సాక్షి, అమరావతి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రజా రవాణా వ్యవస్థ. దానిని ఎంత నూతనత్వంగా తీర్చిదిద్దితే అంతగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా, ఆ సంస్థ అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టారు. దీంతో కరోనా కష్టకాలాన్ని కూడా అధిగమించి ఆర్టీసీ ప్రగతి పథంలో పయనిస్తోంది. ఆర్టీసీ రాబడి 17 శాతం పెరగడమే దీనికి నిదర్శనం.
పచ్చ మీడియా రాజకీయ దురుద్దేశంతో ఆర్టీసీ తిరోగమనంలో ఉందంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా అభూత కల్పనలతో వార్త ప్రచురించింది. కానీ, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అవేమిటో పరిశీలిద్దాం..
♦ టీడీపీ హయాంలోకంటే వైఎస్సార్‌సీపీ హయాంలో ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. కోవిడ్ కారణంగా దేశంలోఅన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల మాదిరిగానే ఆర్టీసీ కూడా 2020, 2021లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. కానీ మళ్లీ వెంటనే గాడిన పడింది. కోవిడ్ ముందుకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) పెరిగింది. ఆర్టీసీ సాధిస్తోన్న రాబడి లెక్కలే ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.
♦ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అంటే 2019–20లో ఆర్టీసీకి రూ.4,781 కోట్ల రాబడి వచ్చింది. 2022–23లో రూ.5,574 కోట్ల రాబడి సాధించింది. అంటే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా 2019–20 కంటే 2022–23లో రూ.793 కోట్లు అధికంగా (17% అధికం) రాబడి సాధించడం విశేషం.
♦ 2019–20లో కిలోమీటర్‌కు రాబడి రూ.31.31 ఉండగా.. 2022–23లో రూ.37.91కు పెరిగింది. కిలోమీటర్‌కు రూ. 6.60 అంటే 21 శాతం
అధికంగా సాధించింది.
♦ దసరా, సంక్రాంతి పండుగలకు దశాబ్దాలుగా ఆర్టీసీ అధిక చార్జీలు వసూలు చేసేది. ప్రస్తుతం దసరా, సంక్రాంతి పండుగల్లో కూడా సాధారణ చార్జీలతోనే సర్వీసులు నిర్వహిస్తోంది.
♦ ప్రయాణికుల అభిరుచికి తగ్గట్టుగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ప్రవేశపెట్టడం వంటి వినూత్న చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
♦ రూ.50 కోట్లతో 2,200 బస్సులను ఆధునీకరించింది. 900 డీజిల్ బస్సులను కొత్తగా ప్రవేశపెట్టింది.
♦ తొలిసారి 100 ఈ–బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
♦ ఆర్టీసీ 980 బస్సులను తుక్కు కింద తొలగించిందని పచ్చ మీడియా పేర్కొంది. ఇది అవాస్తవం. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి 214 బస్సులను తొలగించింది.
♦ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సీమాంధ్ర నుంచి తెలంగాణ ప్రాంతానికి రోజూ 1,226 బస్సు సర్వీసులను నిర్వహించేవారు. వాటిలో అత్యధిక సర్విసులు హైదరాబాద్‌కే నిర్వహించేవారు కూడా. కోవిడ్ అనంతర పరిణామాలతో తెలంగాణ ఆర్టీసీ ఇరు రాష్ట్రాల మధ్య సర్విసులను తగ్గించాలని ప్రతిపాదించింది. ఆమేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య కుదిరిన కొత్త ఒప్పందం మేరకు బస్సు సర్వీసులు తగ్గించారు.
కోవిడ్‌కు ముందు ఏపీ నుంచి తెలంగాణకు రోజూ 2.65 లక్షల కిలోమీటర్ల మేర సర్విసులు నిర్వహిస్తే.. ప్రస్తుతం రోజూ 1.60 లక్షల కి.మీ. సర్విసులు నిర్వహిస్తున్నారు. అంటే 1.04 లక్షల కి.మీ. మేర సర్విసులను తగ్గించారు. అదే రీతిలో తెలంగాణ ఆర్టీసీ కూడా ఏపీకి నిర్వహించే బస్ సర్విసులను తగ్గించింది. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వక్రీకరిస్తూ ఆర్టీసీ బస్ సర్విసులు తగ్గిపోయాయని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది.
అప్పులు తీర్చి.. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత సంస్థ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. ఈ మూడేళ్లలో తీర్చిన అప్పులే అందుకు నిదర్శనం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల బకాయిలు రూ.886కోట్లు, పీఎఫ్ బకాయిలు రూ.996కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ.226 కోట్లు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.307 కోట్లు వెరసి మొత్తం రూ.2,415 కోట్ల బకాయిలను ఆర్టీసీ తీర్చింది.
మరోపక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆర్టీసీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. రూ.34 కోట్లతో పులివెందులలో బస్ స్టేషన్‌ను నిర్మించింది. రూ.91 కోట్లతో కొత్తగా 19 బస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టింది. రాజమహేంద్రవరం, అనంతపురం, తిరుపతి, నరసరావుపేటలలో డిస్పెన్సరీలను ఆధునీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment