
సాక్షి, హైదరాబాద్: ఏపీ సర్కారు ఆమోదించిన స్విస్ చాలెంజ్ విధానాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండగానే వ్యతిరేకించానని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండగా స్విస్ చాలెంజ్ విధానంతో విభేదించిన విషయాల గురించి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరితే ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు.
అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానానికి ఆమోదముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఐవైఆర్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు పార్టీ ఇన్ పర్సన్‌గా(న్యాయవాదితో నిమిత్తం లేకుండా) తానే వాదనలు వినిపించారు. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది.