ఈదులపాలెం వైద్యులను విచారిస్తున్న తహసీల్దార్ ప్రకాష్‌రావు
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఇటీవల అక్రమంగా నిర్వహించిన కుటుంబ సంక్షేమ ఆపరేషన్లపై సమగ్ర విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పాడేరు తహసీల్దార్ ప్రకాష్‌రావు సోమవారం ఉదయాన్నే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు జరిగిన మెడికల్ షాపుతోపాటు సమీప వీధిని ఆయన పరిశీలించి అక్కడి గిరిజనులను విచారించారు.
అనంతరం ఈదులపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని విచారించారు. మెడికల్ షాపులో ఆపరేషన్లు చేసిన వైద్యబృందం వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రి సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఆపరేషన్ చేయించుకున్న గిరిజన మహిళల కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల వీఆర్‌వోలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లో సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న గిరిజన మహిళల వివరాలను సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment