
ఉద్యోగులు హైదరాబాద్ వదిలి రావాల్సిందే: బాబు
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ జూన్ 27కల్లా మొత్తం వెలగపూడి తరలి రావాల్సిందేనని తెలిపారు. ఉద్యోగులు త్యాగాలు చేయాలని, ప్రజల పరిపాలన కోసం తాను హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చానని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం తాము నవ నిర్మాణ దీక్ష చేస్తుంటే వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఎన్ని రోజులు అనంతపురం జిల్లాలో తిరిగినా ప్రజలంతా తమవైపూ ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పంచాయతీ నుంచి ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీకే మద్దతిస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు. కష్టకాలంలో అందరూ కలిసి రావాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.