మాట్లాడుతున్న డాక్టర్ మాలతి
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.మాలతి స్పష్టం చేశారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మీడియాలో కరోనా కలకలం అనే పేరుతో హల్‌చల్ చేయడం వల్ల ప్రజలు ఆందోళకు గురవుతున్నారని పేర్కొన్నారు. వదంతులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా వాస్తవ విషయాలు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనవసరపు పోస్టులు పెట్టడం వల్ల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారని, ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో నమోదైన అనుమానిత కేసులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారివేనని, అయితే వారెవరికీ కరోనా పాజిటివ్ లేదని తెలిపారు. విప్పలమడక గ్రామానికి చెందిన కేసుకు కరోనా లేదని తేలిందని, డెట్రాయిట్ నుంచి వచ్చిన ఖమ్మం నగర వాసి కేసు కూడా వ్యాధి నిర్ధారణ కాలేదన్నారు. (కరోనా ఎఫెక్ట్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ)
గ్రామాల్లోకి ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఉంటే వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని, విదేశాల నుంచి వచ్చిన వారిని ఇంట్లో 14 రోజుల వరకు వేరే గదిలో ఉంచాలని సూచించారు. వారికి దగ్గరలో ఉండకుండా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు మాస్క్‌లు ధరించడం, జనసంద్రంలో వెళ్లకుండా ఉండటం, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం వంటివి చేయాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా, స్వైన్‌ఫ్లూ ఇతర వైరస్ వ్యాధుల కోసం శాశ్వతంగా ఐసీయూ, ఐసోలేషన్ వార్డులను 20 పడకలతో త్వరలో సిద్ధం చేస్తామని తెలిపారు. వైరస్ వ్యాధుల బారిన పడిన వారికి అక్కడే పరీక్షలు నిర్వహించి, చికిత్స అందేవిధంగా అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. విలేకర్ల సమావేశంలో డీఎస్‌ఓ డాక్టర్ కోటిరత్నం, డిప్యూటీ డెమో జి.సాంబశివారెడ్డి, రమణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment