Family planning operations
-
ఫోర్స్ చేస్తున్నారు
నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబ నియంత్రణ చేయించుకోవాలనుకుంటున్నాం. వేసక్టమీ చేయించుకోమని నేను మావారిని ఫోర్స్ చేస్తున్నాను. లేదు లేదు.. ట్యూబెక్టమీ చేయించుకో అంటూ మా వారు నన్ను బలవంతపెడుతున్నారు. ఎవరు చేయించుకుంటే మంచిది? – పి. వాసవి కళ్యాణి, మందమర్రి ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. అంటే డేకేర్‌లో అయిపోతుంది. ఆసుపత్రిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే సరిపోతుంది. ట్యూబెక్టమీ అంటే ఆడవారికి చేసే ప్రొసీజర్. వెసెక్టమీ అంటే మగవారికి చేసే ప్రొసీజర్. ఈ రెండూ కూడా లాపరోస్కోపీ ద్వారే చేస్తారు. ఇద్దరిలో ఎవరికైనా డే కేర్‌లోనే ఈ శస్త్ర చికిత్సను చేస్తారు. ఈ రెండూ కూడా 99 శాతం విజయవంతమయ్యే ప్రక్రియలే. మీకు రెండు కాన్పులు కూడా సిజేరియనే అయినా.. అంతకుముందూ ఇంకేదైనా (అపెండిసైటిస్ వంటి) సర్జరీ అయినా మళ్లీ ట్యూబెక్టమీ అంటే కొంచెం కష్టం కావచ్చు. ఇంతకుముందు జరిగిన సర్జరీల తాలూకు అతుకులు ఉండవచ్చు. మళ్లీ అనెస్తీషియా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి కేసెస్‌లో .. అదీగాక మీకు ఇంకేదైనా మెడికల్ డిజార్డర్ ఉండి.. సర్జరీ రిస్కీ అయితే మీ వారినే వేసెక్టమీ చేయించుకోమని సజెస్ట్ చేస్తాము. ఒకవేళ మీవారు వేసెక్టమీ చేసుకున్నట్టయితే.. సర్జరీ అయిన మూడు నెలల తరువాత సెమెన్ అనాలిసిస్ చెక్‌చేసి.. స్పెర్మ్ లేవని నిర్ధారణ అయ్యేవరకు కండోమ్స్ తప్పనిసరిగా వాడాలి. మీకు ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవీ లేకపోతే .. ఇదివరకు ఏ సర్జరీ జరగకపోతే ఇద్దరిలో ఎవరు చేయించుకున్నా సమస్య లేదు. ట్యూబెక్టమీ అనేది పర్మినెంట్ ప్రొసీజర్. మళ్లీ రివర్స్ చేయడం చాలా కష్టం. అందుకే డాక్టర్ డీటెయిల్డ్ కౌన్సెలింగ్ తరువాతే ఈ ప్రొసీజర్‌కు ఒప్పుకుంటారు. నాకు 33 ఏళ్లు. ఏడాది కిందట హిస్టరెక్టమీ అయింది. ఇది భవిష్యత్‌లో నా ఆరోగ్యం మీదేమైనా ప్రభావం చూపిస్తుందా? – కె. లీలారాణి, బోధన్ హిస్టరెక్టమీ అనేది సర్వసాధారణమైన శస్త్ర చికిత్స. కొన్ని అనివార్య పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఈ సర్జరీ చేయాల్సి వస్తుంది. 35 ఏళ్లలోపు హిస్టరెక్టమీ అయిన వాళ్లలో ఆరోగ్య సమస్యల రిస్క్ 4.6 రెట్లు పెరుగుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే రక్తనాళాలు గట్టిపడడం వంటి స్థితి 2.5 రెట్లు ఎక్కువ. అందుకే యువతుల విషయంలో చాలా వరకు శస్త్ర చికిత్స జోలి లేకుండానే పేషంట్‌తో డిస్కస్ చేస్తాం. శస్త్ర చికిత్సను పేషంట్ ఆప్షనల్ చాయిస్‌గా కన్విన్స్ చేస్తాం. అధిక రక్తస్రావం, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ప్రొలాప్స్ వంటి వాటికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఈ మధ్య చాలానే వచ్చాయి. ఇలా ఈ ఆప్షన్స్ ఏవీ పనిచేయనప్పుడు మాత్రమే గర్భసంచిని తొలగించే మార్గం గురించి ఆలోచించాలి. చిన్న వయస్సులోనే గర్భసంచిని తొలగిస్తే బరువు పెరిగే, బీపీ ఎక్కువయ్యే, హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రమాదం పది నుంచి పదిహేను శాతం ఎక్కువ. అందుకే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఫిజీషియన్, గైనకాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకోవాలి. హిస్టరెక్టమీ వల్ల నెలసరి ఆగిపోవడంతో కొంతమంది ఏదో వెలితి ఫీలవుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్లే చాన్సెస్ కూడా ఎక్కువే. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచినీళ్లు తాగడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం, రోజూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లతో హిస్టరెక్టమీ సైడ్ ఎఫెక్ట్స్‌ను చాలా వరకు తగ్గించవచ్చు. నలభై ఏళ్లలోపు హిస్టరెక్టమీ అయితే ఓవరీస్ కూడా త్వరగా ఫెయిలవడం చూస్తాం. ఓవరీస్ నుంచి హార్మోన్స్ విడుదలవుతాయి కాబట్టి మెనోపాజ్ లక్షణాలు కొంచెం తగ్గుతాయి. ఈస్ట్రొజెన్ తగ్గడం వల్ల ఎముకలు దృఢత్వాన్ని కోల్పోయి గుల్లబారి ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ పెరుగుతుంది. చెమటలు పట్టడం, డిప్రెషన్, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలుంటాయి. అందుకే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. హై ప్రొటీన్ డైట్ తీసుకోవాలి. కొంతమందికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సజెస్ట్ చేస్తాం. దీనితో హిస్టరెక్టమీతో వచ్చే సమస్యల రిస్క్‌ను కాస్త తగ్గించవచ్చు. -
ఇక పెద్దాసుపత్రుల్లోనే కు.ని. ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్: మత్తు మందు వైద్యులు, ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యమున్న పెద్దాసుపత్రుల్లోనే ఇక నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనపై ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ నిర్వహించాలని, అన్ని అంశాలతో సమగ్ర నివేదిక అందజేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దని హరీశ్‌రావు ఆదేశించారు. ఆపరేషన్లు అయిన మహిళలను ఆసుపత్రుల్లో ఒకరోజు పరిశీలనలో ఉంచి, ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే ఇంటికి పంపించాలని సూచించారు. కాగా ఇబ్రహీంపట్నంలో గంటన్నరలోనే 34 మందికి కు.ని. ఆపరేషన్లు నిర్వహించినట్లుగా అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. ఆపరేషన్‌కు, ఆపరేషన్‌కు మధ్య పరికరాలను శుభ్రంగా చేసేందుకు అవసరమైన సమయం కూడా తీసుకోలేదని తమ పరిశీలనలో తేలిందని, ఇన్ఫెక్షన్ వల్లనే బాధితులు మృతిచెందినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అంత హడావిడిగా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనీ, మహిళల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించకుండానే పంపించడం ఏమిటని మంత్రి అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇకనుంచి ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా సంబంధిత జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి హరీశ్ హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగే ఆసుపత్రులను పరిశీలించాలని, లోపాలను సరిదిద్దాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు కొందరు ఆఫీసులకే పరిమితమవుతున్నారని, వారానికి ఒకసారైనా ఆసుపత్రులను సందర్శించకపోవడమేమిటని మంత్రి తప్పుబట్టినట్లు తెలిసింది. డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలి... ఇంటి చుట్టూ, ఇంటి లోపల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. చార్మినార్ జోన్ సీనియర్ ఎంటమాలొజిస్టు నామాల శ్రీనివాస్, మిగతా నాయకులతో కలిసి డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అందులో భాగంగా నగరంలోని తన ఇంటి ఆవరణలో 10 గంటలకు 10 నిమిషాలపాటు నీటి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ‘ఆదివారం 10 క్లాక్ 10 మినిట్స్ క్యాంపెయిన్’వీడియో, ప్రచార సామగ్రిని విడుదల చేశారు. -
అక్రమ ఆపరేషన్లపై విచారణ వేగవంతం
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఇటీవల అక్రమంగా నిర్వహించిన కుటుంబ సంక్షేమ ఆపరేషన్లపై సమగ్ర విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పాడేరు తహసీల్దార్ ప్రకాష్‌రావు సోమవారం ఉదయాన్నే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు జరిగిన మెడికల్ షాపుతోపాటు సమీప వీధిని ఆయన పరిశీలించి అక్కడి గిరిజనులను విచారించారు. అనంతరం ఈదులపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని విచారించారు. మెడికల్ షాపులో ఆపరేషన్లు చేసిన వైద్యబృందం వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రి సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఆపరేషన్ చేయించుకున్న గిరిజన మహిళల కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల వీఆర్వోలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లో సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న గిరిజన మహిళల వివరాలను సేకరిస్తున్నారు. -
అక్రమ కు.ని. ఆపరేషన్లపై విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీలో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు వైద్య బృందంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విశాఖ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలకు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మారుమూల ఈదులపాలెం ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఓ మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి గిరిజనుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్న వైనంపై ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఏడీఎంహెచ్‌వో, ఇతర వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. మెడికల్ షాపులో ఇంతవరకు జరిగిన ఆపరేషన్ల వివరాలను సేకరించడంతో పాటు ఆపరేషన్ జరిగిన మహిళలందరితో మాట్లాడి పూర్తి నివేదికను తనకు అందజేయాలని ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలా ప్రసాద్‌ను ఆదేశించారు. విచారణ అధికారిగా ఈదులపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లకే శివప్రసాద్ పాత్రుడును నియమించారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు, మరో ప్రభుత్వ స్టాఫ్ నర్సు అని గుర్తించారు. ఇందుకు ఈదులపాలెం ఆస్పత్రిలోని కొంతమంది వైద్య సిబ్బంది కూడా సహకరించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. ఇక్కడ రెండు విడతలుగా భారీ సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు చేసినట్టు ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ప్రాథమిక సమాచారాన్ని అందజేశారు. -
విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా
కాసుల కోసం కక్కుర్తిపడి ప్రైవేటు వైద్యులు చేస్తున్న కుటుంబ నియంత్రణ (సంక్షేమ) ఆపరేషన్లు గిరిజన మహిళలకు ప్రాణాంతకమవుతున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్య ముఠా ప్రైవేటుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న వైనం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసింది. గిరిజన మహిళల అమాయకత్వాన్ని, అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని.. మత్తు మందు కూడా సరిగా ఇవ్వకుండా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం ఈదులపాలెం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఉన్న సలుగు రోడ్డులో ఓ మెడికల్ షాపు వద్ద నెలకు ఒకసారి కుటుంబ సంక్షేమ ఆపరేషన్లను విచ్చలవిడిగా నిర్వహిస్తూ భారీగా డబ్బు గుంజుతున్నారు. చిన్న ఆపరేషన్ జరగాలంటేనే మత్తు వైద్య నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. అలాంటిది వారు లేకుండానే వైద్యులు, కొంతమంది సిబ్బంది గిరిజన మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. – పాడేరు ఒక్కో ఆపరేషన్‌కు రూ.8,500 అనకాపల్లిలో ఓ ప్రభుత్వాస్పత్రికి చెందిన గైనిక్ వైద్యుడితోపాటు ఇతర వైద్య సిబ్బంది ముఠాగా ఏర్పడి అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక ఆపరేషన్‌కు రూ.20 వేలు ఖర్చవుతుందని, తామైతే కేవలం రూ.8,500లకే ఆపరేషన్ చేస్తామని ప్రచారం చేస్తున్నారు. గతనెలలో కూడా ఈదులపాలెం మెడికల్ షాపులో 35 మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈదులపాలెం మెడికల్ షాపు వెనుక మహిళలకు ఆపరేషన్లను చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి అక్కడకు చేరుకుని ఆ తతంగాన్నంతా కెమెరాలో బంధించారు. మత్తు సరిగా ఇవ్వకుండానే.. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు సరిగా ఇవ్వకపోవడంతో గిరిజన మహిళలు నరకయాతనతో పెద్దపెట్టున ఏడ్చారు. అయినా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వారికి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ చేశాక వారిని క్షణమైనా కోలుకోనీయకుండా వెంటనే బయటకు తరలించేశారు. మహిళలను జీసీసీడీఆర్ డిపో ఆవరణలో, ఆటోల్లో పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆయా గ్రామాలకు తరలించేశారు. వీరికి స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలో తాత్కాలిక నిషేధం గిరిజన ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ తాత్కాలికంగా నిషేధం విధించింది. ఏజెన్సీలో జనాభా తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లను ప్రస్తుతం నిర్వహించడం లేదు. కోవిడ్ నిబంధనలు కూడా ఇందుకు కారణం. అయితే ఆపరేషన్లు చేయాలని గిరిజనుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పాడేరు, అరకులోయ ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తాం. ఈ నెల 15 నుంచి ఆపరేషన్ల నిర్వహణకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్లను పునఃప్రారంభిస్తాం. ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రైవేటు క్లినిక్‌లు, మెడికల్ షాపుల్లో మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం చట్టరీత్యా నేరం. –డాక్టర్ కె.లీలాప్రసాద్, ఇన్చార్జి ఏడీఎంహెచ్‌వో, పాడేరు నా కుమార్తె ఆపరేషన్‌కు రూ.8 వేలు ఇచ్చాను నా కుమార్తె ఆపరేషన్‌కు డాక్టర్‌కు రూ.8 వేలు చెల్లించాను. ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ చేయడం లేదని ప్రచారం జరగడంతో ప్రైవేటు మెడికల్ షాపులో ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం. మైదాన ప్రాంతాల్లోని పెద్ద ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఈదులపాలెంలోనే నా కుమార్తెకు ఆపరేషన్ చేయించా. –సీదరి సీతమ్మ, తరగం గ్రామం, దేవాపురం పంచాయతీ, పాడేరు మండలం -
అతను కత్తెర పడితే ఇక అంతే..! ఎవరి మాట వినడు!!
సాక్షి, గుంటూరు: ఆపరేషన్ సమయంలో ఇచ్చిన మత్తు కొద్ది కొద్దిగా వదిలే కొద్దీ నొప్పుల బాధ సూది గుచ్చినట్లు ఉంటుంది. పక్కన బంధువులు ఆత్మీయ స్పర్శ కోసం అర చేయి వెతుకులాడుతుంది. పొత్తిళ్ల బిడ్డ పాల కోసం గుక్క పెట్టినప్పుడు.. నొప్పుల బాధను భరించి.. కాస్త కదులుదామంటే కటిక నేలపై మూటలా పడి ఉన్న శరీరం సహకరించక కళ్లలో నీటి ఊట ధారలవుతోంది. ఇదీ రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న బాలింత దుస్థితి. ఎందుకంటే ఇక్కడ వైద్యుడు అనుమతి లేకుండానే ఆపరేషన్లు చేస్తుంటాడు. ఆస్పత్రిలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉంటే ఈయన రోజుకు 10 నుంచి 30 వరకు ఆపరేషన్లు చేసి బాలింతలను నేలపై పడుకోబెడుతుంటారు. ఇదంతా రోగులపై ప్రేమతోకాదు.. ఆయనకు వచ్చే పారితోషికానికి ఆశపడి. దీనిపై ఉన్నతాధికారులు మందలించినా ఆయన తీరులో మార్పు లేదు. ఈ వైద్యుడు చేసే ఆపరేషన్లతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం కుటుంబ నియంత్రణ( కు.ని) ఆపరేషన్లు మాత్రమే పరిమిత సంఖ్యలో చేయాల్సి ఉండగా జిల్లాలోని ఓ ప్రభుత్వ డాక్టర్ ప్రతి రోజూ 10 నుంచి 30 వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. సుమారు 10 రోజుల క్రితం రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు 30 ఆపరేషన్లు చేశాడు. అక్కడ సరిపడా పడకలు లేకపోవటంతో కటిక నేలపైనే ఆపరేషన్లు చేయించుకున్నవారిని పడుకోబెట్టాడు. ఆపరేషన్ చేసినందుకు తనకు వచ్చే తీసుకుని సదరు వైద్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి తెలిసి అక్కడకు వెళ్లి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ప్రతి రోజూ 5 నుంచి ఆరు వరకు మాత్రమే ఆపరేషన్లు చేయాలని ఆదేశించారు. అయినా సదరు వైద్యుడు మారలేదు. పడకలు ఆరు మాత్రమే జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడకలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. కానీ సదరు డాక్టర్ ప్రతి రోజూ పదికిపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. దీంతో ఆరోగ్య కేంద్రాల్లో పడకలు లేక ఆపరేషన్ చేయించుకున్న వారిని నేలపైనే పడుకోబెడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సదరు వైద్యుడు ఆపరేషన్లు చేయటం, వైద్య సిబ్బంది కూడా చోద్యం చూస్తూ ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కాకుండా ఇతర ఆపరేషన్లు సైతం అనుమతి లేకపోయినా చేసేవారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్న వారు చనిపోవటంతో గుంటూరులో పెద్ద రగడ జరిగింది. గత ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడితో కేసు రాజీ చేయించుకుని బయటపడ్డారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరుతో ఇతర ఆపరేషన్లు కూడా ఆయన చేస్తున్నారనే అనుమానాన్ని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్లకు అనుమతులు లేవు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు నియమాలు పాటించాలి. ఆయా ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులే శిక్షణ తీసుకుని ఆపరేషన్లు చేస్తుంటారు. ఒక వేళ ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరిన వైద్యులు ఉంటే వారికి ఆపరేషన్‌పై పట్టు వచ్చే వరకు సీనియర్ వైద్యులను అక్కడకు వెళళ్లి చేయాలని జిల్లా వైద్యాధికారులు ఉత్తర్వులు ఇస్తుంటారు. డబ్బులు కోసం అత్యాశతో అధిక సంఖ్యలో వైద్య సౌకర్యాలు కల్పించకుండా ఆపరేషన్లు చేస్తున్న సదరు వైద్యుడికి రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ డాక్టర్ తనకు అనుమతి ఇవ్వని ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి ఆపరేషన్లు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఆపరేషన్ చేసి వెళ్ళిపోతే అక్కడ సరిపడా వైద్య సౌకర్యాలు లేక ఆపరేషన్ చేయించుకున్న వారికి ఏదైనా రియాక్షన్స్ వస్తే తమకు ఇబ్బంది కలుగుతుందని ఆయా ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వాపోవుతున్నారు. సాక్షాత్తూ జిల్లా వైద్యాధికారే ఆయన్ని అధిక సంఖ్యలో ఆపరేషన్లు చేయవద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా ఆపరేషన్లు చేయటంపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కు.ని. ఆ‘పరేషాన్’ మాకొద్దు..!
గత పదిహేను రోజుల క్రితం వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. అయితే ఇక్కడ ఒక్క పురు షుడు కూడా ఆపరేషన్ కోసం కనీసం పేరు నమోదు చేసుకోలేదు. ఇక్కడ 24 ఆపరేషన్లు జరగగా అందులో ఒక్క వేసెక్టమీ ఆపరేషన్ జరగలేదు. సాక్షి, ఆసిఫాబాద్‌క్రైం: జిల్లాలో గతేడాది 1,793 ఆపరేషన్లు జరగగా అందులో కేవలం 17 మంది మగవాళ్లు మాత్రమే ఆపరేషన్ కోసం ముందుకొచ్చారు. మిగతా మహిళలకు అటు ప్రసవ వేదనతోపాటు ఈ కు.ని ‘కోతలు’ తప్పడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో వేసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో పురుషులకు చేసే ఆపరేషన్‌ను వేసెక్టమీ, మహిళలకు చేసే ఆపరేషన్‌ను ట్యూబెక్టమీ అని పిలుస్తారు. కొంతమంది మహిళల్లో రెండు మూడు కాన్పులు వరుసగా సిజేరియిన్ అయి, తిరిగి కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ ద్వారా పొట్టను నాలుగు, అయిదు అంగుళాలు మేర కోతకోయడంతో భవిష్యత్‌లో మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అవగాహన లేకే వెనుకడుగు గ్రామీణ ప్రాంతాల్లో అధిక భాగం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలంటే అది ఆడవాళ్లకు సంబంధించినదిగా భావించడం. దీనిని అధిగమించేందుకు వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉండే ఆశ, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు ప్రతీ ఇంటా విస్త్రృత ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా అలాంటి కార్యక్రమాలేవి లేకపోవడంతో ప్రసవ సమయంలోనే చాలా మంది మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. మగవారిలో చాలా మందికి వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా శారీరకంగా బలహీన మవుతామనే అపోహాతో పురుషులు ఈ ఆపరేషన్లు చేయించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ ఆపరేషన్లు చేసుకుంటే శారీరక శ్రమ చేయలేమనే భావనతో మగవాళ్లు వెనుకడుగు వేస్తున్నారు. స్త్రీల కంటే పురుషులకే సులభం మహిళల కంటే పురుషులకే కు.ని. ఆపరేషన్ ఎంతో సులువుగా ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు. మగవాళ్లకు చేసే కు.ని.ఆపరేషన్‌లో గతంలో కోత విధానం ఉండేది. కాని ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. ఇందుకోసం ఎన్నో అధునాతన పద్ధతులు వచ్చాయి. సాధారణ ఇంజక్షన్ వేసుకున్న తరహాలో ఆపరేషన్లు అయిపోతున్నాయి. రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వ్యవధిలోనే వేసెక్టమీ పూర్తవుతుంది. గంటలోపే డిశ్చార్జీ కావచ్చు. మూడు నెలల తర్వాత నిత్యం జీవితంలో చేసే అన్ని పనులన్నీ సక్రమంగా చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నా లేనిపోని అపోహాలతో పురుషులు కు.ని. ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా మహిళలకు కోతలు తప్పడం లేదు. దృష్టి సారించని వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్లు సంఖ్య పెరిగేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో తన సర్వీసులో ఒక్క వాసెక్టమీ ఆపరేషన్ చేయలేదని ఓ సీనియర్ వైద్యుడు చెప్పడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వేసెక్టమీ ఆపరేషన్లు పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత మేరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. అందుబాటులో లేని సర్జన్ జిల్లాలో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయాలంటే గైనకాలజీ డాక్టర్ ఎవరైనా చేయొచ్చు. అదే మగవారికి వాసెక్టమీ ఆపరేషన్ చేసేందుకు ప్రత్యేక వేసెక్టమీ సర్జన్ అవసరం. అయితే జిల్లాలో కనీసం ఒక్క సర్జన్ కూడా లేకపోవడంతో ఈ ఆపరేషన్లు జరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో 1,793 కుటుంబం నియంత్రణ ఆపరేషన్లు జరగగా అందులో 99 శాతం మహిళలే ఉన్నట్లు జిల్లా వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులు వెనుకడుగు వేస్తున్న మాట వాస్తవమే. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లేకపోవడమే. ఇందుకోసం వైద్య సిబ్బందితో వాసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్లు చేసే నిపుణుడు లేకపోవడం సమస్యగా మారింది. – డాక్టర్ సుబ్బారాయుడు,డీఎంహెచ్‌వో -
నోట్ బందీ సరే.. నస్ బందీ తెండి: గిరిరాజ్
పట్నా: దేశంలో నోట్‌బందీ (పెద్ద నోట్ల ఉపసంహరణ)జరుగుతోందనీ..ప్రభుత్వం నస్బందీ (జనాభా నియంత్రణ) కోసం కూడా చట్టాలు తీసుకురావాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ సలహా ఇచ్చారు. వేగంగా అభివృద్ధి సాధించటానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తప్పనిసరి చేస్తూ చట్టం తేవాలని ఆయన ఆదివారం అన్నారు. ‘ప్రపంచ జనాభాలో భారత జనాభా 17 శాతం ఉంది. ఆస్ట్రేలియా మొత్తం జనాభా ఎంతో, అంత జనాభా ప్రతి ఏడాది మన దేశంలో పెరుగుతోంది. అధిక జనాభానే మన అభివృద్ధికి అవరోధంగా మారింది. జనాభా నియంత్రణ చట్టాన్ని మన దేశంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని గిరిరాజ్ అన్నారు. ఇదొక దిక్కుమాలిన ఆలోచన అని బిహార్ సీఎం నితీష్ మండిపడ్డారు. -
ప్రతిసారీ ఇంతే!
చేవెళ్ల రూరల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు అధిక సంఖ్యలో మహిళలు రావడం... అందుకు వీలుగా సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. చేవెళ్ల శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి మొత్తం 150 మంది మహిళలు ఒక్క రోజే కు.ని. ఆపరేషన్లకు వచ్చారు. వీరిలో 145 మందికి శస్త్రచికిత్సలు చేశారు. ఆస్పత్రిలో కేవలం 24 మంచాలు ఉండటంతో ఒక్కో మంచా న్ని ఇద్దరేసి మహిళలకు కేటాయించారు. అవీ సరిపడకపోవడంతో మిగిలిన వారిని నేలపై పడుకోబెట్టారు. మధాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్లు కొనసాగాయి. కనీస వసతులు లేక మహిళలు, వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. సాయంత్రం తిరిగి వేళ్లేందుకు రవాణా సౌకర్యం లేక చంటి పిల్లలతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కనీసం తాగునీరు కూడా లేదు. దీంతో మహిళల కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ మహిళలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి.. ఆస్పత్రి వద్ద సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఇన్ చార్జి డాక్టర్ మోహన్, వైద్యులు కరీమూనీషాబేగం. నాగనిర్మల, రాగమాలిక, జయమాలిని, సిబ్బంది పాల్గొన్నారు. -
కు.ని. కష్టాలు
కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. మొత్తం 90 మంది మహిళలు, పురుషులు శస్త్రచికిత్స కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉదయం ఆపరేషన్లు చేస్తామని చెప్పిన అధికారులు సాయంత్రం 4గంటల వరకు కూడా ప్రారంభించలేదు. దీంతో భోజనాలు చేయకుండా వచ్చిన కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. సరిపడా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆపరేషన్ థియేటర్లో నేలపై, మెట్లపై కూర్చొని డాక్టర్ల కోసం పడిగాపులు కాశారు. రాత్రి వరకు 65 మంది మహిళలకు డాక్టర్ రజినీప్రియదర్శిని, 22 మంది పురుషులకు డాక్టర్ రవీందర్ ఆపరేషన్లు చేశారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత మహిళలను నేలపై పడుకోబెట్టారు. ఆస్పత్రిలో ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రతిసారీ ఇదే దుస్థితి ఎదురవుతోంది. కు.ని. ఆపరేషన్లలో క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ భిక్షపతి, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీ, డాక్టర్లు కృపాభాయి, రవళి, రాణి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
మరోసారి ఇలా జరగొద్దు
చేవెళ్ల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆరా తీశారు. ‘ఆపరేషన్ కష్టాలు’, బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురైన మహిళలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 23న ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఈవిషయంపై ఇంచార్జి వైద్యాధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పలు మండలాలకు చెందిన మహిళలకు ఒకేసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, బెడ్లు, వసతులు సరిపోకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన ఎమ్మెల్యే యాదయ్య దృష్టికి తీసుకొచ్చారు. మరోసారి అలా జరగొద్దని ఎమ్మెల్యే చెప్పారు. ఆపరేషన్ల కోసం వచ్చే మహిళలకు సరైన వసతులు, వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఈ విషయంపై తాను జిల్లా వైద్యాధికారులతో మాట్లాడతానని తెలిపారు. బెడ్లు, వసతులు సరిపోని పక్షంలో ఒక్కో మండలవాసులకు ఒక్కోరోజు ఆపరేషన్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య వైద్యులకు సూచించారు. -
డబ్బులిస్తామని మభ్యపెట్టి ఆపరేషన్లు చేశారు!
బిలాస్ పూర్: అధిక మొత్తంలో డబ్బులు ఇప్పిస్తామని ప్రలోభపెట్టి చత్తీస్ గఢ్ లో మహిళలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఒప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొన్ని రోజులక్రితం చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని 13 మంది మహిళలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇప్పిస్తామని చెప్పడంతో పాటు మందులను ఉచితంగా ఇప్పిస్తామని ఆరోగ్య అధికారులు తమను బలవంతంగా ఒప్పించారని బైగా అనే మహిళ భర్త మీడియాకు వెల్లడించాడు. అయితే ఆపరేషన్ తరువాత తన భార్య చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఆపరేషన్ తరువాత ప్రయాణ ఖర్చుల కింది రూ.40 మాత్రమే ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యాడు. రాయ పూర్ కు 260 కి.మీ దూరంలో ఉన్న గౌరెలా గిరిజన ప్రాంతాల్లో 18 మందికి పైగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. -
వికటించిన ఆపరేషన్లు, 8మంది మహిళలు మృతి
ఛత్తీస్‌గఢ్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 8మంది మహిళలు మృతి చెందారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో చోటుచేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మరో 50 మంది మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో 20మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. పరిస్థితి విషమంగా ఉన్నవారికి రూ.50 వేలు సాయం ప్రకటించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 83మంది మహిళలు (లాప్రోస్కోపీ) ఆపరేషన్లు చేయించుకున్నారు. అయితే ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు సోమవారం మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మంగళవారం మరణించినట్లు సమాచారం. మిగతావారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు వస్తున్న వార్తలను జిల్లా చీఫ్ మెడికల్ అధికారి బాంగీ తోసిపుచ్చారు. సీనియర్ వైద్యుడు డాక్టర్ ఆర్.కె.గుప్తా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లు జరిగినట్లు చెప్పారు. కాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అమీర్ అగర్వాల్ సొంతజిల్లాలో ఈ సంఘటనపై చోటుచేసుకోవటంతో విపక్షాలు మండిపడుతున్నాయి. -
‘24 గంటల్లోపే ఇంటికి పంపారు’
బేల : స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఈ నెల ఏడో తేదీన 17 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యులు, సిబ్బంది వారిని 24గంటల్లోపే ఇంటికి పంపించారు. ఆపరేషన్ అనంతరం వారు పలు సమస్యలతో ఇంటి వద్ద నానా అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు తాము ఆస్పత్రిలోనే ఉంటామని చెప్పినా బలవంతంగా ఇంటికి పంపించారని బాధిత మహిళలు వాపోయారు. ఇంటి వద్దే పర్యవేక్షణకు ఏఎన్ఏంలు, ఆశ వర్కర్లను పంపిస్తామన్న వైద్యులు ఆపై తమ బాగోగులు మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్లు చేసుకున్న మహిళలను కనీసం మూడు రోజులైనా ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించాల్సి ఉంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆపరేషన్లు చేసుకున్న మహిళల్లో సగం మంది వాంతులు, దగ్గు తదితర సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించిన మండలంలోని పాటన్, సిర్సన్న గ్రామాలకు చెందిన బాధితులు వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు వెళ్లక తప్పలేదు. ఈ విషయమై ఆస్పత్రి ఇన్చార్జి వైద్యాధికారి రాథోడ్ పవన్‌ను వివరణ కోరగా.. ఆపరేషన్లు చేసిన ఆరు గంటలకే ఇంటికి పంపించవచ్చని తెలిపారు. ఆపరేషన్లు చేసుకున్న మహిళల ఇంటి వద్దకు వెళ్లి పర్యవేక్షించాలని సిబ్బందికి చెప్పగా వారు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కడుపునొప్పి వస్తోంది : రిత, పాటన్ దవాఖానాలో ఉంటామని చెప్పినా ఇంటికి పంపారు. ఇంటికి వచ్చినాక దగ్గు లేచింది. దగ్గిన ప్రతీసారి కడుపు నొప్పి వస్తోంది. నిద్ర పడుతలేదు. నాతో పాటు వచ్చిన మరొకామె వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లింది. నేను కూడా పోత. బాధ్యులపై చర్య తీసుకుంటాం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలను స్థానిక పీహెచ్సీలో కనీసం మూడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలి. జరిగిన సంఘటనపై ఆరా తీసి నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటాం. - రుక్ష్మిణమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి -
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..
‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’’ అంటూ రెండు దశాబ్దాల క్రితం ఓ సినీ కవి అన్న పలుకులు నేటికీ అక్షర సత్యాలేనని నిరూపిస్తున్నారు మన వైద్య శాఖ అధికారులు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆస్పత్రులకు అందమైన భవనాలు కడతారు కానీ, అందులో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతారు. అందుకు ఈ చిత్రమే చక్కని నిదర్శనం. గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 61 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం ఇలా నేలపైనే పడుకోబెట్టారు. ఇదేమని అడిగితే వారిపైనే గుర్రుమన్నారు. ఆస్పత్రిలో సేవల తీరును మెరుగు పరచాలని కలెక్టర్ మూడు రోజుల క్రితమే ఆదేశించారు. అయినా వారు మారడం లేదు.. నిజామాబాద్ అర్బన్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు అవస్థలు తప్పడంలేదు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే ఈ దుస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతి గురువారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. గురువారం 61 మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. వీరికి కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఆపరేషన్ అనంతరం నేలపైనే పడుకోబెట్టారు. ఫ్యాన్లు లేక మహిళలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సౌకర్యాలపై ప్రశ్నిస్తే ఉంటారా! ఇంటికి వెళ్తారా? అంటూ వైద్య సిబ్బంది గద్దించారని పలువు రు పేర్కొన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కావలసిన ఆపరేషన్లు మధ్యాహ్నం 12 గంటల వరకు మొదలు కాలేదు. ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలు ఉదయం ఆరు గంటల నుంచే ఎలాంటి ఆహార పదార్థాలు, నీరు తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోయారు. వైద్యుల ఆలస్యంతో ఆపరేషన్లు చేయడంలో జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం ఉదయం 8గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల వరకు అపరేషన్లను ముగించాల్సి ఉంటుంది. నిధులు ఏమవుతున్నట్లు ? కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. శిబిరంలో నీటి వసతి, భోజన వసతి, ఉదయం పూట టిఫిన్ ఆపరేషన్ చేసే వైద్యుడికి రాను పోను చార్జీలు, టెంట్ వసతి కల్పిస్తారు. ఒక రోజు ముందు జిల్లా వైద్యాధికారి నిధులను మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఆస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహిస్తూ, ఆపరేషన్ల అనంతరం మహిళలను నేలపై పడుకోబెట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఈ ఆ పరేషన్ల శిబిరాలకు సంబంధించిన నిధులు మాత్రం సక్రమంగా వినియోగం కావడం లేదు. జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో 14 డీపీఎల్ కేంద్రాలు (కు.ని.ఆపరేషన్లు జరిగే ఆస్పత్రులు) ఉన్నాయి. వీటిలోనూ మహిళలకు ఆపరేషన్ల సందర్భంగా అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గోవింద్వాగ్మరేను సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు సౌకర్యాల లేమి
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహమిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయి నుంచి ప్రచారం నిర్వహిస్తోంది. కానీ ఎక్కువ మంది ప్రభుత్వ వైద్యశాలల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికి అధికారుల ఉదాసీన వైఖరే కారణమని మంగళవారం ఒంగోలులోని మాతా శిశు వైద్యశాల వద్ద పీపీ యూనిట్లో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల వైద్య శిబిరం నిర్వహణే నిదర్శనం. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కోసం ముందుగా 88 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మాత్రం 40 మడత మంచాలను తెప్పించారు. రెగ్యులర్ యూనిట్లో మరో 20 మంచాలున్నాయి. అయితే బాలింతలతోపాటు బంధువులు వచ్చారు. వీరి కోసం కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. తల్లులు శస్త్ర చికిత్సలకు వెళ్లినప్పుడు చంటి పిల్లలతో బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడే చెట్లకు ఊయలలు ఏర్పాటు చేసుకుని పిల్లలను ఆడించారు. మొత్తం 68 మంది బాలింతలకు శస్త్రచికిత్సలను నిర్వహించినట్లు పీపీ యూనిట్ క్యాంప్ అధికారి డాక్టర్ జే నాగేశ్వరరావు తెలిపారు. వీరికి 8,880 నగదు ప్రోత్సాహం, ధ్రువీకరణ పత్రాలు అందించామన్నారు. రిమ్స్ శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ వెంకయ్య శస్త్ర చికిత్సలను పర్యవేక్షించారన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు తిరుమలరావు, సాయికృష్ణ, వసుధ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల శిబిరాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ రామతులశమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై బాలింతలతో మాట్లాడారు.