ఎన్నికలకు విశ్వసనీయత కల్పించడం, రాజకీయ పక్షాలు వెలువరించే ఎన్నికల ప్రణాళికలు ఆచరణయోగ్యమైనవిగా లేనప్పుడు లేదా అధికారంలోకొచ్చాక ఆ ప్రణాళికలను బేఖాతరు చేసిన ప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై కాక ఇప్పుడు జమిలి ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వ హించడంలోని మంచిచెడ్డల సంగతలా ఉంచి తాజాగా ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదన సహజంగానే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒక ఏడాది రద్దయ్యే అసెంబ్లీలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం ఆ ప్రతిపాదన సారాంశం. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకొచ్చాక జమిలి ఎన్నికలపై అడపా దడపా చర్చ సాగుతూనే ఉంది. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉన్న ప్పుడు లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక ఈ జమిలి ఎన్నికల గురించి మొదటగా ప్రస్తా వించింది. ఆ తర్వాత బీజేపీయే తరచు దీన్ని గురించి మాట్లాడింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒకేసారి ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. ఆయన స్థానంలో వచ్చిన రాంనాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో సైతం ఈ ప్రతిపాదన గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇప్పుడు ఎన్నికల సంఘం(ఈసీ) చేసిన ప్రతిపాదన జమిలి ఎన్నికల ఆలోచనకు భిన్నమైనది. జమిలి ఎన్నికల ఉద్దేశం ‘ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు’ అయితే...ఈసీ చెబుతున్నది ‘ఒక ఏడాది– ఒకేసారి ఎన్నికలు’. అలాగని ఈసీ జమిలి ఎన్నికలకు వ్యతిరేకి కాదు. అది జరగాలంటే రాజ్యాం గంలోని వివిధ అధికరణలకు సవరణలు తీసుకురావడం పెద్ద పని గనుక తన ప్రతిపాదనను పరిశీలించాలని అది కోరుతోంది. నిజమే... జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలోని అధికరణలు– 83(పార్లమెంటు ఉభయ సభల పదవీకాలం), 85(లోక్‌సభ రద్దు), 172(రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం), 174(అసెంబ్లీల రద్దు), 356(రాష్ట్రపతి పాలన విధింపు)–వగైరాలను సవరించాల్సి ఉంటుంది. ఈసీ ప్రతిపాదనకైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని 15వ సెక్షన్ సవరిస్తే సరి పోతుంది. ఆ సెక్షన్ ప్రకారం పదవీకాలం పూర్తవుతున్న అసెంబ్లీకి వ్యవధి ఆరు నెలలకు మించి ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకూడదు. నిరుడు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగ్గా అందులో అయిదు రాష్ట్రాలు–పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు ఒకసారి... గుజ రాత్, హిమాచల్‌ప్రదేశ్‌లకు మరోసారి రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఒక ఏడాదిలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలన్నిటినీ ఒకేసారి జరపాలన్న ఈసీ తాజా ప్రతిపాదన సాకారం కావడానికి అడ్డంకులు పెద్దగా ఉండవు. అలాగే రెండు, మూడు నెలలు తప్ప ఎవరూ పెద్దగా నష్టపోయేది ఉండదు.
అయితే జమిలి ఎన్నికల్లాగే దీనికి కూడా ఆచరణలో బోలెడు సమస్యలు ఎదురవుతాయి. ఒకేసారి ఎన్నికలు జరిగిన రాష్ట్రాలన్నిటా పాలకపార్టీలు ఒకే రకంగా నికరమైన మెజారిటీ తెచ్చుకోలేకపోవచ్చు. ఉదాహరణకు మొన్న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తగిన మెజారిటీ లేక చతికిలబడింది. దాని స్థానంలో వచ్చిన జేడీ(ఎస్)– కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లు అధికారంలో నెట్టుకురాగలదో తెలియదు. ఆ రెండు పార్టీల మధ్యా అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నందువల్ల అదెప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరూ సుస్థిర ప్రభుత్వాన్ని అందించే అవకాశం లేదని తేలినప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకెళ్లడం మినహా మరో మార్గం ఉండదు. అలాంటి సందర్భాలు అరుదుగా తప్ప రావని అనుకోవడానికి లేదు. పైగా పటిష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు సైతం కుప్పకూలిన ఉదం తాలు మన దేశంలో లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో అఖండ మెజారిటీ సాధించి అధికారంలోకొచ్చిన ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఆయన కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన అల్లుడు చంద్రబాబే కుప్పకూల్చారు. దీనికి విరుగుడుగా ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దుకు విఫలయత్నం చేశారు. ఆయన అభీష్టం నెరవేరితే వెనువెంటనే మళ్లీ ఎన్నికలు వచ్చి ఉండేవి.
అన్ని పార్టీల తీరుతెన్నులూ ఒకేవిధంగా ఉంటున్నాయన్న అభిప్రాయం ఓటర్లలో ఏర్పడి, అది నిర్లిప్తతకు దారితీసినప్పుడు సహజంగానే ఎన్నికల ఫలితాలు అనిశ్చితిని తీసుకొస్తాయి. అలాగే అధికార పక్షాలు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న వైనం కూడా ప్రజల్లో ఏవగింపు కలిగిస్తోంది. ఈ విషయంలో ఫిరాయింపుల వల్ల నష్టపోయే పార్టీ తప్ప మరెవరూ మాట్లాడరు. స్పీకర్లు కళ్లు మూసుకుంటారు. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని గవర్నర్ వరకూ ఎవరూ అది తప్పని చెప్పరు. న్యాయస్థానాలు సైతం ఏళ్ల తరబడి నాన్చడం తప్ప త్వరగా తేల్చవు. అలాగే డబ్బులిచ్చి ఓట్లు కొనడం, ఇతరత్రా ప్రలోభపరచడం వంటి పనులు రాను రాను పెరుగుతున్నాయి. ఇలాంటి పరిణామలు ప్రజల్లో నైరాశ్యాన్ని మరింత పెంచుతున్నాయి. వీటిని పోగొట్టడానికి ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే...పరిష్కారాన్ని అన్వేషిస్తే ఎన్నికలకు విశ్వసనీయత కలుగుతుంది. హంగ్ అసెంబ్లీల బెడద తప్పుతుంది. అప్పుడు జమిలి ఎన్నికల విధానమైనా, మరొక విధానమైనా సత్ఫలితాలనిస్తుంది. ఒకేసారి ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించి, ఇలాంటి సమస్యలను విస్మరించడం వల్ల అనుకున్న ప్రయోజనాన్ని సాధించడం సాధ్యం కాదు. తాము రూపొందించే ఎన్నికల ప్రణాళికల గురించి, వాటిల్లో చేసే వాగ్దానాల గురించి నిబంధనలు పెట్టాలని పార్టీలు ఎటూ కోరవు. కనీసం ఈసీ అయినా ఆ దిశగా ఆలోచించాలి. లా కమిషన్‌కు అది చేసిన సూచనలు ఇలాంటి అంశాలన్నిటితో మరింత సమగ్రంగా ఉంటే బాగుండేది.
Comments
Please login to add a commentAdd a comment