కలిపితే ఈ మొత్తం రూ. 3,200 కోట్లకు చేరుతుంది. గత ఏడాది కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి సర్టిఫికెట్లను యాజమాన్యాలు తమ వద్దనే పెట్టుకున్నాయి.
తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం
ఫీజుల రీయింబర్స్‌మెంట్ -రాష్ట్ర ప్రభు త్వవైఖరిపై త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీన్ని దశలవారీగా రద్దు చేసేందుకు చూస్తోంది. తన విధానమేంటో కోర్టుకు కూడా తెలపడం లేదంటే దీనిపై ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
- జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేత
ఫాస్ట్ మార్గదర్శకాలేవి?
ఫాస్ట్ పథకం మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులు సక్రమంగా పరీక్షలకు సిద్ధమయ్యేలా చూడాలి. ఫీజులు కట్టకపోతే హాల్‌టికెట్లు ఇవ్వమని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతేఉద్యమిస్తాం.
- శోభన్ మూడ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట అధ్యక్షుడు
ఫీజు కట్టకుంటే అంతే!
Published Thu, Jan 29 2015 12:51 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement