ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు ముంబై స్టాక్ ఎక్సే్చంజ్‌లో అమరావతి బాండ్ల క్రయవిక్రయాలను ప్రారంభించడానికి వెళ్లి అక్కడ ముంబై స్టాక్ ఎక్సే్చంజ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో భాగంగా, భారత్‌లో ఇంతవరకు ఒలిం పిక్ క్రీడలు నిర్వహించలేదని ఈ క్రీడలు అమరావతి నగరంలో నిర్వహించడానికి సిద్ధమని పేర్కొన్నారు.
భారతదేశంలో ఇంతవరకు ఒలింపిక్ క్రీడలు నిర్వహించకపోవడం మనమందరం ఆలోచించాల్సిన విషయం. అయితే ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన వివిధ దేశాల అనుభవాలను పరిశీలిస్తే మనం ఈనాడు దేశానికి లాభసాటి అయ్యేవిధంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించుకునే పరిస్థితి ఉందా లేదా అనేది స్పష్టమవుతుంది. గత నాలుగు ఒలిం పిక్ క్రీడలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిర్వహించారు. అవి గ్రీసు, చైనా, లండన్, బ్రెజిల్. వీటిలో ఇంగ్లండ్‌ను అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. చైనా ప్రపంచంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న దేశం. గ్రీసు దేశం ఒలింపిక్ క్రీడలు నిర్వహించక ముందు కూడా అభివృద్ధి చెందిన దేశమే. ఎటొచ్చీ ఒలింపిక్ క్రీడల అనంతరం ఆ దేశానికి సమస్యలు మొదలైనాయి.
బ్రెజిల్ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక ప్రముఖ దేశం. అవినీతి, ఆర్థిక అసమానతలు ఈ దేశంలో కూడా మనకు కనిపిస్తాయి. ఈ నాలుగు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒలింపిక్ క్రీడల నిర్వహణ ప్రభావాన్ని పరిశీలించే ముందు ఒలింపిక్ క్రీడల నిర్వహణకు అయ్యే ఖర్చు ఒకసారి చూద్దాం.
ఒలింపిక్ నిర్వహణ ఖర్చులు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. గ్రీసు దేశం ఖర్చు 65 వేల కోట్లుగా అంచనా వేసింది. అదే చైనా దేశంలో ఈ ఖర్చులు 3 లక్షల కోట్లుగా లెక్కించారు. ఇంగ్లండ్ దేశం లక్ష కోట్ల రూపాయలు ఒలింపిక్ ఖర్చులుగా పరిగణించింది. బ్రెజిల్ దేశంలో ఖర్చు అన్ని మౌలిక సదుపాయాలను లెక్కలోకి తీసుకుంటే లక్షా 40 వేల కోట్లుగా లెక్కవేశారు. కనీస ఖర్చు ఇంగ్లండ్‌లో లాగానే లక్ష కోట్ల రూపాయలు. కాగా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ లక్షా 30 వేల కోట్ల రూపాయలు. ఇది ఒలిం పిక్ నిర్మాణ ఖర్చుకు సమానంగా ఉంది. 25 లక్షల కోట్ల భారతదేశ బడ్జెట్లో 4% ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి కావాల్సి ఉంటుంది.
ఇకపై నాలుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒలిం పిక్ క్రీడలు ఏవిధంగా ప్రభావితం చేశాయో పరిశీ లిద్దాం. ఇంగ్లండ్, చైనా దేశాల్లో ఒలింపిక్ క్రీడల నిర్వహణ ఆ దేశ ఆర్థిక వ్యవస్థలు మరింత పుంజుకోవటానికి దోహదం చేశాయి. రెండు దేశాల్లోనూ క్రీడలు అయిన తర్వాత ఆ సదుపాయాలను ఎట్లా వినియోగించాలని ముందుగానే ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి సదుపాయాలు నిరర్థకంగా ఉండిపోలేదు. ఉదాహరణకు ఇంగ్లండ్ దేశంలో ఒలింపిక్స్ కోసం నిర్మించిన ప్రధాన క్రీడా స్థలాన్ని ఫుట్‌బాల్ క్రీడాస్థలంగా వాడుకున్నారు.
ఇక గ్రీసు దేశం విషయంలో ఆ దేశం అప్పుల ఊబిలోకి నెట్టబడటానికి ఒలింపిక్ క్రీడలు కూడా ఒక ప్రధాన కారణమని ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వారి జాతీయ స్థూల ఉత్పత్తిలో 4 శాతం నష్టం ఒలింపిక్ క్రీడల వల్ల ఏర్పడిందని ఒక ఆర్థిక శాస్త్రవేత్త అంచనా వేశారు. ప్రాచీన కాలపు శి«థిలాలకు ప్రసిద్ధి చెందిన గ్రీసు దేశం ఒలింపిక్ క్రీడల తర్వాత ఒలింపిక్ క్రీడా ప్రాంగణాల రూపంలో ఆధునిక శిథిలాలకు ప్రసిద్ధి చెందిందని హాస్య పూర్వకంగా ఒకరు వ్యాఖ్యానించారు.
ఒలింపిక్ క్రీడల నిర్వహణ వలన భారీగా నష్టపోయిన దేశం బ్రెజిల్. క్రీడలు మొదలవటానికి ముందే దేశం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. క్రీడలు పూర్తయిన తర్వాత దేశంలో ఆర్థిక మాంద్యం చోటు చేసుకుంది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. క్రీడల నిర్వహణలో లోటుపాట్ల మూలం గా దేశానికి అంతర్జాతీయంగా మంచి పేరు రాలేదు.
భారతదేశ పరిస్థితి బ్రెజిల్ కన్నా భిన్నంగా ఉంటుందని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఈనాడు దేశంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ కన్నా చాలా ముఖ్యమైన ప్రాధాన్యాలు ఉన్నాయి. అభివృద్ధి రేటు పెంపు, మానవ అభివృద్ధి సూచికలో పెరుగుదల, శిశు మరణాలు అరికట్టడం, అక్షరాస్యత వంటి అంశాలలో గణనీయమైన అభివృద్ధి సాధించగలిగిన నాడు దానంతటదే ఒలింపిక్ క్రీడలు నిర్వహించే అర్హత భారతదేశానికి వస్తుంది. ఆ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు క్రీడలు నిర్వహించటం చైనా, ఇంగ్లండ్ దేశాల లాగా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి దోహదం చేస్తుంది. అది కాదని తొందరపడితే బ్రెజిల్, గ్రీసు దేశాల అనుభవాలే మనకు ఎదురవుతాయి.
ఐవైఆర్ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com
Comments
Please login to add a commentAdd a comment