జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు పరస్పర విరుద్ధమైన ఆదేశాలతో అసాధారణ పరిస్థితికి దారి తీస్తుంది. అధికారులకు ఏ ఉత్తర్వును అనుసరించాలో అర్థం కాదు. అలాంటి సందర్భంలో ట్రిబ్యునల్ ఆదేశాలపై రాజ్యాంగ న్యాయస్థానమైన హైకోర్టు ఆదేశాలు ప్రబలం.
– సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ రఘురామకృష్ణరాజు భుజంపై తుపాకి పెట్టి న్యాయస్థానాల ద్వారా అభివృద్ధి పనులను అడ్డుకొనే ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని అతి పెద్ద నగరం విశాఖలో రుషికొండపై చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు, రఘురామ ద్వయానికి గట్టి చెంపదెబ్బలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేపట్టిన విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రుషికొండపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు కొనసాగించడానికి అనుమతించింది. ఈ నిర్మాణాలపై ఎన్జీటీ ఉత్తర్వులకు హైకోర్టు ఆదేశాలు విరుద్ధంగా ఉన్న పక్షంలో హైకోర్టు ఉత్తర్వులే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
రుషికొండపై నిర్మాణాలు నిలిపివేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది. ఈ అంశాన్ని హైకోర్టు సీజ్ చేసి ఉత్తర్వులు జారీ చేసినందున ఎన్జీటీ ముందు విచారణ కొనసాగించడం సరికాదని స్పష్టం చేసింది. ఎన్జీటీ ముందు విచారణ కొనసాగించడం న్యాయానికి ప్రయోజనం కలిగించదని పేర్కొంది.
తగిన ఉత్తర్వుల నిమిత్తం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణ హైకోర్టు కొనసాగిస్తుందని తెలిపింది. హైకోర్టులో ఈ కేసులో ఇంప్లీడ్ అవడానికి ప్రతివాదిని అనుమతించింది. రుషికొండలో నిర్మాణాలకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఆరోపణల నేపథ్యంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అవసరమైతే హైకోర్టు నిపుణుల కమిటీని నియమించొచ్చని పేర్కొంది.
దేశ ఆర్థికాభివృద్ధికి అభివృద్ధి అవసరమే అయినప్పటికీ కాలుష్య రహిత వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఈ అంశాన్ని విచారించే లోపు చదును చేసిన ప్రాంతాల్లో నిర్మాణాలు జరపవచ్చని, కొండ ప్రాంతంలో పనులు చేపట్టవద్దని తెలిపింది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్‌లు రెడ్డిలు స్పందిస్తూ.. ఆ ప్రాంతమంతా రుషికొండగానే పరిగణిస్తారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో కట్టడాలకు సంబంధించి పనులు చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్స్‌లోకి వెళ్లడంలేదన్న ధర్మాసనం పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment