
సాక్షి, హైదరాబాద్ : ‘విషయ బలం, ఆలోచనలు లేనివారు ప్రధానాంశాన్ని పక్కదారి పట్టించేందుకు బిగ్గరగా అరవడం, సంబంధం లేని అంశాలను తెరపైకి తీసుకురావడం వంటివి చేస్తుంటారు. నేను రాసిన ‘ఎవరి కోసం అమరావతి’ పుస్తకం విషయంలోనూ దురదృష్టవశాత్తూ కొందరు ఇలాంటి కుట్రే పన్ని అత్యంత ప్రధానమైన సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న నాకు అమరావతి గురించి మాట్లాడే అర్హత లేదనే వాదన ఇందులో భాగమే’.. అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.
తాను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నప్పటికీ, పుట్టింది, పెరిగింది, చదువుకున్నది మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనేనన్నారు. తాను ఎక్కడున్నప్పటికీ తన అనుబంధం ఎప్పటికీ ఏపీతోనే ఉంటుందని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాను రాసిన పుస్తకంలోని వాస్తవ అంశాలను కొందరు జీర్ణించుకోలేకే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఐవైఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో ఉంటున్న తనకు స్థానికత లేదని, అందువల్ల ఏపీ కొత్త రాజధాని గురించి ప్రస్తావించే అర్హత లేదన్నట్లు కొందరు మాట్లాడటం సరికాదన్నారు. ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉందని.. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని అనేక సంస్థలు ఇంకా విభజనకు నోచుకోలేదని ఆయన గుర్తుచేశారు.