జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రతిమారాజ్ తొలగింపు
ఐదేళ్లలో ఎన్నెన్నో ఆరోపణలు
ఆస్పత్రి నుంచి ఫిట్స్ రోగిని గెంటేసిన సిబ్బంది’ ఘటనతో తీవ్రత
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ కొనసాగిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జీజీహెచ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సైతం సమీక్ష సమావేశంలో మండిపడ్డారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఫిట్స్‌తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన మహిళను, కుటుంబ సభ్యులను సిబ్బంది పట్టించుకోని తీరు వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రి సిబ్బంది రోగికి స్కానింగ్ చేయకుండా, ప్రైవేట్‌కు వెళ్లమని సూచించారు.
చివరికి ఆస్పత్రి నుంచి గెంటి వేయడంతో మహిళా రోగితో పాటు ఆమె భర్త, పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు ఆస్పత్రి ప్రధాన గేట్ బయట చలిలో గడపడం.. తదితర అంశాలు ఆస్పత్రి నిర్వహణ తీరుపై అందరిలో ఆగ్రహం తెప్పించాయి. ఆస్పత్రిలో ఇలా రోగులు ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు సూపరింటెండెంట్ తన చాంబర్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులకు గురవుతున్న తీరు.. సిబ్బంది పట్టింపులేని తనంపై మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో డాక్టర్ ప్రతిమారాజ్‌ను ఇన్‌చార్జి సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్థూ ఆదేశాలతో డీహెచ్ తొలగించారు. అంతేగాకుండా అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
ఆరోపణలు ఇవే..
రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌లను బయట మార్కెట్లో అమ్ముకున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్‌టీఐ కింద సమాచారం అడిగిన వారు పోలీసు కేసు పెట్టించారు. గత వైద్యారోగ్యశాఖమంత్రి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా రూ. 28 లక్షలతో షెడ్డుతో పాటు, లిఫ్టు మరమ్మతులు, ఇతర పనులకు రూ. కోటికి పైగా వెచ్చించారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియస్‌గా స్పందించి మీరు డాక్టరా.. లేకుంటే ఇంజినీరా.. అని మండిపడడంతోనే ఇంజినీర్ పనుల్లో జోక్యం ఆగింది.
సుమారు నాలుగేళ్ల పాటు డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ఫోన్‌ను సొంతంగా వినియోగించకుండా సూపరింటెండెంట్ తన పీఏకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధికారులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్యులు ఎవరు ఫోన్ చేసినా పీఏనే ఫోన్ ఎత్తి మాట్లాడేవారు, సమాధానాలు చెప్పేవారు. వైద్యుల అటెండెన్సులు వేస్తూ ప్రతి నెల కమీషన్‌లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.
విచారణకు ఆదేశాలు..
జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ కొనసాగిన సమయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేయనున్నారు. సుమారు ఐదేళ్ల పాటు జరిగిన లావాదేవీలు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌లలో జరిగిన అవకతవలు, ఆరోగ్య శ్రీ నిధులు రూ.10 కోట్ల దుర్వినియోగం, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కు సంబంధం లేకుండా నాసిరకంగా చేపట్టిన పనులు, మందుల కొనుగోళ్లపై క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నారు. అతి త్వరలోనే విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment