‘ఓటుకు కోట్లు’ తర్వాత బాబు నోరు మెదపలేదు | IYR Krishna Rao comments about Cash for vote case and chandrababu | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ తర్వాత బాబు నోరు మెదపలేదు

Published Sun, Dec 2 2018 4:13 AM | Last Updated on Sun, Dec 2 2018 4:14 PM

IYR Krishna Rao comments about Cash for vote case and chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఓటుకు కోట్లు’ కేసులో ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ రాజీ పడ్డారని రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముఖ్యమంత్రి  చంద్రబాబు ముందుకు వెళ్లకుండా, బ్రీఫ్డ్‌ మి కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్లకుండా పరస్పరం అంగీకారానికి వచ్చారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్‌ నరసింహన్‌ ఇద్దరు సీఎంల మధ్య రాజీ కుదిర్చారని, కేసీఆర్‌ షరతులకు చంద్రబాబు అంగీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరుతో రచించిన పుస్తకంలో ‘అవర్‌ పీపుల్‌ బ్రీఫ్డ్‌ మి..’ అధ్యాయం పేరుతో అప్పటి పరిస్థితులను ఐవైఆర్‌ వివరించారు. అందులోని అంశాలపై ‘సాక్షి’ అందిస్తున్న సిరీస్‌ కథనాల్లో భాగమిది.

గొంతు బాబుది కాదంటూనే ట్యాపింగ్‌ అక్రమమన్నారు..
‘2015 జూన్‌ 1వతేదీ సాయంత్రం టీవీ చూస్తుండగా ‘‘అవర్‌ పీపుల్‌ బ్రీఫ్డ్‌ మి..’’ ఉదంతం ప్రసారమమవుతోంది. ఈ సంభాషణ వినగానే నాకు మతిపోయినట్లయింది. ఒక సీఎం ఎన్నికల అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు రావడం, రుజువుగా గొంతు కూడా వినిపించడంతో ఆయన ప్రతిష్ట దెబ్బ తింటుందనే అనిపించింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి.. స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్లి శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు డబ్బులు ఇవ్వజూపినట్లు అప్పటికే టీవీల్లో చూపించారు. తరువాత ఏకంగా ముఖ్యమంత్రే ఫోన్‌లో మాట్లాడినట్లు చూపించారు. సాయంత్రానికల్లా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. దీనిపై రాజ్యాంగపరమైన, చట్టపరమైన, న్యాయపరమైన, రాజకీయపరమైన అన్ని చర్యలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు చంద్రబాబుది కాదన్నారు. ఒకవైపు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు చంద్రబాబుది కాదంటూనే మరోవైపు ట్యాపింగ్‌ అక్రమమని అన్నారు. ఇది జరిగిన రెండో రోజు జూన్‌ 2న విజయవాడలో మహాసంకల్ప దీక్షకు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్, పరకాల ప్రభాకర్‌తో కలసి ప్రత్యేక విమానంలో వెళ్లాం. 

ఆ సమయంలో ముఖ్యమంత్రి ముఖంలో నెత్తుటి చుక్క లేనట్లు కనిపించింది. ఆయన మౌనంగా ఏదో ఆలోచిస్తూ కనిపించారు. విమానంలో పరకాలను లోకేశ్‌  అభినందించారు. అనంతరం మహా సంకల్ప దీక్షలో పాల్గొన్న సీఎం పరధ్యానంగానే కనిపించారు. అక్కడి నుంచి స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు వెళ్లి అధికారులను కలిశాం. డీజీపీ, నేను, కొంతమంది ముఖ్యులు అందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా సీఎం ఇంకా తేరుకోనట్లు కనిపించారు. ఆయన ముఖంలో చాలా అలసట, బడలిక కనిపించాయి. అంతా కలిసి చర్చించిన తర్వాత తమ ఫోన్ల ట్యాపింగ్‌ జరిగిందనే అంచనాకు వచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కేసు వేసి వారిని ముద్దాయిలుగా చేస్తే అవతలి పక్షం ఆత్మరక్షణలో పడుతుందని భావించారు. విజయవాడలో కేసు ఫైల్‌ చేయాలని నిర్ణయించారు. 

రెండు విషయాల్లో సీఎంల మధ్య అవగాహన..
మహా సంకల్ప దీక్ష బహిరంగ సభలో మాత్రం కేసీఆర్‌ కయ్యానికి కాలు దువ్వుతున్నారని, కేసులు పెడితే భయపడేది లేదని చంద్రబాబు చెప్పారు. తాను నిప్పులాంటి మనిషినన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, కేసీఆర్‌కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, జగన్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మర్నాడు కేసీఆర్‌ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. కేసుల్లో చంద్రబాబును తాము ఇరికిస్తే ఇరికేంత అమాయకుడు కాదని, ఆయన గోతులు తీయగల సమర్ధుడని వ్యాఖ్యానించారు. ‘‘పట్టపగలు దొరికిన దొంగ.. నిన్నెవరూ కాపాడలేరు’’ అని చంద్రబాబును హెచ్చరించారు. ఇద్దరు సీఎంల మధ్య యుధ్ధం ఢిల్లీ దాకా వెళ్లింది. ఫోన్‌ ట్యాపింగ్‌ అక్రమమంటూ కౌంటర్‌ దాఖలు చేయడం, రచ్చ చేయడంతో చంద్రబాబుకు ప్రయోజనం చేకూరింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలని భావించడం వల్ల ఓటుకు కోట్లు కేసు ప్రాముఖ్యం కోల్పోయింది. విషయాన్ని అక్కడికక్కడే ముగించి ఇద్దరి మధ్య అవగాహన కుదర్చాలని కేంద్రం నిర్ణయించినట్లు కనిపించింది.

గవర్నర్‌ నరసింహన్‌ కూడా ఢిల్లీ వెళ్లి జరిగిన విషయాలను హోంమంత్రికి వివరించారు. సీఎంల మధ్య సంధి కుదర్చమని కేంద్రం కోరే ఉంటుంది. ఇద్దరి మధ్య రెండు విషయాల్లో మాత్రం అవగాహన ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు కొంత వెసులుబాటును కేసీఆర్‌ కల్పిస్తారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై చంద్రబాబు న్యాయస్థానంలో ముందుకు వెళ్లరు. కేసీఆర్‌ మరికొన్ని షరతులు కూడా విధించి ఉంటారు. ‘‘మీరు (టీడీపీ సర్కారు) హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోవాలి. మొత్తం సచివాలయాన్ని తరలించి కట్టుబట్టలతో వెళ్లాలి. తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మిగిలినవి నేను చూసుకుంటా. వెళ్లిపోండి..’’ అని కేసీఆర్‌ చెప్పి ఉంటారు. కౌంటర్‌  కేసు వేయటం చంద్రబాబుకు ఉపయోగపడింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విషయంలో ఆయన తదుపరి చర్యలు తీసుకోలేదు. దానికి కాలదోషం పట్టింది. ఇక ఓటుకు కోట్లు కేసు కూడా తెరమరుగవుతుందనే అనుకుంటున్నా. తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని కేసీఆర్‌ తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బలపడేలా చేసుకున్నారు. 

ఇక ఆ తరువాత బాబు నోరు మెదపలేదు...
ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు చాలా బలహీనపడ్డారు. ఆయన మొదట్లో కేసీఆర్‌ గురించి తేలికగా మాట్లాడేవారు. 2015 జూన్‌ 2 తర్వాత ఇక నోరు విప్పలేదు. జూన్‌ 2కు ముందు చంద్రబాబు ఒక మనిషి కాగా ఆ తర్వాత ఆయన మరో మనిషిలా మారారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం, విషయాలను డీల్‌ చేసే విధానాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. ఈ కేసులో విచారణ వెంటనే సాగి ఉంటే సాక్ష్యాధారాలు మరింత బయటపడేవి. ఎక్కడి నుంచి ఎక్కడకు డబ్బు వెళ్లింది? ఎవరు విత్‌ డ్రా చేశారు? ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించారు? అనే విషయాలు అంతా తెలిసేవి. మనీ ట్రయిల్‌ కూడా బయటపడేది. ముఖ్యమంత్రిదే కాకుండా మరికొందరు ముఖ్యుల ఫోన్‌ సంభాషణలు కూడా రికార్డు చేశారని విన్నా. ఏమైనా విచారణ ఆగిపోయింది. ఫోరెన్సిక్‌ నివేదిక మాత్రం ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. అదే సమయంలో ఫోరెన్సిక్‌ నిపుణుడు గాంధీని సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నియమించుకున్నారు. ఓటుకు కోట్లు కేసు వెలుగు చూసిన సమయంలోనే గాంధీ అవసరం ఎందుకు గుర్తుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి’     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement