సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ఖర్చులకు కనీసం లెక్కలు చూపించే పరిస్థితి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సొసైటీల ద్వారా ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల నిధులకు గాను ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) చూపెట్టలేదు.
ఇలా జిల్లా మొత్తంగా దాదాపు రూ.1.8 కోట్లకు ఖర్చులు చూపలేదని కలెక్టర్ డాక్టర్.కె.ఇలంబరితి ఇటీవల జరిపిన సమీక్షలో వెల్లడయినట్టు సమాచారం. దీంతో యూసీల వ్యవహారంపై సీరియస్ అయిన కలెక్టర్.. వైద్య శాఖ అధికారులను పురమాయించడంతో ఇటీవలే రూ.1.2 కోట్లకు స్టేట్‌మెంట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. మిగిలిన దాదాపు రూ.60 లక్షలకు ఇంతవరకు లెక్క తేలలేదని సమాచారం.
లెక్కలెందుకు చూపెట్టలేదు బాబూ!
జిల్లాలో ఐదు ఏరియా ఆసుపత్రులు, 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖల నుంచి ఏటా రూ. కోట్ల నిధులు వస్తాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఆరోగ్యశ్రీతో పాటు అభివృద్ధి సొసైటీ నిధుల కింద ఏటా రూ.50 లక్షల వరకు, ఒక్కో ఏరియా ఆసుపత్రికి ప్రతి ఏడాది రూ.5 లక్షలు, ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75 లక్షల నిధులు వస్తాయి.
ఈ నిధులతో జిల్లాలోని ఆసుపత్రులలో శానిటేషన్ నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, ప్రయోగశాలల ఆధునీకరణ, నూతన భవనాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అయితే, ఈ అభివృద్ధి నిధుల వినియోగం పకడ్బందీగానే జరుగుతున్నా వాటికి సంబంధించిన యూసీలు సమర్పించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని కలెక్టర్ జరిపిన సమీక్షలో వెల్లడయింది. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల నుంచి రావాల్సిన ఈ యూసీలు, స్టేట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ (ఎస్‌ఓఈ)లు రాకపోవడం వల్ల ఆ మేరకు జిల్లా ఆసుపత్రులకు రావాల్సిన కొత్త నిధులు కూడా ఆగిపోయాయి.
ఈ పరిస్థితుల్లో వెంటనే యూసీలు, ఎస్‌వోఈలు వచ్చేలా ఏర్పాటు చేయాలని వైద్యశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో దాదాపు 1.2 కోట్ల రూపాయల వరకు వెంటనే యూసీలు, ఎస్‌ఓఈలు వచ్చాయని, మరో రూ. 60 లక్షల వరకు లెక్క తేలాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు.
అధికారాల వికేంద్రీకరణ, కంప్యూటరైజేషన్‌పై దృష్టి
మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖను గాడిలో పెట్టడంలో భాగంగా అధికార వికేంద్రీకరణ చేయడంతో పాటు ఆసుపత్రుల వ్యవస్థను ఆన్‌లైన్ చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న వివిధ విభాగాల ఉన్నతాధికారులకు ఒక్కో పని అప్పగించే పనిలో కలెక్టర్ ఉన్నారు. సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సహకారంతో సంబంధిత సాఫ్ట్‌వేర్ కూడా తయారవుతోంది.
ఆసుపత్రుల అభివృద్ధికి వచ్చే నిధులు, వాటి వినియోగంతో పాటు అన్ని స్థాయిల్లోని ఆసుపత్రులకు వస్తున్న రోగులు, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. తద్వారా కంప్యూటర్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులోకి వచ్చేలా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.
యూసీల్లేవ్...!
Published Thu, Sep 4 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement