రాజధాని భూములతో ముడుపుల బేరం | Rs. Thousands of crores loss to the government treasury | Sakshi
Sakshi News home page

రాజధాని భూములతో ముడుపుల బేరం

Published Sat, Jul 22 2017 1:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రాజధాని భూములతో ముడుపుల బేరం - Sakshi

రాజధాని భూములతో ముడుపుల బేరం

కారుచౌకగా కట్టబెట్టి కమీషన్లు దండుకుంటున్న వైనం
- ఎకరా ధర రూ.4 కోట్లని స్విస్‌ చాలెంజ్‌లో స్పష్టీకరణ
- ఎస్‌ఆర్‌ఎంకు రూ.50 లక్షలకే అప్పగించిన ప్రభుత్వం
- ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం 
- ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి 200 ఎకరాలు
- ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి రూ.500 కోట్లు
- ఎస్‌ఆర్‌ఎం చాన్సలర్‌ పచ్చముత్తుపై లెక్కలేనన్ని అవినీతి, నేరారోపణలు 
 
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ రైతుల నుంచి బలవంతంగా సేకరించిన వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ప్రభుత్వ పెద్దలకు బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారిపోయాయి. కమీషన్లు దక్కితే చాలు కోరుకున్న వారికి కోరుకున్నన్ని భూములను కారుచౌకగా కట్టబెట్టేస్తున్నారు. గ్లోబల్‌ టెండర్లన్న మాటే ఎత్తడం లేదు.  రూ.వందల కోట్లు జేబుల్లో నింపుకుంటున్నారు. గ్లోబల్‌ టెండర్లు లేకుండానే రాజధానిలో ఇప్పటిదాకా ఐదు ప్రైవేట్‌ విద్యాసంస్థలకు మొత్తం 850 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టడం గమ నార్హం. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. రాజధానిలో ఎకరం భూమి ఖరీదు రూ.4 కోట్లు అని ‘స్విస్‌ చాలెంజ్‌’లో ప్రభుత్వమే ప్రకటించింది. కానీ, తాజాగా ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి ఎలాంటి టెండర్లు లేకుండానే 200 ఎకరాలను ఎకరా రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టింది. భూమి వాస్తవ ధరలో 12.5 శాతానికే అప్పగించడం వెనక రూ.వందల కోట్ల ‘ముడుపులు’ చేతులు మారాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.
 
ఎకరాకు రూ.3.5 కోట్లు నష్టం 
ప్రభుత్వం చెప్పినట్లు రాజధానిలో ఎకరం ధర రూ.4 కోట్లు. ఈ లెక్కన 200 ఎకరాల విలువ రూ.800 కోట్లు. ఎకరా రూ.4 కోట్ల విలువైన భూమిని రూ.50 లక్షలకే ఇచ్చేస్తే ప్రభుత్వం కోల్పోయిన రాబడి ఎకరాకు రూ.3.5 కోట్లు. 200 ఎకరాలంటే ఖజానాకు  రూ.700 కోట్ల నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. ఎస్‌ఆర్‌ ఎం యూనివర్సిటీకి చేకూరిన అయాచిత లబ్ధి రూ.700 కోట్లు కాగా, అందులో కనీసం సగం.. అంటే రూ.350 కోట్లు ముడుపుల రూపంలో ప్రభుత్వ పెద్దలకు దక్కినట్లు ఆరో పణలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ పెద్దలతో మరిన్ని లావాదేవీలు కొనసాగే అవకాశం ఉండడంతో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ యాజమాన్యం రూ.500 కోట్ల వరకు చెల్లించి ఉండొచ్చని రాజధానిలో చర్చ జరుగుతోంది. 
 
పచ్చముత్తు వల్ల నాలెడ్జ్‌ హబ్బా?  
చీటింగ్, భూకబ్జా కేసులు, పలు అవినీతి, నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చాన్సలర్‌ పచ్చముత్తును సాక్షాత్తూ సీఎం పొగడ్తల్లో ముంచెత్తడం గమ నార్హం. ఈ నెల 15న అమరావతిలో  యూనివర్సిటీ ప్రారంభోత్సవం నిర్వహించిన సంగ తి తెలిసిందే. ఈ సందర్భంగా పచ్చముత్తును బాబు ఆకాశానికేత్తేశారు.  ఐపీసీ సెక్షన్లు 406 (నేరపూరిత ఆలోచనతో చేసిన విశ్వాస ఘాతు కం), 420 (మోసం), 34 (కొంతమంది వ్యక్తులు కూడబలుక్కొని అమాయకులను మోసగించడం) కింద పచ్చముత్తు నిందితు డిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల్లో అరెస్టు కూడా అయ్యారు. అలాంటి పచ్చముత్తు వల్ల  అమరావతి నాలెడ్జ్‌ హబ్‌గా మారుతుందా? అని రాజధానివాసులు ప్రశ్నిస్తున్నారు.
 
సినీ నిర్మాత అదృశ్యం
పచ్చముత్తుకు ‘వెందర్‌ మూసీస్‌’ అధినేత మదన్‌ స్నేహితుడు. మెడికల్‌ సీట్ల కోసం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని సంప్రదించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు.. మదన్‌ను కలవమని వర్సిటీ వర్గాలు సూచించాయి. మదన్‌కు సొమ్ము ముట్టజెప్పిన తర్వాత మెడికల్‌ సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పాయి. వసూలైన సొమ్ము ముట్టజెప్పే విషయంలో పచ్చముత్తు, మదన్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మదన్‌ అదృశ్యమయ్యాడు. వారణాశి వెళ్లి గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి వెళ్లిపోయాడని చెబుతున్నారు. విద్యా ర్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును యూనివర్సిటీకి అప్పగించానని ఆ లేఖలో మదన్‌ పేర్కొన్నాడు. మదన్‌ ఆదృశ్యంపై అత డి భార్య, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పచ్చముత్తుపైనే అనుమానం వ్యక్తం చేశారు. 
 
రూ.80 కోట్ల స్థలానికి ఎసరు  
చెన్నై కోయంబేడు బస్టాండ్‌ సమీపంలో రూ.80 కోట్ల విలువైన తన స్థలాన్ని పచ్చముత్తు మనుషులు కబ్జా చేశారని, స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని తనను బెదిరిస్తున్నారని 62 ఏళ్ల  డైశీరాణి గతేడాది పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
 
ప్రభుత్వ భూమి కబ్జా 
తమిళనాడులోని కాంచీపురం జిల్లా కట్టన్‌ కలత్తూర్‌లో తంగల్‌ లేక్‌ వద్ద ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ కబ్జా చేసిన రూ.70 కోట్ల విలువైన 7 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని రెవెన్యూ శాఖ గతేడాది ఆగస్టులో నోటీసులు జారీ చేసింది. మెడికల్‌ అభ్య ర్థులను మోసం చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పచ్చముత్తును పోలీసులు అరెస్టు చేయడం, పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ చేస్తున్న నేపథ్యంలో... రెవెన్యూ నోటీసులు రావడం తో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ  వెనక్కి తగ్గింది. తమ ఆక్రమణలో ఉన్న 7 ఎకరాలను ఖాళీచేసి ప్రభుత్వానికి అప్పగించింది.
 
గ్లోబల్‌ టెండర్ల ఊసేది? 
ప్రైవేట్‌ సంస్థలకు భూములను కట్టబెట్టాలంటే నిబంధనల ప్రకారం.. గ్లోబల్‌ టెండర్లు పిలవాలి. ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకొచ్చిన సంస్థకే భూములు విక్రయించాలి. రాబడి పెంచుకునేందుకు ఏ ప్రభుత్వమైనా ఇదే పని చేస్తుంది. కమీషన్ల జబ్బు పట్టిన తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి నిబంధనలను గుర్తుచేస్తే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అందుకే అమరావతిలో భూముల కేటాయింపులో గ్లోబల్‌ టెండర్లు పిలవడం లేదు. అమరావతిలో ఇప్పటిదాకా ఊరూపేరూ లేని సంస్థలకు సైతం భూ సంతర్పణ చేశారు. కమీషన్ల కింద రూ.వందల కోట్లు దండుకున్నారు.
 
మెడికల్‌ సీట్లు ఇస్తామని భారీగా వసూళ్లు 
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌ కోటాలో మెడికల్‌ సీట్లు ఇస్తామని పచ్చముత్తు, ఆయన మను షులు పలువురు విద్యార్థుల నుంచి భారీ గా వసూళ్లు చేశారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని సీట్లు ఇవ్వలేదంటూ 100 మందికి పైగా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.75 కోట్లు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదులందాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement