నాడు ద్రోహం.. నేడు మోసం | Chandrababu who betrayed the farmers now playing drama with All-Party Demand | Sakshi
Sakshi News home page

నాడు ద్రోహం.. నేడు మోసం

Published Fri, Jul 9 2021 3:43 AM | Last Updated on Fri, Jul 9 2021 10:56 AM

Chandrababu who betrayed the farmers now playing drama with All-Party Demand‌ - Sakshi

సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టి రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు సాగు, తాగునీళ్లు దక్కకుండా ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు దాఖలు చేయించి అఖిలపక్షం డిమాండ్‌తో మరో నాటకానికి సిద్ధమయ్యారు. నాడూ నేడూ రైతులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కృష్ణా జలాల వివాదంపై ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్‌ చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ వివాదం ఏర్పడటానికి మూలకారకుడు చంద్రబాబేనని గుర్తు చేస్తున్నారు.

ఈ పాపం ఎవరిది బాబూ?
విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం బోర్డు పరిధి, వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఎవరి భూ భాగంలో ఉన్నవాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించేలా 2014లో ఏర్పాటు చేసింది. దీని ప్రకారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్‌ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. ఏపీ భూభాగంలో ఉన్న సాగర్‌ కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందంటూ దాన్ని కూడా తెలంగాణ సర్కార్‌ తన నియంత్రణలోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో జలవిద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుచూపి దాన్ని కూడా తెలంగాణ సర్కార్‌ స్వాధీనం చేసుకుంది. 

కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో..
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ఈ అక్రమంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్‌ చేస్తూ యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం దిగువకు నీటిని వదిలేస్తోంది. ఫలితంగా శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది.

బలగాలను వెనక్కి రప్పించిన బాబు..
నాగార్జునసాగర్‌ కుడి కాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన జలాలు పూర్తి స్థాయిలో విడుదల కాకున్నా 2015 ఫిబ్రవరి 12న తెలంగాణ సర్కార్‌ అర్థాంతరంగా ఆపేసింది. ఈ క్రమంలో ఆంధప్రదేశ్‌ భూ భాగంలో ఉన్న  సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, అధికారులు పోలీసు బలగాలతో మరుసటి రోజు నాగార్జునసాగర్‌ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన నాటి సీఎం చంబ్రాబుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వా«ధీనం చేసుకోవడానికి వెళ్లిన రాష్ట్ర అధికారులను చంద్రబాబు వెనక్కి రప్పించారు. దీంతో సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ తెలంగాణ సర్కార్‌ అధీనంలోనే ఉండిపోయింది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా తెలంగాణ సర్కార్‌ సాగర్‌ కుడి కాలువకు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలం..
శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్‌ అక్రమంగా చేపట్టింది. వీటితోపాటు కేసీ కెనాల్‌కు నీళ్లందించే సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి 5.44 టీఎంసీలు తరలించేలా తుమ్మిళ్లను, పాలేరు రిజర్వాయలోకి 5.54 టీఎంసీల ఎత్తిపోతలకు భక్త రామదాస, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను అక్రమంగా తెలంగాణ చేపట్టింది. నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచింది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీలను అక్రమంగా తరలించేలా 2015లోనే పనులు ప్రారంభించింది. ఈ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 2016లో మే 16 నుంచి 18 వరకూ కర్నూలులో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్ష చేశారు. నాటి సీఎం చంద్రబాబు దీనిపై స్పందించలేదు.

చివరకు తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవాలని కృష్ణా డెల్టా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశాన్ని నిర్వహించారు. కేటాయింపులకు మించి ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ద్వారా వాడుకోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆ సమావేశంలో చెప్పారు. కానీ తెలంగాణ అప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేయడంలో నాటి సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికే అపెక్స్‌ కౌన్సిల్‌లో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారని  స్పష్టమవుతోంది. ఫలితంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి తదితర అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి, నెట్టెంపాడు, మిషన్‌ భగీరథలను ఇప్పటికే పూర్తి చేసింది. 

సొంత జిల్లా ప్రజలకు వెన్నుపోటు..
కండలేరు జలాలను తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్‌నాయుడుతోపాటు మరో 13 మంది పార్టీ నేతలతో ఎన్జీటీలో చంద్రబాబు కేసు వేయించి తన నైజాన్ని చాటుకున్నారు. 

హక్కుల పరిరక్షణకు నిర్మాణాత్మక చర్యలు..
కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని నీటిపారుదలరంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని, బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను వినియోగించుకునేందుకే ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులను చేపట్టారని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు గతేడాది అక్టోబర్‌ 6న కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని అపెక్స్‌ కౌన్సిల్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టం చేశారు. తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలు వృథాగా కడలిలో కలిసేలా చేస్తూ తెలంగాణ సర్కార్‌ సాగిస్తోన్న అక్రమాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement