బేల : స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఈ నెల ఏడో తేదీన 17 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యులు, సిబ్బంది వారిని 24గంటల్లోపే ఇంటికి పంపించారు. ఆపరేషన్ అనంతరం వారు పలు సమస్యలతో ఇంటి వద్ద నానా అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు తాము ఆస్పత్రిలోనే ఉంటామని చెప్పినా బలవంతంగా ఇంటికి పంపించారని బాధిత మహిళలు వాపోయారు. ఇంటి వద్దే పర్యవేక్షణకు ఏఎన్‌ఏంలు, ఆశ వర్కర్లను పంపిస్తామన్న వైద్యులు ఆపై తమ బాగోగులు మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆపరేషన్లు చేసుకున్న మహిళలను కనీసం మూడు రోజులైనా ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించాల్సి ఉంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆపరేషన్లు చేసుకున్న మహిళల్లో సగం మంది వాంతులు, దగ్గు తదితర సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించిన మండలంలోని పాటన్, సిర్సన్న గ్రామాలకు చెందిన బాధితులు వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు వెళ్లక తప్పలేదు. ఈ విషయమై ఆస్పత్రి ఇన్‌చార్జి వైద్యాధికారి రాథోడ్ పవన్‌ను వివరణ కోరగా.. ఆపరేషన్లు చేసిన ఆరు గంటలకే ఇంటికి పంపించవచ్చని తెలిపారు. ఆపరేషన్లు చేసుకున్న మహిళల ఇంటి వద్దకు వెళ్లి పర్యవేక్షించాలని సిబ్బందికి చెప్పగా వారు స్పందిస్తున్నారని పేర్కొన్నారు.
కడుపునొప్పి వస్తోంది : రిత, పాటన్
దవాఖానాలో ఉంటామని చెప్పినా ఇంటికి పంపారు. ఇంటికి వచ్చినాక దగ్గు లేచింది. దగ్గిన ప్రతీసారి కడుపు నొప్పి వస్తోంది. నిద్ర పడుతలేదు. నాతో పాటు వచ్చిన మరొకామె వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లింది. నేను కూడా పోత.
బాధ్యులపై చర్య తీసుకుంటాం
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలను స్థానిక పీహెచ్‌సీలో కనీసం మూడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలి. జరిగిన సంఘటనపై ఆరా తీసి నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటాం.
- రుక్ష్మిణమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి
‘24 గంటల్లోపే ఇంటికి పంపారు’
Published Mon, Nov 10 2014 2:36 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement