ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల సాకారం | There are 51488 RTC employees as govt employees from Jan 1 | Sakshi
Sakshi News home page

కార్మికుల కల సాకారం

Published Wed, Jan 1 2020 3:40 AM | Last Updated on Wed, Jan 1 2020 8:43 AM

There are 51488 RTC employees as govt employees from Jan 1 - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల సాకారమైంది. నేటి నుంచి ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశారు. నూతన సంవత్సరం మొదటి రోజు (జనవరి 1) నుంచి ఇది అమల్లోకి వచ్చేలా మంగళవారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణా శాఖ సిబ్బందిగా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలన్నీ వీరికి వర్తించనున్నాయి. 1932లో అప్పటి నిజాం రాష్ట్ర రైల్వేలో ఒక భాగంగా ఎన్‌ఎస్‌ఆర్‌ అండ్‌ ఆర్‌టీడీ (నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌)గా ఈ సంస్థ ఆవిర్భవించింది.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా ప్రాంతం విడిపోవడం, ఆ తర్వాత నిజాం స్టేట్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక 1958లో ఏపీఎస్‌ఆర్‌టీసీగా రూపాంతరం చెందింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్‌టీసీ పని చేయడం మొదలుపెట్టింది. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ఏపీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు ఎన్నో దశాబ్దాల నుంచి తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నా అది నెరవేరలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో కార్మికుల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించి నెరవేర్చారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆర్టీసీ విలీనంపై సంబరాలు జరగనున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆర్టీసీ యూనియన్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. 

ప్రభుత్వ ఉద్యోగులుగా 51,488 మంది ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న 51,488 మందికి విలీనం తర్వాత లబ్ధి చేకూరనుంది. వీరికి చెల్లించాల్సిన బకాయిలు ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విలీనం తర్వాత ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.3,600 కోట్లు (నెలకు రూ.300 కోట్లు) ఆర్థిక భారం పడినా, ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తొలుత ఐపీఎస్‌ రిటైర్డ్‌ అధికారి సి.ఆంజనేయరెడ్డి చైర్మన్‌గా మొత్తం ఆరుగురు సభ్యులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సెప్టెంబర్‌లో నివేదిక అందజేయగానే మంత్రివర్గం ఆమోదించింది.

ఆ తర్వాత ఉన్నది ఉన్నట్లు (యాజ్‌ ఈజ్‌ వేర్‌ ఈజ్‌)గా ప్రభుత్వంలో విలీనం చేయాలని బోర్డు ఆమోదించింది. పీటీడీ ఏర్పాటుపై కార్యదర్శుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. వీటిపై ఆర్థిక శాఖ చర్యలు చేపట్టనుంది. ఫిబ్రవరి 1న వీరికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు ఏపీసీఎఫ్‌ఎంఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) ద్వారా జరుగుతాయి. ప్రభుత్వంలో వేతన సవరణ అమలు పరిచే వరకు ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. డిసెంబర్‌ 16వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించగా గవర్నర్‌ కూడా విలీన చట్టానికి ఆమోద ముద్ర వేశారు. 

రవాణా, ఆర్‌ అండ్‌ బీ నియంత్రణలో ప్రజా రవాణా శాఖ
రవాణా, ఆర్‌అండ్‌బీ పరిపాలన నియంత్రణలోనే ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి ఈ శాఖకు మంత్రిగా, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌/డైరక్టర్‌గా ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రధాన కార్యాలయంలో ఈడీలు అదనపు కమిషనర్లుగా, రీజినల్‌ మేనేజర్లు జాయింట్‌ కమిషనర్లుగా, డివిజనల్‌ మేనేజర్లు డిప్యూటీ కమిషనర్లుగా, డిపో మేనేజర్లు అసిస్టెంట్‌ కమిషనర్లుగా వ్యవహరిస్తారు. జోనల్‌/రీజియన్లలో ఉండే ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలకు ఇవే హోదాలు వర్తిస్తాయి. వీరు జిల్లాల్లో ఉంటారు. 

విలీనానికి ముందే ఆర్టీసీకి జవసత్వాలు 
– విలీనం జరిగే లోగానే ఆర్టీసీకి జవసత్వాలు కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు వైద్య సదుపాయాలు, కారుణ్య నియామకాలు, యూనిఫాం బకాయిలు.. తదితరాలు అమలు చేశారు. 
– నెల కిందట 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించడానికి వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న 40 శాతం బకాయిలు రూ.210 కోట్లు విడుదల చేసింది. 
– ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజమాన్యం అనుమతిచ్చింది. తొలి విడతలో 2015 వరకు ఉన్న కారుణ్య నియామాకాలను భర్తీ చేస్తారు.
– కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. 
– అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధి నిర్వహణలో మృతి చెందుతున్న ఘటనలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి, కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చింది. 
– విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టేందుకు టెండర్లు పిలిచింది.
– చరిత్రలో లేని విధంగా ఈ ఏడాది రూ.1,572 కోట్లను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించడంతో ఆర్టీసీకి భారం తగ్గింది. దీంతో పాటు ఆర్టీసీకి ప్రభుత్వ గ్యారెంటీ రుణం కింద రూ.1,000 కోట్లు పైగా మంజూరు చేయించింది. 

విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు
– సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. 
– రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి. ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య జీతభత్యాల వ్యత్యాసం ఉండదు.
– సంస్థ లాభ నష్టాలతో సిబ్బందికి సంబంధం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 60 ఏళ్ల వయో పరిమితి అమలవుతుంది. విలీనానికి ముందే సీఎం వైఎస్‌ జగన్‌ 60 ఏళ్ల వయో పరిమితి అమలు చేశారు. 
– కార్మికులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలు మొత్తం రెండేళ్లలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ కింద రూ.47 కోట్ల మేర బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లకు ఇప్పుడు నగదు చెల్లిస్తారు. 
– ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఒత్తిళ్లు ఉండవు. అధికారుల పెత్తనం తగ్గుతుంది. పనిష్మెంట్లు ఇష్టారీతిన ఇచ్చేందుకు కుదరదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement