
సాక్షి, విజయవాడ: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపేందుకు టీడీపీ ప్రయత్నించిందని బీజేపీ నాయకుడు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. మంగళవారం ఉండవల్లి సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విభజన సందర్భంగా ఏపీకి ఇవాల్సినవన్నీ కేంద్రం ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తే బీజేపీ ప్రతినిధిగా తను అడ్డుకున్నట్టు పేర్కొన్నారు.
‘ఏపీకి కేంద్రం ఇంకా 1.16 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని టీడీపీ చెబుతోంది.. అది అబద్ధం. ఏపీకి కేంద్రం ఎంత ఇచ్చింది, ఎంత ఇవ్వాల్సి ఉందనేదానిపై మా వద్ద లెక్కలు ఉన్నాయి. టీడీపీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామంటే, మేము కూడా ఇస్తామన్నాం. దాంతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరగలేదు. సమావేశంలో హోదా కోసం కలిసి ఉద్యమం చేసే విషయంలో చర్చ జరగలేదు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై చర్చ జరగాలనే అంశంపై అందరు సానుకూలంగానే ఉన్నార’ని ఐవైఆర్ తెలిపారు.