సాక్షి, తాడేపల్లి : నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు (aarogyasri) నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేయాలని హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
తొలివిడత కనీసం రూ.రెండు వేల కోట్లయినా రిలీజ్ చేయాలంటున్న నెట్ వర్క్ ఆస్పత్రులు (network hospitals) కోరుతున్నాయి. ఇవ్వాల్టి నుండి ఈహెచ్ఎస్ సేవలు, ఓపీని నిలిపేయాలని, 26 నుండి అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో
వైఎస్ జగన్ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ మేలు చేకూర్చింది. ఏకంగా 45,10,645 మందికి ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం రూ.13,421 కోట్లు ఖర్చయ్యింది. కానీ నేడు చంద్రబాబు పైసా కూడా విదల్చకపోవటంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉపక్రమించాయి.
బకాయిలు చెల్లించాల్సిందే
నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ అవినాష్ మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవుతున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకాయిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
కానీ, ఇప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేం సేవలు అందించలేం. పాత బకాయిలకు అదనంగా ప్రతినెలా వస్తున్న బిల్లులు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్పత్రులను నిర్వహించలేం. మాకు రావాల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమవారం నుంచి ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.
బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..
ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ (insurance) విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్‌వర్క్ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం.
బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మాత్రమే వర్తించడంతో సేవాభావంతో వైద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెరగాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీనిపై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment