ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నిరోజులుగా పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల లాభం జరిగిందని నాలుగేళ్ల పాటు చంద్రబాబు మాట్లాడుతూ వచ్చారని.. కానీ ఇపుడు నష్టపోయామని చెబుతున్నారన్నారు.ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఏపీ రాజధాని అమరావతిపై తాను రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక త్వరలో మరిన్ని వాస్తవాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.