సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను తెలంగాణ అడ్డగోలుగా దోచేస్తున్న తీరుపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని పౌర సంబంధాలు, సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చి దిగజారుడు విమర్శలు ఏమిటని ప్రశ్నించారు. ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి చంద్రబాబు వెళ్లింది పరామర్శకా? లేక హెరిటేజ్‌కు పాలు పంపిన పాత లెక్కలు తేల్చుకోవటానికా? అని నిలదీశారు. ‘నదులపై పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్న ప్రతిపాదనపై మీ స్టాండ్ ఏమిటి? ఇష్టానుసారంగా తోడటం, జలవిద్యుదుత్పత్తి, శ్రీశైలంలో 800 అడుగుల మట్టం వద్దే తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తరలించడంపై ఎలా స్పందిస్తారు? తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి నోరు తెరవనందుకు మీకు ఏ శిక్ష వేయాలి?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు.
భయపడి హైదరాబాద్‌లో దాక్కున్నారు
కరోనా నియంత్రణలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించాయి. కరోనా పరీక్ష కేంద్రాలు, ఆక్సిజన్ బెడ్స్, వైరాలజీ ల్యాబ్‌లను ప్రభుత్వం శరవేగంగా సమకూర్చుకుంది. ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మిన్నగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు అబద్దాలు వల్లిస్తున్నారు. తాను అధికారంలో ఉంటే కరోనాను కంట్రోల్ చేస్తానని చెప్పే వ్యక్తి భయపడి హైదరాబాద్‌లో ఎందుకు దాక్కున్నారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో 97 శాతాన్ని కేవలం 20 నెలల్లోనే అమలు చేశారు. వచ్చే మూడేళ్లలో మిగతావి పూర్తవుతాయి. 600 హామీలిచ్చిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారు. రుణమాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. రజకులు, మత్స్యకారులు, కాపులను దగా చేశారు. తన పాలనలో చంద్రబాబు గిరిజనులకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదు.
నీళ్లిస్తే ఎందుకు తరిమేశారు?
కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. అదే నిజమైతే ఆయన్ను ఎందుకు ఓడించారు? ప్రజలను విశ్వాస ఘాతకులని ఆయన దూషించడం న్యాయమేనా? చంద్రబాబు పాపాలకు ప్రజలు రెండేళ్ల క్రితమే శిక్ష విధించినా ఆయనకు ఇంకా జ్ఞానోదయం కాలేదు. కృష్ణా డెల్టాలో 2014 దాకా రెండు పంటలూ పండేవి. ఆయనొచ్చాక ఒక పంటకే నీళ్లొచ్చాయి. ఐదేళ్లలో దాళ్వాకు నీళ్లిచ్చిన పాపాన పోలేదు. వైకుంఠపురం బ్యారేజీకి కనీసం ఒక్క ఇటుకైనా వేశారా? ఓడిపోయాక ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. మాట ఇచ్చి వెన్నుపోటు పొడవడం బాబు నైజం.. మాట ఇస్తే మడమ తిప్పని చరిత్ర వైఎస్సార్ కుటుంబానిది. యువతకు 2.60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా 1.37 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు. వచ్చే మూడేళ్లలో జాబ్ క్యాలెండర్లతో మరిన్ని ఉద్యోగాలొస్తాయి. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ఎన్నికలకు ముందు బందర్ పోర్టుకు శంకుస్థాపన చేయడం మోసం కాదా?
చంద్రబాబు పచ్చి మోసకారి
చంద్రబాబు 2014 ఎన్నికల ముందు బీజేపీతో కలవబోనని చెప్పి ఆ తర్వాత వాళ్లతో అంటకాగాడు. దిగిపోయే ఆర్నెల్ల ముందు ప్రధాని మోదీని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి అంశాలవారీగా మద్దతిస్తానంటున్నారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఉంటుందా? బెల్ట్ షాపుల సృష్టికర్త అయిన చంద్రబాబు బ్రాందీ షాపుల గురించి వ్యాఖ్యానించడం దారుణం. దొంగలు, వెన్నుపోటుదారులకు మినహా చంద్రబాబు ఎవరికి ఆదర్శం? మద్యపాన నియంత్రణకు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.
అడ్డగోలుగా కడుతున్నా అడ్డుకోలేదు..
ఓటుకు కోట్లు కేసు భయంతో చంద్రబాబు రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి కృష్ణా కరకట్టకు వచ్చారు. తెలంగాణ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేదు. కేంద్రంలో బీజేపీతో అంటకాగి నోరు మెదపలేదు. సోనియాగాంధీతో చేతులు కలిపి వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించిందెవరు? టీఆర్‌ఎస్‌తో కలిసి ఓట్లు అడుక్కుందెవరు? వావి వరసలు లేని రాజకీయాలు చంద్రబాబుకే సొంతం. చంద్రబాబు మతి భ్రమించి చేసే వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకుంటారు. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో మేం సఖ్యత కోరుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment