మేడం... మీ లెక్క తప్పింది | Ajeya Kallam Comments On Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

మేడం... మీ లెక్క తప్పింది

Published Sun, Jun 28 2020 3:44 AM | Last Updated on Sun, Jun 28 2020 8:56 AM

Ajeya Kallam Comments On Nirmala Sitharaman - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్రం రాష్ట్రానికి ఒక యూనిట్‌ విద్యుత్‌ను రూ.2.70కే సరఫరా చేస్తుంటే, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌ రూ.9 చొప్పున సరఫరా చేస్తోందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. ఎన్టీపీసీ కుడ్గి నుంచి యూనిట్‌కు రూ.9.84 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా.. కేంద్రం అంటగడుతోందని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, కులం, అవినీతిని రూపుమాపాలనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వాటిపై పోరాటం చేసే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

విద్యుత్‌ చార్జీల్లో మార్పులు చేయలేదు
► పరిశ్రమలకు యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేయాలని 2017లో టీడీపీ సర్కార్‌ నిర్ణయించింది. ఆ చార్జీల్లో మేం ఎలాంటి మార్పులు చేయలేదు.
► దేశంలో పరిశ్రమలకు యూనిట్‌ విద్యుత్‌ను తెలంగాణ రూ.7.60, మహారాష్ట్ర రూ.7.25, రాజస్తాన్‌ రూ.7.30, కర్ణాటక రూ.7.20, తమిళనాడు రూ.6.35 చొప్పున సరఫరా చేస్తున్నాయి. 
► తమిళనాడులో కేంద్రం అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల యూనిట్‌ను రూ.3 చొప్పున ఇస్తుండటంతో ఆ రాష్ట్రం యూనిట్‌ను రూ.6.35 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. 
► గుజరాత్‌లో రాయితీలు తక్కువగా ఉండటం.. ఎక్కువ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉండటం వల్ల యూనిట్‌ రూ.5 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో యూనిట్‌పై రూ.1 చొప్పున రాయితీ ఇస్తున్నాం. అంటే.. యూనిట్‌ విద్యుత్‌కు రూ.6.65 చొప్పున వసూలు చేస్తున్నాం.


టీడీపీ సర్కార్‌ అవినీతి వల్లే చార్జీలు అధికం 
► థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులకు మెగావాట్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ.. టీడీపీ సర్కార్‌ రూ.8.50 కోట్ల చొప్పున కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ వ్యవహారంలో టీడీపీ సర్కార్‌ పెద్దలు భారీగా కమీషన్లు తిన్నారు. ఈ ఒక్క విద్యుత్‌ కేంద్రం వల్లే విద్యుత్‌ సంస్థలపై రూ.20 వేల కోట్ల అప్పు భారం పడింది. 
► బహిరంగ మార్కెట్‌లో సౌర, పవన విద్యుత్‌లు యూనిట్‌ రూ.2.. అంతకంటే తక్కువ ధరకు లభ్యమవుతోంటే.. టీడీపీ సర్కార్‌ అధిక ధరలకు దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలోనూ టీడీపీ సర్కార్‌ పెద్దలు అవినీతికి పాల్పడ్డారు.
► 2014 నాటికి ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.24,800 కోట్లు అప్పులు ఉండేవి. కానీ.. టీడీపీ సర్కార్‌ అవినీతి, అసమర్థత.. నిర్వహణ లోపం వల్ల విద్యుత్‌ సంస్థల అప్పులను రూ.70 వేల కోట్లకు పెంచేసింది. అప్పుగా తెచ్చిన నిధులను టీడీపీ సర్కార్‌ పెద్దలు తినేశారు.
► విభజన సమయంలో సింగరేణి కాలరీస్‌ తెలంగాణకు కేటాయించారు. రాష్ట్రానికి బొగ్గు గనులను కేటాయించలేదు. దీని వల్ల బొగ్గు కొనుగోలు కోసం ఏటా అదనంగా రూ.2,500 కోట్ల మేర భారం పడుతోంది.

విద్యుత్‌ వాడకపోయినా ట్రాన్స్‌మిషన్‌ చార్జీలా! 
► సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ల ద్వారా రాష్ట్రం మీదుగా సరఫరా అవుతున్న విద్యుత్‌ను వినియోగించుకున్నా.. వినియోగించుకోకపోయినా.. పక్క రాష్ట్రాలు వినియోగించుకుంటున్నా మెగావాట్‌కు రూ.5.50 లక్షల చొప్పున కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సి వస్తోంది. 
► ఇతర రాష్ట్రాలు ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు మెగావాట్‌కు రూ.లక్ష చెల్లిస్తున్నాయి. ఇది అధర్మమని కేంద్రానికి చెప్పాం. వినియోగించుకున్న విద్యుత్‌కు మాత్రమే ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు వసూలు చేయాలని సూచించాం. ఇందుకు కేంద్రం అంగీకరించింది. కానీ.. ఇప్పటికీ ఆ తప్పును సరిదిద్దలేదు. దీని వల్ల ట్రాన్స్‌మిషన్‌ చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.1,700 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది.
► బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ దొరుకుతున్నా.. సోలార్‌ బండిల్‌(సేవలతో కలిపి ఉత్పత్తిని విక్రయించే వ్యూహం) విద్యుత్‌ను ఎన్టీపీసీ యూనిట్‌ రూ.4.84 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఏడాదికి విద్యుత్‌ సంస్థలపై రూ.3,500 కోట్లకుపైగా భారం పడుతోంది.
► టీడీపీ సర్కార్‌ చేసిన అప్పుల్లో రూ.53 వేల కోట్లను కేంద్ర సంస్థలైన పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీల నుంచే చేసింది. అదీ పది శాతం వడ్డీపై. అంటే వడ్డీ రూపంలోనే ఏటా రూ.5,300 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. దీని వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు అధికంగా ఉంటున్నాయి.

అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చాం
► ఎన్నడూ ప్రజా జీవితంలో లేకున్నా.. ఎలాంటి అర్హతలు లేకున్నా.. ఎమ్మెల్యే కాకపోయినా.. కేవలం కొడుకు అనే ‘ఏకైక’ కారణంతో ఒకరిని మంత్రిని చేసిన కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలనే ఆమె అభిప్రాయాలను గౌరవిస్తున్నాం.
► సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇటీవల సచివాలయ ఉద్యోగాల భర్తీలో మెరిట్‌పైనే 80 శాతం పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఇచ్చాం. నామినేటెడ్‌ పదవుల్లో కూడా ఈ వర్గాలకు 50 శాతం పదవులను ఇచ్చేలా చట్టాన్ని తెచ్చి, అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.
► అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతో.. గ్రామ స్థాయి నుంచి వ్యవస్థలను పటిష్టం చేయాలనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేదు.
► ఇంజనీరింగ్‌ పనుల టెండర్లలో అవినీతిని నిర్మూలించడానికి చట్టాన్ని తెచ్చాం. జ్యుడిషియల్‌ ప్రివ్యూను ఏర్పాటు చేశాం. జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతో రివర్స్‌ టెండరింగ్‌ను నిర్వహిస్తున్నాం.
► టీడీపీ సర్కార్‌ హయాంలో అక్రమాలు జరిగిన టెండర్లను రద్దు చేసి.. గత నెల వరకూ నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.2,072 కోట్ల మేర ఖజానాకు ఆదా చేశాం. టీడీపీ సర్కార్‌ పట్టణాల్లో ఐదు లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచింది. నిర్మాణం ప్రారంభించని 64 వేల ఇళ్ల పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తేనే రూ.400 కోట్లు ఆదా అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement