Brahmin welfare
-
బీసీ స్టడీ సర్కిళ్లలో బ్రాహ్మణ నిరుద్యోగులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న బ్రాహ్మణ నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇప్పించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖతో ఒప్పందం చేసుకుంది. గ్రూప్స్, పోలీస్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఆ ఉద్యోగాలు పొందాలనుకుంటున్న బ్రాహ్మణ నిరుద్యోగులు తమకు శిక్షణ కావాలని అభ్యర్థిస్తున్నారు. కానీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యం లో ఇలాంటి శిక్షణ కేంద్రాలు లేకపోవడం తో, బీసీ సంక్షేమ శాఖను సంప్రదించి ఆ మేరకు అంగీకారం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లతోపాటు కొత్తగా ప్రతిపాదించిన మరో ఐదు సర్కిళ్లలో బ్రాహ్మణ అభ్యర్థులకూ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వివరాలను ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు వారి మాటల్లో.. ‘వార్షికాదాయం రూ.5 లక్షలు, అంతకంటే లోపు ఉన్న కుటుంబాల నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు మే 1 నుంచి మే 7వ తేదీలోపు www.brahmin parishad.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 16 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఒక్కో సెంటర్లో గరిష్టంగా 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఈ సంఖ్య పెరిగితే రెండో బ్యాచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. శిక్షణవేళ అభ్యర్థులకు స్టైపండ్ కూడా వస్తుంది. గ్రూప్–1 అభ్యర్థులకు రూ.5 వేలు, ఇతర పోస్టులకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తారు. అభ్యర్థులు మీ సేవ ద్వారా పొందిన కుల ధ్రువీకరణ పత్రం, రూ.5 లక్షలు, అంత కంటే లోపు ఉందని తెలిపే ఆదాయ ధ్రువపత్రం, 1 నుంచి 7వ తరగతిలకు చెందిన బోనఫైడ్ సర్టిఫికెట్, విద్యార్హత పత్రాలు, ఆధార్ ప్రతి, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, బ్యాం కు పాసు పుస్తకం ప్రతిని జత చేయాల్సి ఉంటుంది. ఏవైనా పత్రాలు అందుబాటులో లేకుంటే, తరగతులు ప్రారంభమయ్యేలోపు సమర్పిస్తామని సెల్ఫ్ డిక్లరేషన్ అందించాలి. బీసీ స్టడీ సర్కిళ్లలో ఓబీసీలకు 5 శాతం సీట్లు ఉండే వెసులుబాటు ఆధారంగా ఈ శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఏపీ బడ్జెట్‌పై స్వరూపానందేంద్రస్వామి హర్షం
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అభినందనీయులు అని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు. సీఎం జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పారు. శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెండు లక్షల 29 వేల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. దీంతోపాటు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కేటాయింపులపై అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. -
బ్రాహ్మణులకు అండగా ప్రభుత్వం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను చిన్నచూపు చూసిందని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను అకారణంగా తొలగించడమే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. రాజకీయాల్లో మాటకు నిలబడే వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయనను బ్రాహ్మణులంతా ఆశీర్వదించాలని కోరారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బ్రాహ్మణుల స్థితిగతులను మెరుగుపరచడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బ్రాహ్మణ సంఘాల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తానన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గతంలో పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి మార్చి 31లోగా పరిష్కరిస్తానని తెలిపారు. పేద బ్రాహ్మణులు, విద్యార్థులకు తిరుపతి, విజయవాడలో వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, రక్షణనిధి, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, దేవదాయ శాఖ కమిషనర్ మొవ్వ పద్మ, టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, వైఎస్సార్సీపీ నేతలు బొప్పన భవకుమార్, దేవినేని అవినాష్, తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అరకొర నిధులే
నామినేటెడ్ పదవుల్లోనూ బ్రాహ్మణులకు న్యాయం జరగలేదు: ఐవైఆర్ సాక్షి, అమరావతి: పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ఏర్పా టైన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి ప్రభుత్వం నిధుల కేటాయిస్తున్న తీరుపై సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంఘానికి ఈ ఏడాది కేటాయించిన నిధులు ఏ మాత్రం సరిపోవని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రధాన కార్యాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి ఐదేళ్ల కాలంలో రూ.500 కోట్లు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారని.. మిగిలిన రెండేళ్ల వ్యవధిలో రూ.350 కోట్ల వరకు కేటాయించాల్సి ఉండగా, ప్రభుత్వం ఈ ఏడాది రూ.75 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. ఆఖరి ఒక్క సంవత్సరంలో ప్రభుత్వం ఎక్కువ నిధులిచ్చినా బ్రాహ్మణులకు అనుకున్నంత ప్రయోజనం చేకూరదని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ బ్రాహ్మణులకు ఇంత వరకు న్యాయం జరగలేదని కృష్ణారావు వ్యాఖ్యానించారు.