
సదస్సులో ప్రసంగిస్తున్న మాజీ సీఎస్ అజేయకల్లం. చిత్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్, వి.లక్ష్మణరెడ్డి తదితరులు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి భవిష్యత్తు లేకుండా చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో మీ భవిష్యత్తు.. నా బాధ్యత.. అని నినాదాలివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎస్ అజేయకల్లం విమర్శించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని శ్రీనిధి కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్–సేవ్ డెమోక్రసీ’ సదస్సులో మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి అజేయకల్లం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.
తొలుత పులివెందులలో శుక్రవారం దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సదస్సులో అజేయకల్లం మాట్లాడుతూ టీడీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఐదేళ్లలో 25 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరాలని, అయితే 2014లో 3.68 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 3.69 కోట్లమంది ఓటర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున టీడీపీ పాలనలో ఓటర్ల తొలగింపు కార్యక్రమం చేపట్టడమే ఇందుకు కారణమని చెప్పారు. కొన్ని కులాల వారీగా ఓట్లను టార్గెట్ చేసి టీడీపీ ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. మనకున్న రీసర్చ్, పారిశ్రామిక సంస్థలు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ 1980కు ముందే వచ్చాయని, ఆ తర్వాత కేవలం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు నిర్మించారని అజేయకల్లం చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది..
ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని అజేయకల్లం అన్నారు. మన రాష్ట్రానికి రూ.94 వేల కోట్ల గ్యారంటీ లిమిట్స్‌కు అర్హత ఉండగా.. దానిలో 30–35 శాతం మించి గత 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో గ్యారంటీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం 101 శాతం ఇప్పటికే గ్యారంటీ రుణం తీసుకుందని చెప్పారు. రూ.3.50 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, పోలవరం, శంకుస్థాపనలు, ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని అన్నారు.
రెవెన్యూ పాతాళానికి..
2004–2014 మధ్య సంవత్సరానికి 39.5 శాతం లెక్కన రాష్ట్ర రెవెన్యూ 395 శాతం పెరగగా..గత నాలుగు సంవత్సరాల్లో టీడీపీ పాలనలో రాష్ట్ర రెవెన్యూ 30 శాతం కంటే తక్కువ నమోదైందని అజేయకల్లం అన్నారు. అంటే సంవత్సరానికి కనీసం 7 శాతం కూడా పెరగలేదని చెప్పారు. అయితే 2004–14మధ్య పెరిగిన తలసరి ఆదాయంలో సగం నమోదవుతుంటే తాము అద్భుతాలు సృష్టించామని ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైన దాఖలాలు లేవని, అయినా వ్యవసాయంలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదయిందని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. పశుక్షేత్రాల్లో దొంగ లెక్కలు చూపిస్తూ రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఫాం పాండ్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇసుక ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతి తాండవమాడుతుందని అజేయకల్లం అన్నారు.
ఎల్లో మీడియా మశూచిలా పట్టిపీడిస్తోంది: ఐవైఆర్
రాష్ట్రాన్ని ఎల్లో మీడియా మశూచిలా పట్టి పీడిస్తోందని మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. అబద్ధాలను పదే పదే ప్రచారం చేసి ప్రజలను తికమక పెట్టి టీడీపీని గెలిపించాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందన్నారు. ఎంత సేపటికీ నాలుగు బిల్డింగ్‌లు వచ్చాయి, ఫిల్లర్ ఇలా వేశాం, ఊచలు ఇలా కట్టాం అని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇదే ఒక అద్భుతం అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు.
పోలీస్ వ్యవస్థనూ నాశనం చేశారు..
పోలీస్ వ్యవస్థను సైతం నాశనం చేసి పార్టీ కార్యకర్తల్లా పోలీసులను ఉపయోగించుకుంటున్నారని అజేయకల్లం విమర్శించారు. 2వేల మందికి ప్రమోషన్లు ఇస్తే సీఎంకు సన్మానం చేసి, ఓటు వేసి రుణం తీర్చుకుంటామని పోలీసులు ప్రమాణాలు చేశారని, వాళ్లను పోలీసులు అనాలో ఖాకీ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలు అనాలో అర్థం కావడం లేదని అన్నారు.
అవినీతిలో మొదటిస్థానం..
భారత దేశంలో కెల్లా అత్యధికంగా అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్–1 స్థానంలో నిలుస్తుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో ప్రాంతీయ అసమానతలు గణనీయంగా పెరిగాయని, జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీ పాలనలో చట్టసభల్లో ప్రజాసమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రజాప్రతినిధులకు లేకుండా చేశారన్నారు. రైల్వేస్ మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎం.పాపిరెడ్డి, అగ్రికల్చర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాఘవరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ చుండూరు సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment