ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం | CM YS Jagan govt is an employee friendly government | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం

Published Fri, May 3 2024 5:37 AM | Last Updated on Fri, May 3 2024 5:37 AM

CM YS Jagan govt is an employee friendly government

ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వంగా సీఎం జగన్‌ సర్కారు

వారిపై ఒత్తిడి తగ్గించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

హామీ మేరకు తొలి కేబినెట్‌లోనే 27% మధ్యంతర భృతి.. ఇందుకోసం రూ.17,918 కోట్లు చెల్లింపు

వేతన సవరణతో రూ.11,707 కోట్లు అదనపు వ్యయం.. అడగకుండానే 12వ పీఆర్సీ

బాబు ఎగ్గొట్టిన డీఏలనూ చెల్లించిన సీఎం జగన్‌

బాబు హయాంలోకన్నా వేతనాల పద్దు రూ.11 వేల కోట్లు పెరుగుదల.. ఒక్క సీపీఎస్‌ సాధ్యం కాదని.. మెరుగైన పెన్షన్‌ వచ్చేలా జీపీఎస్‌

పారిశుద్ధ్య కార్మికులకు, చిరుద్యోగులకు వేతనాలు పెంపు.. వచ్చే ఐదేళ్లు రూ.25 వేల వరకు వేతనం వచ్చే వారికి విద్య, వైద్య రంగంలో పథకాలు, ఇళ్లు

వ్యవస్థలో తగ్గిన అవినీతి.. ఉద్యోగుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం.. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు

ఉమ్మడి ఏపీలో పెన్షనర్లకు డీఏ రద్దు చేసిన బాబు

ఉద్యోగులను లంచగొండులుగా చిత్రీకరించిన బాబు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటారు. ప్రజలంటే ఎంత ప్రేమ చూపిస్తారో ఉద్యో­గులతోనూ అంతే అభి­మా­నంతో ఉంటారు. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు మంచి మిత్రుడని, ఆయన ఐదేళ్ల పాలన ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా సాగిందని, పలువిధా­లుగా మేలు కూడా చేకూర్చారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్లు కోవిడ్‌ కష్టాల్లోనూ ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలివ్వడం, గత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎగ్గొట్టిన రెండు డీఏలను కూడా వైఎస్‌ జగన్‌ సర్కారు చెల్లించడం ఇందుకు చిన్న ఉదాహరణలని చెబుతున్నారు. 

చంద్రబాబుది కపట ప్రేమ
బాబు ప్రతి ఎన్నికలకు ముందు ఉద్యో­గులపై కపట ప్రేమ చూపిస్తారని, అధికారంలోకి వస్తే నరకం చూపిస్తారని, ఈసారీ ఇదే ఎత్తుగడ వేశారని రాష్ట్ర సచివాలయ ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు వేళపాళా లేకుండా పనిచేయాల్సి వచ్చేదని, వారి పట్ల చంద్రబాబుకు, టీడీపీ నేతలకు కనీస గౌరవం కూడా ఉండేదికాదని, తరచూ బెదిరింపులు, ఛీత్కరింపులతో అవమానాలు ఎదురయ్యేవని వివరించారు. 

ఉమ్మడి ఏపీలో పెన్షనర్లకు డీఏనే రద్దు చేసిన చరిత్ర చంద్రబాబుదని, 2019 ఎన్నికలకు ముందు డీఏలు ఎగ్గొట్టారని తెలిపారు. గతంలో చిరుద్యోగులు జీతాలు పెంచాలని ఎన్నిమార్లు కోరినప్పటికీ నాలుగున్నరేళ్లు పట్టించుకోని చంద్రబాబు.. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్నికల స్టంట్‌లో భాగంగా జీతాలు పెంచుతున్నట్లు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇలా చంద్రబాబు పాలన అంటే ఉద్యోగులకు నరకమేనని చెబుతున్నారు.

జగన్‌ పాలనలో ఏ సమస్యా లేదు
గత ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ పాలనలో ఉద్యోగులకు అలాంటివి ఎప్పుడూ ఎదురు కాలేదని తెలిపారు. సీఎం సహా మంత్రులు, అధికారులు ఉద్యోగులను సమయం దాటి పనిచేయాలని ఎప్పుడూ కోరలేదు. పైగా, సీఎం జగన్‌ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేలాది యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిందని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగులంతా చాలా ఉత్సాహంగా, ఆనందంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. 

వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు కూడా ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా చెల్లించారని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల డీఏలు, ఎర్న్‌డ్‌ లీవ్‌ల మంజూరులో కొంత జాప్యం అయింది తప్ప ఉద్యోగులకు, పెన్షర్లకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంటున్నాయి. సీఎం జగన్‌ ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిన మేరకు తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసి, రూ.17,918 కోట్లు చెల్లించారని వివరిస్తున్నారు. 

11వ వేతన సవరణ అమలు చేసి రూ.11,707 కోట్ల అదనపు వ్యయాన్ని ఈ ప్రభుత్వం భరించిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలు అడగకుండానే సీఎం జగన్‌ 12వ పీఆర్సీని ఏర్పాటు చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడమే కాకుండా వారి వేతనాలను కూడా పెంచారు. మధ్య దళారీల నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించారు.

ఉద్యోగుల మేలు కోసమే జీపీఎస్‌ 
చంద్రబాబు సీఎంగా ఉండగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ తేవాలన్న ఉద్యోగులు కోరగా, ఆయన ససేమిరా అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్‌ ఉద్యోగుల రిటైర్మెంట్‌ తరువాత చాలా తక్కువగా పెన్షన్‌ వస్తోందని గుర్తించి సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని మాట ఇచ్చారు. అయితే కొన్ని రాష్ట్రాలు సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించడమే కానీ, చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్‌ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్‌ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా జీపీఎస్‌ను రూపొందించింది. 

బేసిక్‌ జీతంలో 50 శాతం అంటే రూ.1 లక్ష జీతం ఉంటే రూ. 50 వేలు రిటైర్‌ అయిన తర్వాత పెన్షన్‌గా వస్తుంది. 82 ఏళ్ల వయస్సులో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండేలా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్‌లు ఇచ్చేలా జీపీఎస్‌ రూపొందించారు. దీనిని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సీపీఎస్‌ కంటే జీపీఎస్‌ మేలన్నాయి. సీఎం జగన్‌ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని ఆర్టీసీ కారుణ్య నియామకాలనూ సీఎం జగన్‌ చేపట్టారు. 

ఇచ్చిన మాట మేరకు ఆర్టీసీలోని 55 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు.  10 వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ ఇస్తున్నారు. ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఉన్న 14,658 మందిని సొసైటీ నుంచి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాల ఖర్చులో 60 శాతం ప్రభుత్వం భరిస్తుందని తాజా మేనిఫేస్టోలో పేర్కొన్నారు.

ఆర్థిక ప్రయోజనాలిలా..
సీఎం జగన్‌ ఇచ్చిన మాట మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారు. వారి వేతనాల వ్యయం భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు హయాంలోకన్నా ఉద్యోగుల వేతనాల వ్యయం ఇప్పుడు రూ.11 వేల కోట్లకు పైగా పెరిగింది. పెన్షర్ల వ్యయం రూ.6 వేల కోట్లకు పెరిగింది.

ప్రభుత్వ రంగాన్ని మూసివేయడంలో ఘనుడు చంద్రబాబు
ప్రభుత్వ రంగాన్ని మూసివేయడం, వీఆర్‌ఎస్‌ కూడా ఇవ్వకుండా గోల్డెన్‌ హ్యాండ్‌ షేక్‌ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపేయడంలో చంద్రబాబుకు ఘనమైన చరిత్ర ఉంది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు శాశ్వత ఉద్యోగుల నియామకాలను ఉద్దేశపూర్వకంగా తగ్గించేశారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌ పరం చేసే ఆలోచన చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో కేవలం 34 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులనే నియమించారు. 

ఉమ్మడి రాష్ట్రంలో 1999 నుంచి 2004 మధ్య సీఎంగా ఉండగా ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్‌ ఫోర్బ్స్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, అతి తక్కువ ధరకు తన వాళ్లకు కట్టబెట్టారు. ఉద్యోగులను నడిరోడ్డుపై వదిలేశారు. మనసులో మాట పుస్తకంలో చంద్రబాబు చెప్పిన విషయాలను ఉద్యోగులు ఇంకా మరిచిపోలేదు. రాష్ట్రంలో 2,70,700 ఉద్యోగాల్లో 40.62 శాతం అదనంగా ఉన్నాయని రాశారు. శాశ్వత ఉద్యోగాల కాలపరిమితిని సమీక్షించాలన్నారు. 

1996 – 97లోనే సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించడం మానేహామంటూ తన ఘనకార్యాలను రాసుకున్నారు. కొత్త నియామకాలు చేపట్టకూడదని, కాంట్రాక్టు ప్రాతిపదికనే ఇవ్వాలని, సిబ్బందిని తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఇంతేకాదు.. బాబు ఉద్యోగులను లంచగొండులుగా చిత్రీకరిస్తుంటారు. విద్యుత్‌ సంస్థ ఉద్యోగుల్లో 66 శాతం, పౌర సరఫరాల సంస్థలో 65 శాతం, రెవెన్యూలో 64 శాతం, పోలీసు శాఖలో 62 శాతం, స్థానిక సంస్థల్లో 52 శాతం అవినీతిపరులేనని తన పుస్తకంలో రాశారు. ఇప్పడు ఎన్నికల్లో లబ్ధికి, మరోసారి మోసం చేయడానికి ఉద్యోగులు, పెన్షర్ల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు.

చిరుద్యోగులకూ మేలు చేసిన సీఎం జగన్‌
చిరుద్యోగులకూ సీఎం జగన్‌ మేలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే దాదాపు అన్ని రంగాల్లో చిరుద్యోగుల జీతాలు పెంచారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో రూ.1,100 కోట్లు ఉండే వీరి జీతాల ఖర్చు ఇప్పుడు రూ.3,300 కోట్లకు పెరిగింది. చిరుద్యోగుల పట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. అంతే కాదు.. వారికి మరింత మేలు చేకూరుస్తూ మేనిఫెస్టో రూపొందించారు. 

నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యానికి, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల పథకాలను వర్తింపజేస్తామని తాజా మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంటే జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు వైద్య రంగంలో నవరత్నాల పథకాలు వారికి అందుతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement