సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునరావాసం కోసం తగిన చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ఇష్టారీతిన భూములు సేకరించడంపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం వ్యవసాయ భూములు సేకరించిన వ్యవహారంలో వాస్తవాలు చెబుతారా? లేదంటే మమ్మల్నే సూక్ష్మస్థాయి పరిశీలన చేయమంటారా అంటూ ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటివరకూ చేసిన భూ సేకరణ వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాలు లేవంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన విశ్వసించే విధంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇందులో వాస్తవం లేదని తేలితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం భూ సేకరణ ప్రక్రియనే నిలిపివేస్తామని హెచ్చరించింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన వాస్తవాలను తమ ముందుంచాలని ఆదేశించింది. దీంతో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ గడువు కోరగా.. న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హులం కాదని వారే చెప్పారు!
వివిధ ప్రాజెక్టుల కోసం భూములు సేకరిస్తున్న ప్రభుత్వం ప్రభావిత కుటుంబాల సంక్షేమం కోసం ఏమీ చేయడం లేదని.. వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం తగిన ప్రయోజనాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ వ్యవసాయ కార్మికుల సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.
ఇప్పటివరకు జారీ చేసిన 600 నోటిఫికేషన్లలో 448 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభావిత కుటుంబాలను గుర్తించేందుకు అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారని తెలిపారు. ప్రభావిత కుటుంబాలు ఉన్నట్లు ఈ సర్వేలో ఎక్కడా వారి దృష్టికి రాలేదన్నారు. ఓ చోట మాత్రం ప్రభావిత రైతు కూలీలున్నట్లు గుర్తించామని.. అయితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హులం కాదని వారే చెప్పారని ఆయన వివరించారు. వారు సీజనల్ వర్కర్స్ కావడం వల్ల వారి ఉపాధికొచ్చిన నష్టమేమీ లేదన్నారు. భూ యజమానులు తమ భూములపై ఆధారపడిన వారి వివరాలను తెలియజేయలేదని తెలిపారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘భూ యజమానులకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంటింటికి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. చట్టం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఇంటింటికి వెళ్లామంటారు.. అసలు ప్రభావిత కుటుంబాలు లేనే లేవంటారు? మీరు చెబుతున్న విషయాలు వినడానికి కొత్తగా ఉండటమే కాదు.. నవ్వు తెప్పిస్తున్నాయి. సీజనల్ వర్కర్లు ప్రభావిత కుటుంబాల కిందకు రారని ఎలా చెబుతారు? వ్యవసాయంపై ఆధారపడి బతికే వాళ్లంతా నిరుపేదలే. వారందరినీ ప్రభావిత కుటుంబాలు కాదంటే ఎలా?’ అంటూ న్యాయస్థానం ఘాటుగా ప్రశ్నించింది.
భూ సేకరణనే ఆపేస్తాం
Published Tue, May 1 2018 3:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment