District Health Department
-
జాబ్ కోసం ఫేక్?
సాక్షి, నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యారోగ్య శాఖలో నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా కొందరు ఫేక్ మార్కుల జాబితాలతో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎలా వచ్చాయి? మొదటిసారి ప్రకటించించిన జాబితాలో ఓ అభ్యర్థికి 1014 మార్కులున్నట్లుగా చూపారు. ఫైనల్ మెరిట్ జాబితాలో 811 మార్కులని ఉంది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో 65, 73, 76, 93 ఇలా ఓ పదిమందికి సంబంధించిన ర్యాంకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నర్సింగ్ కోర్సులో తక్కువ మార్కులు వచ్చినా ప్రకటించిన ప్రొవిజనల్ జాబితాలో ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయని పలువురు అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అభ్యంతరాలు స్వీకరించినా సోమవారం ఫైనల్ మెరిట్ జాబితాను ప్రచురించామని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆ జాబితాను వెబ్సైట్లో ఉంచామన్నారు. ఒక్కసారిగా.. ఏమి జరిగిందో గానీ మార్కుల జాబితాలో పైన పేర్కొన్న పలువురి ర్యాంకులు తలకిందులయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా లిస్ట్‌ను మార్పు చేశారు. అప్పటివరకు ఎక్కువ మార్కులు పొంది, మెరిట్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉన్న కొందరికి తక్కువ మార్కులు చూపిస్తూ రెండో జాబితాను వెబ్సైట్లో ప్రదర్శించారు. దీంతో ర్యాంకుల పరంగా ఒక్కసారిగా వారు వెనక్కు వెళ్లిపోయారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టామన్నారు. ఒకరికి పొరపాటున మార్కులు ఎక్కువ పడ్డాయని వాటిని సరి చేశామన్నారు. మరో ఏడుగురి సర్టిఫికెట్లæపై సందేహాలున్నాయన్నారు. ఇదిలా ఉండగా డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు వైద్యవిధాన పరిషత్‌లోని (ఏపీవీపీ) పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఏపీవీపీలోని పోస్టుల్లో కూడా తమ నర్సింగ్ కోర్సులో ఎక్కువ మార్కులు పొందినట్లుగా చూపారు. ఇదే అభ్యర్థుల జాబితాను ప్రస్తుతం పరిశీలిస్తే డీఎంహెచ్ఓ పోస్టులకు సంబంధించి ప్రదర్శించిన జాబితాలో తక్కువ మార్కులు ఉండడం.. ఏపీవీపీ పోస్టుల్లో ఎక్కువ మార్కులుండడాన్ని చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయమై డీసీహెచ్ చెన్నయ్యను వివరణ కోరగా నర్స్ పోస్టు కోసం ఒకరు దరఖాస్తు చేసిన మార్కుల జాబితాపై ఫిర్యాదు అందిందన్నారు. దానిని పరిశీలించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరగా ఆమె ఈ రోజు వస్తానని చెప్పి రాలేదన్నారు. దీనిని బట్టి చూస్తే ఆమెది ఫేక్ మార్కుల జాబితా అయి ఉండవచ్చన్నారు. ఉద్యోగాల్లో చేర్చుకునేప్పుడు అన్ని మార్కుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేసినట్లుగా తేలితే వారిపై చర్యలు చేపడతామన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం -
జిల్లాలో ‘కరోనా’ లేదు..
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.మాలతి స్పష్టం చేశారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మీడియాలో కరోనా కలకలం అనే పేరుతో హల్చల్ చేయడం వల్ల ప్రజలు ఆందోళకు గురవుతున్నారని పేర్కొన్నారు. వదంతులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా వాస్తవ విషయాలు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనవసరపు పోస్టులు పెట్టడం వల్ల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారని, ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో నమోదైన అనుమానిత కేసులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారివేనని, అయితే వారెవరికీ కరోనా పాజిటివ్ లేదని తెలిపారు. విప్పలమడక గ్రామానికి చెందిన కేసుకు కరోనా లేదని తేలిందని, డెట్రాయిట్ నుంచి వచ్చిన ఖమ్మం నగర వాసి కేసు కూడా వ్యాధి నిర్ధారణ కాలేదన్నారు. (కరోనా ఎఫెక్ట్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ) గ్రామాల్లోకి ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఉంటే వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని, విదేశాల నుంచి వచ్చిన వారిని ఇంట్లో 14 రోజుల వరకు వేరే గదిలో ఉంచాలని సూచించారు. వారికి దగ్గరలో ఉండకుండా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు మాస్క్‌లు ధరించడం, జనసంద్రంలో వెళ్లకుండా ఉండటం, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం వంటివి చేయాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా, స్వైన్‌ఫ్లూ ఇతర వైరస్ వ్యాధుల కోసం శాశ్వతంగా ఐసీయూ, ఐసోలేషన్ వార్డులను 20 పడకలతో త్వరలో సిద్ధం చేస్తామని తెలిపారు. వైరస్ వ్యాధుల బారిన పడిన వారికి అక్కడే పరీక్షలు నిర్వహించి, చికిత్స అందేవిధంగా అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. విలేకర్ల సమావేశంలో డీఎస్ఓ డాక్టర్ కోటిరత్నం, డిప్యూటీ డెమో జి.సాంబశివారెడ్డి, రమణ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
మాత, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: మాత, శిశు మరణాల శాతం తగ్గించడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్య శాఖ పీవో డీటీటీ డాక్టర్ మనోహర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ వైద్య కళాశాలలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందికి మాత, శిశు మరణాల శాతం తగ్గించడంపై దక్షత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ లక్ష మంది బాలింతల్లో 92 మంది మృత్యువాత పడుతున్నారని, వెయ్యి మంది చిన్నారులగాను 28 మంది నవజాత శిశువులు చనిపోతున్నారని తెలిపారు. మాత, శిశు మరణాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత వైద్యాధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. మూడు రోజులు జరిగే శిక్షణ కార్యక్రమంలో ప్రసవానికి ముందు, తర్వా త స్టాఫ్‌నర్సులు, వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జఫ్రిగో ప్రోగాం అధికారి డాక్టర్ ప్రేరణ, ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ ప్రతినిధి సత్యేంద్రనాథ్, కాగజ్‌నగర్ సీఎస్ విద్యావతి, వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా కోటీశ్వరి
చిత్తూరు (అర్బన్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంఅండ్‌హెచ్‌వో)లో అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శని వారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కోటీశ్వరిని నియమించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో డీఎంఅండ్‌హెచ్‌వోగా పనిచేస్తున్న కోటీశ్వరిని చిత్తూరుకు బదిలీ చేశారు. ఈమె వచ్చే వారంలో చిత్తూరులో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎంఅండ్‌హెచ్‌వోల బదిలీల కౌన్సెలింగ్‌లో అధికారుల పనితీరు, సామర్థ్యం, సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. తొలి నుంచి వైఎస్సార్ జిల్లాకు ప్రయత్నించిన చిత్తూరు డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్యకు నిరాశ ఎదురైంది. ఈయనను అప్రాధాన్యత శాఖకు బదిలీ చేశారు. రాయలసీమ జోనల్ మలేరియా అధికారిగా దశరథరామయ్యను నియమించారు. 2012 నవంబర్ 20న డీఎంఅండ్‌హెచ్‌వోగా చిత్తూరులో బాధ్యతలు స్వీకరించిన దశరథరామయ్య రెండేళ్ల పాటు జిల్లాలో తన సేవలు అందించారు. నెల్లూరుకు భారతి రెడ్డి అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (ఏడీఅండ్‌హెచ్‌వో) అధికారిణిగా పనిచేస్తున్న భారతిరెడ్డిని ముందుగా అనుకున్నట్లు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. 2012 జనవరి 23న చిత్తూరులో ఏడీఎంఅండ్‌హెచ్‌వోగా భారతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా నుంచి డీఎంఅండ్‌హెచ్‌వోగా పదోన్నతిపై వెళ్లడం సంతోషంగా ఉందని భారతిరెడ్డి తెలిపారు. ఈ నెల 29వరకు హైదరాబాదులో జరుగుతున్న శిక్షణలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 30 నెల్లూరులో బాధ్యతలు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. -
నత్తా... నీవే నయం
ఆలస్యానికి ప్రతీకగా నత్తను చూపిస్తాం. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి, అవకతవకలపై దర్యాప్తు చేసిన అధికారులు మాత్రం ‘పాపం నత్తపై నిందలు వేయొద్దు ... ఆ స్థానాన్ని మేం ఆక్రమించుకుంటున్నా’మంటున్నారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా జిల్లా అధికారే స్వయంగా అవకతవకలకు పాల్పడితే కింది స్థాయి సిబ్బంది కూడా అందిన కాడికి దోచుకున్న వ్యవహారాలపై చేపట్టిన దర్యాప్తులూ సా...గుతున్నాయి. ఒంగోలు సెంట్రల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గతంలో జరిగిన అవినీతి, అక్రమాలపై రెండుసార్లు గుంటూరు ఆర్డీ విచారణ నిర్వహించినా చర్యలు తీసుకోవడంలో జాప్యం చోటుచేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎంహెచ్‌వో దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది పాల్పడిన అక్రమాలపై విచారణలు పూర్తయినా చర్యలు మాత్రం కానరావడం లేదు. నెలల తరబడి జాప్యం చోటుచేసుకుంటుండడంతో ఉరిమి ఉరిమి మంగళంమీద పడ్డట్టుగా అసలు నిందితులు తప్పించుకొని ఎవర్ని బలితీసుకుంటారోనని భయపడుతున్నారు మరికొంతమంది ఉద్యోగులు.డీఎంహెచ్‌వో పదవీ విరమణ చేసినా దర్యాప్తు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం వెనుక కిం కర్తవ్యమంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు ఇలా..: ఈ ఏడాది ఏప్రిల్‌లో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందజేయాల్సిందిగా రీజినల్ డెరైక్టర్ ఆఫ్ హెల్త్ (ఆర్డీ) షాలినీ దేవిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆ ఆదేశాలతో మే నెల 22న ఒంగోలు వచ్చి విచారణ చేపట్టారు. మళ్లీ అదే నెల 29న వచ్చి పల్స్‌పోలియో నిధులు సంబంధిత ఇన్ఛార్జికి తెలియకుండా రూ.7 లక్షల దుర్వినియోగం చేశారన్న ఆరోపణపై జబ్బార్ ఇన్‌ఛార్జి వైద్యురాలు డాక్టర్ పద్మావతిని విచారించి స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. జిల్లాలోని ఎస్పీహెచ్ఓలను పిలిపించి కూడా వివరాలు సేకరించారు. వాహనాల బడ్జెట్‌ను మంజూరు చేయాలంటే రూ.12,000 వేలు లంచం అడిగారనే ఆరోపణలపై కూడా రాతపూర్వక స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వాహనాల ఖర్చులను పర్యవేక్షించే అకౌంట్స్ అధికారి హర్షవర్థన్‌ను, కార్యాలయం పర్యవేక్షణ అధికారిని విచారించారు. వీరందరి వద్దనుంచి రాతపూర్వక ఫిర్యాదులను తీసుకున్నారు. ఇంత జరిగినా దర్యాప్తు అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. -
‘24 గంటల్లోపే ఇంటికి పంపారు’
బేల : స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఈ నెల ఏడో తేదీన 17 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యులు, సిబ్బంది వారిని 24గంటల్లోపే ఇంటికి పంపించారు. ఆపరేషన్ అనంతరం వారు పలు సమస్యలతో ఇంటి వద్ద నానా అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు తాము ఆస్పత్రిలోనే ఉంటామని చెప్పినా బలవంతంగా ఇంటికి పంపించారని బాధిత మహిళలు వాపోయారు. ఇంటి వద్దే పర్యవేక్షణకు ఏఎన్ఏంలు, ఆశ వర్కర్లను పంపిస్తామన్న వైద్యులు ఆపై తమ బాగోగులు మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్లు చేసుకున్న మహిళలను కనీసం మూడు రోజులైనా ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించాల్సి ఉంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆపరేషన్లు చేసుకున్న మహిళల్లో సగం మంది వాంతులు, దగ్గు తదితర సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించిన మండలంలోని పాటన్, సిర్సన్న గ్రామాలకు చెందిన బాధితులు వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు వెళ్లక తప్పలేదు. ఈ విషయమై ఆస్పత్రి ఇన్చార్జి వైద్యాధికారి రాథోడ్ పవన్‌ను వివరణ కోరగా.. ఆపరేషన్లు చేసిన ఆరు గంటలకే ఇంటికి పంపించవచ్చని తెలిపారు. ఆపరేషన్లు చేసుకున్న మహిళల ఇంటి వద్దకు వెళ్లి పర్యవేక్షించాలని సిబ్బందికి చెప్పగా వారు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కడుపునొప్పి వస్తోంది : రిత, పాటన్ దవాఖానాలో ఉంటామని చెప్పినా ఇంటికి పంపారు. ఇంటికి వచ్చినాక దగ్గు లేచింది. దగ్గిన ప్రతీసారి కడుపు నొప్పి వస్తోంది. నిద్ర పడుతలేదు. నాతో పాటు వచ్చిన మరొకామె వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లింది. నేను కూడా పోత. బాధ్యులపై చర్య తీసుకుంటాం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలను స్థానిక పీహెచ్సీలో కనీసం మూడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలి. జరిగిన సంఘటనపై ఆరా తీసి నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటాం. - రుక్ష్మిణమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి -
యూసీల్లేవ్...!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ఖర్చులకు కనీసం లెక్కలు చూపించే పరిస్థితి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సొసైటీల ద్వారా ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల నిధులకు గాను ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) చూపెట్టలేదు. ఇలా జిల్లా మొత్తంగా దాదాపు రూ.1.8 కోట్లకు ఖర్చులు చూపలేదని కలెక్టర్ డాక్టర్.కె.ఇలంబరితి ఇటీవల జరిపిన సమీక్షలో వెల్లడయినట్టు సమాచారం. దీంతో యూసీల వ్యవహారంపై సీరియస్ అయిన కలెక్టర్.. వైద్య శాఖ అధికారులను పురమాయించడంతో ఇటీవలే రూ.1.2 కోట్లకు స్టేట్మెంట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. మిగిలిన దాదాపు రూ.60 లక్షలకు ఇంతవరకు లెక్క తేలలేదని సమాచారం. లెక్కలెందుకు చూపెట్టలేదు బాబూ! జిల్లాలో ఐదు ఏరియా ఆసుపత్రులు, 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖల నుంచి ఏటా రూ. కోట్ల నిధులు వస్తాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఆరోగ్యశ్రీతో పాటు అభివృద్ధి సొసైటీ నిధుల కింద ఏటా రూ.50 లక్షల వరకు, ఒక్కో ఏరియా ఆసుపత్రికి ప్రతి ఏడాది రూ.5 లక్షలు, ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75 లక్షల నిధులు వస్తాయి. ఈ నిధులతో జిల్లాలోని ఆసుపత్రులలో శానిటేషన్ నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, ప్రయోగశాలల ఆధునీకరణ, నూతన భవనాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అయితే, ఈ అభివృద్ధి నిధుల వినియోగం పకడ్బందీగానే జరుగుతున్నా వాటికి సంబంధించిన యూసీలు సమర్పించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని కలెక్టర్ జరిపిన సమీక్షలో వెల్లడయింది. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల నుంచి రావాల్సిన ఈ యూసీలు, స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ (ఎస్ఓఈ)లు రాకపోవడం వల్ల ఆ మేరకు జిల్లా ఆసుపత్రులకు రావాల్సిన కొత్త నిధులు కూడా ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే యూసీలు, ఎస్వోఈలు వచ్చేలా ఏర్పాటు చేయాలని వైద్యశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో దాదాపు 1.2 కోట్ల రూపాయల వరకు వెంటనే యూసీలు, ఎస్ఓఈలు వచ్చాయని, మరో రూ. 60 లక్షల వరకు లెక్క తేలాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు. అధికారాల వికేంద్రీకరణ, కంప్యూటరైజేషన్‌పై దృష్టి మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖను గాడిలో పెట్టడంలో భాగంగా అధికార వికేంద్రీకరణ చేయడంతో పాటు ఆసుపత్రుల వ్యవస్థను ఆన్లైన్ చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న వివిధ విభాగాల ఉన్నతాధికారులకు ఒక్కో పని అప్పగించే పనిలో కలెక్టర్ ఉన్నారు. సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సహకారంతో సంబంధిత సాఫ్ట్వేర్ కూడా తయారవుతోంది. ఆసుపత్రుల అభివృద్ధికి వచ్చే నిధులు, వాటి వినియోగంతో పాటు అన్ని స్థాయిల్లోని ఆసుపత్రులకు వస్తున్న రోగులు, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. తద్వారా కంప్యూటర్ను ఒక్కసారి క్లిక్ చేస్తే ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులోకి వచ్చేలా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.