జాతి వైవిధ్యతకు ‘జమిలి’ ప్రమాదం | Vidya Bhushan Rawat Article On One Nation One Election | Sakshi
Sakshi News home page

జాతి వైవిధ్యతకు ‘జమిలి’ ప్రమాదం

Published Sat, Jun 22 2019 12:58 AM | Last Updated on Sat, Jun 22 2019 8:47 AM

Vidya Bhushan Rawat Article On One Nation One Election - Sakshi

దేశంలో భారీస్థాయికి చేరుకున్న ఎన్నికల ఖర్చును తగ్గించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏకకాలంలో అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించడం పేరిట జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దీనిలో సాధ్యాసాధ్యాలు, జాతీయ–స్థానిక రాష్ట్రస్థాయి సమస్యల మధ్య వ్యత్యాసం వంటి ఆచరణాత్మక అంశాలను పక్కనబెట్టి చూస్తే, ఈ ప్రతిపాదనలో అంతకు మించిన ప్రమాదం పొంచి ఉందన్నది వాస్తవం. వివిధజాతుల సమ్మిళత సంస్కృతిగా మన రాజ్యాంగం ఘనంగా ప్రవచించిన భారతీయ బహుముఖ వైవిధ్యతను నిర్మూలించి దేశం మొత్తాన్ని ఏకజాతీయ చట్రంలో ఇరికించే స్వబావంతో జమిలి ఎన్నికల భావన ముందుకొస్తోంది. అధికార పార్టీకి తిరుగులేని బలం చేకూర్చే ఆ ప్రతిపాదన అమలైతే దేశం, పౌరులు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఒక దేశం ఒకే పోల్‌ పేరిట దేశంలో ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న జమిలి ఎన్నికల నినాదం అతి ప్రమాదకర సంకేతాలను వెలువరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జమిలి ఎన్నికల భావన వివిధజాతుల సమ్మిళిత సంస్కృతిగా మనం ఘనంగా చెప్పుకునే  భారతీయ వైవిధ్యతను నిర్మూలించి దేశం మొత్తాన్ని ఏకజాతీయ చట్రంలో ఇరికించే స్వబావంతో ముందుకొస్తోంది. సజాతీయత ముసుగులో ఎన్నికలు గెల్చుకోవడం అనే ప్రక్రియను విజయవంతంగా ముగించిన కేంద్రంలోని పాలకపార్టీకి జమిలి ఎన్నికలు వరంగా మారటం ఖాయం. కానీ అతిపెద్ద దేశంగా ఉంటూ తనే ఒక ఖండంగా భాసిల్లుతున్న భారతదేశంలో ఎన్నికల కమిషన్‌ సన్నద్ధత తీరుతెన్నులను పరిశీలించే వారికి ఒక విషయం సుబోధకమే. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన సహాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఏమిటంటే, ఒకే రోజు దేశవ్యాప్తంగా పోలింగ్‌ నిర్వహించి ఫలితాలను నాలుగురోజుల్లోపే ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ని కోరడమే.

దేశం మొత్తంలో ఎన్నికలను ఒకేరోజు ముగించడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వీటిలో మొట్టమొదటిది ఏమిటంటే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రాతిపదికన పార్టీల గెలుపోటములపై విచ్చలవిడిగా సాగుతున్న అంచనాలను అరికట్టవచ్చు. ఎగ్జిట్‌ పోల్స్‌ తనకు తానుగా ఒక దందా లాగా మారిపోయి మార్కెట్లోని దళారీలకు ఫలితాల అంచనాల పేరిట కోట్లాదిరూపాయలు కొల్లగొట్టే అవకాశాలు కల్పిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల కేంపెయిన్‌ మార్చి 10న మొదలై మే 19న చివరి దశ ప్రచారంతో ముగిసింది. మే 23న ఫలితాల లెక్కింపు జరి గింది. ఇంత సుదీర్ఘకాలం జరిగే ఎన్నికల ప్రక్రియ వల్ల అనేక పుకార్లు వ్యాప్తి చెందుతూ, అంచనాలు పెరుగుతూ పోవడమే కాదు.. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై, భారత ఎన్నికల సంఘం పనితీరుపైనే సందేహాలను రేకెత్తిస్తోంది. కాబట్టి, మోదీ జమిలి ఎన్నికలను కోరుకుంటున్నట్లయితే, దేశమంతా ఒకేరోజు పోలింగ్‌ పూర్తి చేసి తదుపరి నాలుగైదు రోజుల్లోనే ఫలితాలను వెల్లడించేలా తగిన ఏర్పాట్లను సిద్ధం చేయాలి. అవసరమైన చోట రీపోల్స్‌ జరిపించడం, ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించడానికి ఈ అయిదు రోజుల వ్యవధి సరిపోతుంది. 

ఇక రెండో విషయం.. ఒకే దేశం ఒకే పోల్‌ విధానంలో ఎన్నికల నిధులను ప్రభుత్వమే సమకూర్చడం. పోలింగ్‌ జరగడానికి రెండు నెలల ముందే రాజకీయ పరమైన ప్రకటనలను, ఒపీనియన్‌ పోల్స్‌ని నిషేధించాల్సి ఉంటుంది. మూడోది.. రాష్ట్ర అసెంబ్లీలు వివిధ కాలాల్లో ఏర్పడుతుంటాయి. ఇది ఎల్లప్పుడూ సంభవించే ప్రక్రియ. శాసనసభలకు కూడా ఏకకాలంలో ఎన్నికలు 1950 మొదట్లో మాత్రమే జరిగేవి. కానీ ఆ తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధి మారుతూ వచ్చింది. ప్రభుత్వాలు కుప్పగూలిపోవడం, రాష్ట్రపతి పాలన వంటి పలు పరిణామాలు దీనికి కారణం. ఇలాంటివి పదే పదే జరగటం సహజం. సార్వత్రిక ఎన్నికలు జరిగేవరకు రాష్ట్రాల అసెంబ్లీలను అనిశ్చితంగా ఉంచలేరు. అలా ఉంచితే అది పూర్తి సమస్యాత్మకంగా మారుతుంది. 

అంతకుమించి జాతీయ సమస్యలకు, స్థానిక రాష్ట్ర స్థాయి సమస్యలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది. ఇవి రెండు ఎన్నటికీ ఒకటిగా ఉండలేవు. ప్రస్తుతం ఎన్నికల కోసం జరుగుతున్న భారీ స్థాయి ఖర్చును తగ్గించాలని ప్రధానమంత్రి భావించడంలో తప్పులేదు. మనం అర్థం చేసుకోగలం కూడా. కానీ వాస్తవమేమిటంటే స్వయంగా ఆయన పార్టీనే ఈ దఫా ఎన్నికల్లో విపరీతంగా ఖర్చుపెట్టింది. బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ కలిపి కూడా బీజేపీ పెట్టిన ఖర్చులో కనీసం 50 శాతం కూడా వెచ్చించలేకపోయాయి. కాబట్టి భారీస్థాయిలో డబ్బులు వెదజల్లి అధికారంలోకి వచ్చిన పార్టీ తనతో సమాన స్థాయిని కలిగి ఉండే పార్టీల ఉనికిని ఎన్నడూ అంగీకరించదు. 

అందుకే ప్రస్తుత కేంద్రప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండటంకోసం దూకుడుగా తన ఆధిపత్యాన్ని చలాయించడానికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యం నిజంగా బలోపేతం కావాలంటే అమెరికా అధ్యక్షపాలనా వ్యవస్థ తరహాలో మన దేశంలోనూ రెండు దఫాలకు మించి ఎవరూ ప్రధాని పదవిని చేపట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజాస్వామీకరణ ప్రక్రియను సంఘటితం చేస్తుంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా ప్రజాస్వామీకరణ ప్రక్రియకు అనుమతించాలి. అప్పుడు మాత్రమే మనదేశంలోని రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ కుటుంబాల వారసత్వపు హక్కుగా మారలేవు. పైగా ఒకే జాతి, ఒకే పోల్‌ అనేది ఏరకంగా చూసినా ఆచరణ సాధ్యమయ్యే భావన కాదు. ఒక అసెంబ్లీలే ఎందుకు, పార్లమెంటే ఎందుకు, పంచాయతీలు, పట్టణ స్థానిక పాలనా సంస్థలు, జిల్లా పరిషత్‌లు అన్నిం టికీ ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పోలా? ఇది ఎంత అనాలోచితమైన, అవాస్తవికమైన ప్రతిపాదనో అర్థం చేసుకోవచ్చు. 

ప్రధాని మోదీ తలంపులోంచి పుట్టుకొచ్చిన ఈ జమిలి ఎన్నికల భావనలో కొత్తదనం అన్నది లేదు. చరిత్రలో శక్తిమంతుడైన ప్రతి వ్యక్తీ, నియంతా తిరుగులేని అధికారాన్నే కోరుకున్నాడు కానీ అది ఆచరణాత్మకం కాదు. వాస్తవం అంతకంటే కాదు. రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాన్ని బట్టి వివిధ రాష్ట్రాల శాసనసభలు వివిధ కాలాల్లో ఎన్నికలకు వెళ్తుంటాయి. శాసనసభల పదవీకాలాన్ని ఒకసారి నిర్ణయించిన తర్వాత దాదాపు అదేసమయంలో అవి ఎన్నికలకు వెళ్తుంటాయి. ఈ చట్రానికి అవతల ఎవరూ ఎలాంటి ప్రయోజనమూ పొందలేరు. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ తన చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఉజ్వల దశను ఇప్పుడు అనుభవిస్తోంది. పైగా ప్రతి దేశంలోని ప్రతి పాలనా వ్యవస్థా ఇప్పుడు దాని చేతుల్లో ఉన్నాయి. ఈ దన్ను, దమ్ముతోనే అది దేశవ్యాప్తంగా సమస్త ప్రతిపక్షాలను దిగ్బంధించాలని ప్రయత్నిస్తోంది. కానీ బీజేపీ ప్రయత్నాలకు దేశం చెల్లించే మూల్యం అసాధారణంగానే ఉంటుంది.

ఒకేదేశం, ఒకే ఎన్నిక అంటూ మోదీ చేసిన ప్రతిపాదనను లా కమిషన్‌ కూడా తర్కించి ఈ అంశంపై తమ అభిప్రాయాలను తెలుపాల్సిం దిగా వివిధ రాజకీయపార్టీలను కోరింది. అయితే భారతీయ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఒక భాగం మాత్రమే. ఎన్నికలకు సంబంధించిన ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నికల సంఘానికి, న్యాయవ్యవస్థకు, అందరికంటే మించి భారతీయ ఓటరు లేదా పౌరుడికి కూడా భాగముంది. అందుకే ఈ కీలకమైన అంశంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు అన్ని వర్గాల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవాలి.

భారత్‌ ఇప్పటికీ పరిణితి చెందుతూ ఉన్న ప్రజాస్వామ్యంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటోంది. ఎదుగుతున్న దేశం అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిలో అతిపెద్ద సవాలు చక్కటి, పారదర్శకమైన, సమర్థ పాలనను అందివ్వడం. కానీ మనదేశంలో రాజకీయ నేతలు అధికారంలోకి రావడానికి ముందు హామీలను గుప్పించి ఎన్నికై అధికారంలోకి వచ్చింతర్వాత వాటిని అవలీలగా మర్చిపోతూ, పక్కనబెడుతూ  మరో అయిదేళ్లవరకు అధికారం చలాయిస్తూ ఉంటారు. చివరకి మరో దఫా ఎన్నికలకు సమయం సమీపిస్తున్నప్పుడు మాత్రమే వీరికి తాము గతంలో చేసిన హామీలు గుర్తుకొస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల వలే కాకుండా భారత్‌ వంటి వర్ధమాన దేశాల్లో రాజకీయనేతలు, బ్యూరోక్రాట్లు చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తూ, చట్టపాలన అమలుకాని పరిస్థితిని అందిపుచ్చుకుని శిక్షలనుంచి తప్పించుకుంటుంటారు. అందువల్లే అధికారం కైవసం చేసుకున్న నేతలు, వారి అధికారులు, ప్రభుత్వ సేవకులు అధికారాన్ని తరచుగా దుర్వినియోగ పరుస్తూనే ఉంటారు. రాజ కీయ నేతలు తామిచ్చిన హామీలకు కట్టుబడకపోతే వారిని తిరస్కరించే అవకాశం 

ఓటర్లకు అయిదేళ్లకుగానీ రాదు. ఈ స్థితిలో మార్పులు తీసుకొచ్చేంత వరకు, అపసవ్య పాలన అమలవుతున్న వ్యవస్థలో ఎన్నికలను ఇప్పుడున్న రీతిలో యధాతథంగా కొనసాగించడమే ఉత్తమం. 
దేశవ్యాప్తంగా ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంలో ఉండే పరిహాసాన్ని, అభాసను ఒకసారి చూడండి. ఈ ఎన్నికల సమయంలో అమిత్‌ షా, స్మృతి ఇరానీ గుజరాత్‌ నుంచి తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. రెండు విభిన్న తేదీల్లో వీరు రాజీనామా చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్నికల కమిషన్‌ ఒక అసాధారణ ఆదేశాన్నిచ్చి, ఆ రెండు రాజ్యసభ స్థానాలకు విభిన్న తేదీల్లో పోలింగ్‌ నిర్వహించింది. ఆ రెండు స్థానాలను బీజేపీకే దక్కనివ్వాలనే ఈసీ తలంపు వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 

పాలక పక్షం ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తోలుబొమ్మలాగా మారి ఎన్నికల సంఘం తన ప్రతిష్టను తానే ఈ రకంగా దిగజార్చుకోవచ్చా? ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటూ చర్చ లేవనెత్తుతున్న అధికార పార్టీకి గుజరాత్‌లో రెండు రాజ్యసభ స్థానాలకు ఏకకాలంలో, ఒకే తేదీన ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేకపోయిందా? ఎంత కపటత్వమో ఇది. జమిలి ఎన్నికల పేరిట అధికార పార్టీ భవిష్యత్తులో చేసే చేష్టలు ఇలాగే కొనసాగుతాయి. రాజ్యంగం ప్రవచించిన భారతీయ బహుముఖీన వైవిధ్యాన్ని నిర్మూలిస్తూ ఏక సంస్కృతి, ఏకజాతితత్వాన్ని ముందుపీఠికి తీసుకువస్తున్న క్రమంలో పాలకపక్షం తొండాట ప్రారంభంలోనే ఈ స్థాయిలో రుజువవుతోంది మరి!


వ్యాసకర్త : విద్యా భూషణ్‌ రావత్‌, సామాజిక, మానవ హక్కుల కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement