రాజ్యాంగేతర శక్తిగా సీఎం కార్యాలయం
పారదర్శకత, బాధ్యత లేకుండా పనిచేస్తోంది
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్
- అంతులేని రాజకీయ అధికార కేంద్రంగా మారిపోయింది
- సంస్కరణలు చేపట్టాలని చంద్రబాబుకు లేఖ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) రాజ్యాంగేతర శక్తిగా, అంతులేని రాజకీయ అధికార కేంద్రంగా మారిందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. సీఎంఓ ఏమాత్రం పారదర్శకత, బాధ్యత లేకుండా నడుస్తుండటం వల్ల పరిపాలనపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఓ బాధ్యతాయుతంగా పనిచేసేలా పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సమాంతర సచివాలయంగా మారిన సీఎంఓ ఎలాంటి ఫైళ్లు నిర్వహించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
అలాంటి కార్యాలయం ఏపీ సీఎంఓ ఒక్కటే
‘‘ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ప్రధానికి సలహాలు ఇచ్చిన, నోట్ రాసిన వారి సంతకాలు ఉంటాయి. గవర్నర్ కార్యాలయంలో గవర్నర్‌కు సలహా ఇచ్చిన వారి సంతకం ఉంటుంది. ఎలాంటి రికార్డులు, బాధ్యత, జవాబుదారీతనం లేకుండా పనిచేస్తున్న ఏకైక కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కటే. పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం లేవనడానికి ఇవే నిదర్శనం’’ అని ఐవైఆర్ కృష్ణారావు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి ఆయన రాసిన లేఖలోని ముఖ్యమైన అంశాలు...
‘‘ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, అదనపు కార్యదర్శి ఉన్నారు. అందరూ ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు తీసుకుంటున్నారు. అందువల్ల వారు నిర్వర్తించే విధులన్నీ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అయితే, ప్రస్తుతం సీఎంఓ అధికారులు రికార్డులు నిర్వహించకుండా తమకు అనుకూలంగా కొన్ని అనధికారిక నోట్స్ నిర్వహిస్తూ పనులు పూర్తికాగానే వాటిని చించివేస్తున్నారు. దీన్నిబట్టి సీఎంఓ ఎలాంటి మాన్యువల్స్ (రికార్డులు) నిర్వహించడం లేదని, జవాబుదారీతనంతో పనిచేయడం లేదని స్పష్టమవుతోంది.
ప్రజా ప్రయోజనాలకు విఘాతం
ఎలాంటి నియంత్రణ లేని ఈ తరహా సీఎంఓ పనితీరు వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. సచివాలయంలో కార్యదర్శులు, ఇతర అధికారుల్లాగే సీఎంఓ అధికారులు కూడా సర్వీస్ రూల్స్ ప్రకారం రికార్డులు నిర్వహించాలి. సీఎంఓ అధికారులు ఏయే ఫైళ్లు తెప్పించుకున్నారు? ముఖ్యమంత్రికి ఏయే సలహాలు ఇచ్చారు? ఏయే విభాగాలకు ఏమేం రాసి పంపించారు? అనే వివరాలను భద్రపరిచే విధానం ఉంటే ఫైళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ జవాబుదారీతనం లేకపోవడం వల్లే సీఎంఓ అధికారులు రాజ్యాంగేతర శక్తులుగా మారి ప్రోటోకాల్‌ను కాలరాస్తున్నారు. ఉన్నతాధికారులను పక్కన పెట్టి కిందిస్థాయి వారి నుంచి నేరుగా తమకు కావాల్సిన రీతిలో ఫైళ్లు తెప్పించుకుంటున్నారు. తమ సంతకాలు లేనందున భవిష్యత్తులో వివాదాల్లో ఇరుక్కోమనే ధైర్యంతో సీఎంఓ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.
పుటప్ కోసమే అయితే సెక్షన్ ఆఫీసర్లు చాలు
ముఖ్యమంత్రి పరిశీలన కోసం ఫైల్ పంపండి (పుటప్ ఫైల్) అని రాయడానికే సీఎంఓ అధికారులు ఉన్నట్లయితే ఇందుకు ఐఏఎస్ అధికారులు అవసరం లేదు. ఎలాంటి బాధ్యత, జవాబుదారీతనం లేకుండా కేవలం ఫైల్ పుటప్ అని రాసి విభాగాలకు పంపించడం ద్వారా సీఎంకు సహాయపడటానికే అయితే సెక్షన్ ఆఫీసర్లు సరిపోతారు. సీఎంఓలో తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. సీఎంఓ పారదర్శకంగా పనిచేసేలా, ప్రతి రికార్డునూ భద్రపరిచేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సంస్కరణలు అమల్లోకి తీసుకురావాలి. నా లేఖపై తీసుకున్న చర్యలను నాకు తెలియజేయాలి’’ అని సీఎంకు రాసిన లేఖలో ఐవైఆర్ పేర్కొన్నారు.