బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అరకొర నిధులే
నామినేటెడ్ పదవుల్లోనూ బ్రాహ్మణులకు న్యాయం జరగలేదు: ఐవైఆర్
సాక్షి, అమరావతి: పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ఏర్పా టైన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి ప్రభుత్వం నిధుల కేటాయిస్తున్న తీరుపై సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంఘానికి ఈ ఏడాది కేటాయించిన నిధులు ఏ మాత్రం సరిపోవని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రధాన కార్యాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి ఐదేళ్ల కాలంలో రూ.500 కోట్లు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారని.. మిగిలిన రెండేళ్ల వ్యవధిలో రూ.350 కోట్ల వరకు కేటాయించాల్సి ఉండగా, ప్రభుత్వం ఈ ఏడాది రూ.75 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. ఆఖరి ఒక్క సంవత్సరంలో ప్రభుత్వం ఎక్కువ నిధులిచ్చినా బ్రాహ్మణులకు అనుకున్నంత ప్రయోజనం చేకూరదని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ బ్రాహ్మణులకు ఇంత వరకు న్యాయం జరగలేదని కృష్ణారావు వ్యాఖ్యానించారు.