
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ చాలెంజ్ విధానాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పిల్ దాఖలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. స్విస్ చాలెంజ్ నిర్ణయాల్లో ఐవైఆర్ కృష్ణారావు భాగస్వామిగా ఉన్నారని, ఆయన దీన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేయడం సరికాదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్‌దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు ‘స్విస్ చాలెంజ్‌పై నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు సీఎస్‌గా ఉన్నారా? లేదా? సీఎస్‌గా ఉండి నిర్ణయాల్లో భాగస్వాములైతే ఈ వ్యాజ్యం ఎలా వేస్తారు? ఈ విషయాల్ని అఫిడవిట్‌లో ప్రస్తావించలేదేం?’ అని కృష్ణారావును ప్రశ్నించింది. మొత్తం విషయాలతో సవరణ అఫిడవిట్ దాఖలు చేస్తానని కృష్ణారావు పేర్కొనటంతో.. న్యాయస్థానం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.