
2014లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో ప్రభుత్వం కొలువుదీరింది. మళ్లీ లోక్‌సభకు 2019లో ఎన్నికలు. కానీ ఈ మధ్యకాలంలో దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికల హడావుడి, సందడి. 2014లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత హరియాణా జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించారు. 2015లో ఒక రాష్ట్రంలో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. 2016లో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. 2017లో 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా, 2018లో మరొక ఎని మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి.. జరగనున్నాయి. ఇకపోతే, 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
1967 వరకు చాలావరకు జమిలి ఎన్నికలు నిర్వహించారు. 1971 తర్వాత అప్పటిదాకా జమిలిగా జరుగుతున్న ఈ ఎన్నికలను వేరువేరుగా నిర్వహిం చడం మొదలైంది. దీనికితోడు 1970 దశకం నుంచి మొదలైన ఆయారాం గయారాం విధానాలు చాలా రాష్ట్రాలలో రాజకీయ అనిశ్చితికి దారి తీశాయి. క్రమంగా లోక్‌సభ స్థాయిలోనూ ఆయారాం గయారాం విధానం మొదలవటంతో అక్కడ కూడా అని శ్చిత పరిస్థితులు నెలకొని ఐదేళ్ల కాలపరిమితి కన్నా ముందే కొన్నిసార్లు లోక్‌సభ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో రెండు సార్వత్రిక ఎన్నికల మధ్యకాలంలో ప్రతి ఏడాది ఎన్నికలు ఉండే విధానం తయారైంది.
ఎన్నికల సంఘం ప్రకారం మన దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు రూ.3,870 కోట్లు. లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు రూ. 900 కోట్ల దాకా ఖర్చవుతోంది. ఇక రెండు సార్వత్రిక ఎన్నికలకు మధ్యకాలంలో నిర్వహించే వివిధ రాష్ట్రాల ఎన్నికల ఖర్చు రూ.2,970 కోట్లు. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు కూడా నిర్వహిస్తే అయ్యే ఖర్చును 50:50 దామాషాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిం చటం జరుగుతుంది. అలా కాక రాష్ట్ర శాసనసభకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఖర్చునంతా రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు దృష్టితో చూస్తే జమిలి ఎన్నికల విధానం రాష్ట్రాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.
కానీ రాష్ట్రాల ఎన్నికలు ప్రత్యేకంగా నిర్వహిం చడం వలన ప్రయోజనం ఉన్నట్టయితే ఆర్థికంగా కొంత ఎక్కువ ఖర్చైనా ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. ఈనాడు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దుబారా ఖర్చుతో పోల్చుకుంటే ఈ రూ. 2,970 కోట్ల ఖర్చు ఎక్కువగా అనిపించకపోవచ్చు. కానీ ఎటువంటి ప్రయోజనం ఒనగూరనప్పుడు ప్రత్యేక ఎన్నికలకు పోవడం వృథా శ్రమే అవుతుంది.
జమిలి ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన కారణాలు ప్రధానంగా రెండు. ప్రతి ఎన్నికకు ముందు వాటి తీవ్రతను బట్టి ఒక నెల ముందుగానో రెండు నెలల ముందుగానో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తుంది. ఇక అప్పటి నుంచి ప్రధానమంత్రి, వారి మంత్రివర్గ సహచరులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నులవుతారు. దేశ పరిపాలన యంత్రాంగం ఒకరకంగా స్తబ్దతలోకి వెళ్ళిపోతుంది. 2014–19 మధ్య జరిగిన ఎన్నికల ప్రచార సమయాన్ని పరిశీలిస్తే మొత్తం ఐదేళ్లలో 1/3 సమయం కేవలం ఎన్నికల ప్రచారానికి సరిపోయింది. సార్వత్రిక ఎన్నికల తరువాత కొలువుతీరిన ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ఐదేళ్లు పూర్తిగా మధ్యలో ఏ చికాకులు లేకుండా పరిపాలన పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉండాలి. జమిలి ఎన్నికలు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించగలవు.
కానీ అన్ని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరపటం ఇప్పుడు ఏ విధంగా సాధ్యమనేది ప్రధానాంశం. దీనికి మనకు కొంత వెసులుబాటు 74, 75 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నగరపాలిత ప్రాంతాలకు ఏర్పాటుచేసిన విధి విధానాలు కలుగజేస్తున్నాయి. పై రెండు రాజ్యాంగ సవరణలలో పొందుపరిచిన 343(ఇ)4, 343(యు) 4 ప్రకరణల ద్వారా ఐదేళ్ల మధ్యకాలంలో ఏదైనా పంచాయతీలో కానీ నగరపాలిత ప్రాంతంలో కానీ మళ్లీ ఎన్నికలు జరిగితే, ఎన్నికైనవారు ఆ శేష సమయానికి మాత్రమే తమ విధులను నిర్వహిస్తారు. అలా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆయా సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవడమైంది. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా కొన్ని శాసనసభల కాలపరిమితిని కుదించి జమిలి ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేయవచ్చు. కానీ దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అయితే అపోహలతో, పరస్పర అపనమ్మకాలతో సాగుతున్న నేటి రాజకీయ వ్యవస్థలో ఇది సాధ్యపడుతుందా అనేది సందేహాస్పదమైన అంశం.
ఐవైఆర్ కృష్ణారావు (వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, iyrk45@gmail.com)
Comments
Please login to add a commentAdd a comment