గ్రేటా థమ్‌బర్గ్ స్వీడన్ దేశానికి చెందిన విద్యా ర్థిని. గత సంవత్సరంగా ప్రతి శుక్రవారం పర్యా వరణ పరిరక్షణే ధ్యేయం గా నిరసనలు వ్యక్తం చేస్తూ గుర్తింపు పొందింది. సెప్టెంబర్ మాసంలో పర్యావరణ పరిరక్షణకు జరిగిన ప్రపంచవ్యాప్త ఉద్యమంలో న్యూయార్క్ నగరంలో పాల్గొనే ఉద్దేశంతో కేవలం సూర్యరశ్మి సహాయంతో నడిచే చిన్న పడవలో ప్రయాణం చేసి అమెరికా దేశాన్ని చేరుకున్నది. పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ వాయువులు వెలువడకుండా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సాహసానికి ఉద్య మించింది.
న్యూయార్క్ నగరానికి చేరుకొని నిర సన ఉద్యమంలో పాల్గొనడమే కాక ఐక్య రాజ్యసమితి పర్యావరణ సమావేశాల్లో కూడా పాల్గొని ప్రసంగించింది. ఆవేశపూరితంగా సాగిన ఆమె ప్రసంగాలు కొంత మంది విమర్శలకు అవ కాశం ఇచ్చినా, పర్యావరణ పరిరక్షణలో ఈ విద్యార్థిని చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఒక విధంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై ప్రపంచ దృష్టిని మళ్లించటంలో ఈ చిన్నారి సఫలీకృతం అయ్యిందనే చెప్పాలి.
ఇదే సమయంలో ఐస్లాండ్ దేశంలోని శాస్త్ర వేత్తలు ఆగస్టు నెలలో వాళ్ల దేశంలో కరిగిపోయిన ఓక్స్‌ఓకుల్ హిమనీనదానికి (గ్లేసియర్) ఒక జ్ఞాపికను ఏర్పాటు చేశారు. ‘భవిష్యత్తుకు మా లేఖ’ అనే శీర్షికతో ఏర్పాటుచేసిన ఈ జ్ఞాపికలో తమ దేశంలో కరిగిపోయిన మొదటి హిమనదం ఓక్స్‌ఓకుల్ అని.. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే రెండు వందల సంవత్సరాలలో ఐస్లాండ్ దేశంలో ఉన్న అన్ని హిమనీనదాలు కరిగిపోతాయని వారు పేర్కొన్నారు.
పర్యావరణ సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకుని రావడానికి స్వీడన్ దేశపు విద్యార్థిని ఒకవైపు అవిరళ కృషి జరుపుతుంటే, మరొకవైపు పర్యావరణ మార్పుల వలన వచ్చే దుష్ఫలితాలను ఐస్లాండ్ దేశంలో కరిగిపోయిన హిమనీనదం మనకు తెలియజేస్తూ ఉంది. మరొకవైపు ప్రపం చంలోనే శక్తివంతమైన దేశం, పర్యావరణ సమ స్యలకు కారణభూతమైన ప్రధాన దేశం అయిన అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పర్యావరణం అసలు సమస్యే కాదు అన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. ఇక బ్రెజిల్ దేశంలో అధ్యక్షుడు బోల్సనారో ఆధ్వర్యంలో దట్టమైన వర్షారణ్యాల విధ్వంసం కొనసాగుతోంది. పర్యా వరణ పరిరక్షణకి కొత్త అడవులను సృష్టించే బదులు దట్టమైన కీకారణ్యాలను నాశనం చేసుకుంటున్నాం.
పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ప్యారిస్ నగరంలో 2015లో సమా వేశమై ఒక ప్రధానమైన అంగీకారానికి రావడం జరిగింది. భూమండలంపై ఉష్ణోగ్రత స్థాయి పారిశ్రామిక యుగానికి ముందు ఉన్న ఉష్ణో గ్రత కన్నా రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ లను మించి ఉండ రాదు. ఈ ఒప్పందానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా ముందు ఆమోదం తెలిపాయి. కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించబడిన ప్రధాన ఒప్పందానికి ఆదిలోనే విఘాతం కలిగింది.
ప్యారిస్ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం పారి శ్రామిక యుగానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతల స్థాయి కన్నా రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ అధికంగా ఉష్ణోగ్రతలు కట్టడి చేయాలి అంటే కేవలం భవి ష్యత్తులో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు కట్టడి చేస్తే సరిపోదు.ఒక భార తదేశపు పరిమాణం కలిగిన ప్రదేశాన్ని అరణ్యంగా మార్చి కొత్తగా చెట్లను నాటితే గాని మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేము. దీనిని బట్టే సమస్య తీవ్రత మనం అర్థం చేసుకోగలం.
ప్రత్యామ్నాయంగా బొగ్గుపులుసు వాయువును భూమి లోపలి భాగంలో బంధించడం ద్వారా కూడా ఇదే ప్రయోజనాన్ని సాధించవచ్చు కానీ ఆ సాంకేతికత ఇంకా పూర్తిగా విజయవంతమైనది కాదు. చెట్లు నాటడం ద్వారా బొగ్గుపులుసు వాయువు పరిమాణాలను వాతావరణంలో తగ్గించడం చాలా సులభమైన మార్గం. ఉన్న అడవులనే నరికేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగే పనిగా తోచడం లేదు.వాతావరణ కాలుష్యానికి సింహ భాగం కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్గారాలు తగ్గించుకోటానికి ఇష్టపడనప్పుడు అభి వృద్ధి చెందుతున్న దేశాలను ఈ దిశగా త్యాగాలు చేయమని కోరటం హాస్యాస్పదమే అవుతుంది.
అందు కనే పర్యావరణ పరిరక్షణకు జరిగే అన్ని ఒడం బడికలు ఒప్పందాలు కాగితాల మీదనే మిగి లిపోతున్నాయి.ఈ సమస్యపై ఒక అవగాహనకు వచ్చిన దీనికి సంబంధించిన ఖర్చు ఎవరు భరిస్తారు అనేది కూడా తేలని సమస్యగానే మిగిలిపోతుంది. వాతావరణ కాలుష్యానికి కారణభూతులైన అభి వృద్ధి చెందిన దేశాలు ఈ ఖర్చులు భరించాలి అనే ది అభివృద్ధి చెందే దేశాల సహేతుకమైన వాదన. కానీ అలా భరించటానికి అభివృద్ధి చెందిన దేశాలు సిద్ధంగా లేవు.
ఈ సమస్య ప్రభుత్వాల మధ్య ఒప్పందాల ద్వారా అమలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకనే ప్రభుత్వాలకు అతీతంగా ప్రజలే ఈ అజెండాను తమదిగా భావించి ముందుకు తీసుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన వాతావరణ పరి రక్షణ ర్యాలీ అన్ని దేశాలలోని ప్రజలు పాల్గొ నటంతో చాలా విజయవంతంగా ముగిసింది.
ప్రకృతి పరిరక్షణ, తృప్తికరౖమైన సాధారణ జీవన విధానంకు అనుగుణంగా పారిశ్రామికీకరణతో కూ డిన ఆధునిక యుగం రాకముందు మానవ జీవన విధానం సాగేది. పర్యావరణ రక్షణకు అదే శ్రీరామరక్ష. కానీ అభివృద్ధి చెందిన దేశాలు తమ సదుపాయాలు వదులుకొని ఈ అంశంలో మార్గదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా లేని నాడు వాతావరణంలో జరిగే మార్పులు మానవాళికి పెద్ద ఎత్తున హాని కలిగించే ప్రమాదం పొంచి ఉన్నది.
వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com
Comments
Please login to add a commentAdd a comment