ప్రతిసారీ ఇంతే!
చేవెళ్ల రూరల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు అధిక సంఖ్యలో మహిళలు రావడం... అందుకు వీలుగా సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. చేవెళ్ల శంకర్‌పల్లి, షాబాద్, మొయినాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి మొత్తం 150 మంది మహిళలు ఒక్క రోజే కు.ని. ఆపరేషన్లకు వచ్చారు. వీరిలో 145 మందికి శస్త్రచికిత్సలు చేశారు. ఆస్పత్రిలో కేవలం 24 మంచాలు ఉండటంతో ఒక్కో మంచా న్ని ఇద్దరేసి మహిళలకు కేటాయించారు.
అవీ సరిపడకపోవడంతో మిగిలిన వారిని నేలపై పడుకోబెట్టారు. మధాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్లు కొనసాగాయి. కనీస వసతులు లేక మహిళలు, వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. సాయంత్రం తిరిగి వేళ్లేందుకు రవాణా సౌకర్యం లేక చంటి పిల్లలతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కనీసం తాగునీరు కూడా లేదు. దీంతో మహిళల కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిసారీ మహిళలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి.. ఆస్పత్రి వద్ద సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఇన్ చార్జి డాక్టర్ మోహన్, వైద్యులు కరీమూనీషాబేగం. నాగనిర్మల, రాగమాలిక, జయమాలిని, సిబ్బంది పాల్గొన్నారు.