
దేశంలో నేనే సీనియర్ నాయకుడిని
నవ నిర్మాణ దీక్ష’లో ముఖ్యమంత్రి చంద్రబాబు
నేను ఎవరికీ భయపడను
సాక్షి, అమరావతి: దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడినని, ఎవరికీ భయపడనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వాన్ని గౌరవిస్తానని చెప్పారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంక్షేమం, నిరుపేదల స్వయం ఉపాధి తదితర అంశాలపై సీఎం ప్రసగించారు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని చూసి తాను భయపడుతున్నానంటూ విమర్శలు చేస్తున్నారని, అయితే తానెవరికీ భయపడనని పేర్కొన్నారు.
గుంటూరు సభలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదాలో ఏముందో స్పష్టం చేయలేకపోయారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 21 మంది అభ్యర్థులను ముఖ్యమంత్రి సన్మానించారు. వారిలో ఇద్దరు అభ్యర్థులు తమ అనుభవాలను సమావేశానికి హాజరైన ప్రజలకు వివరించారు.