
‘హోదా’తోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు
రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
► కేంద్రం అన్ని విధాలుగా సహకరించాలి
► నవనిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు
► కుట్రతోనే రాష్ట్రాన్ని విభజించారు
► తెలంగాణ వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారు
► ఈ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు కేంద్రం అన్నివిధాలా చేయూతనివ్వాలని కోరారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదారాదని చంద్రబాబు పరోక్షంగా చెప్పినట్లయ్యింది. మంగళవారం విజయవాడ బెంజిసర్కిల్‌లో నవనిర్మాణ దీక్ష పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. డబ్బుపై వ్యామోహంతో సోనియాగాంధీ ఇటలీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రాన్ని విడగొట్టారని ఆరోపించారు. రెండు ప్రాంతాల వారిని ఒప్పించి విభజన చేయాలని తాను చెబితే రాజకీయ లబ్ధికోసం ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. రాష్ట్ర విభజన అంతా కుట్రని ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్‌తో, తెలంగాణలో కేసీఆర్‌తో కాంగ్రెస్ పార్టీ లాలూచీ పడిందని విమర్శించారు. పార్లమెంటులో అప్రజాస్వామికంగా విభజన బిల్లు పాస్ చేశారని గుర్తు చేశారు.
ఫలితంగానే కాంగ్రెస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మూడు స్థానాల్లో పోటీ చేసే బలమున్నా ఐదు స్థానాల్లో పోటీ చేసిందన్నారు. ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను కొన్నారని, అయినా తిరిగి తమపై దౌర్జన్యం చేస్తున్నారని పరోక్షంగా రేవంత్‌రెడ్డి ఉదంతాన్ని ప్రస్తావించారు. ముగ్గురు సభ్యులున్న వైఎస్సార్ సీపీ నుంచి ఇద్దరిని కొన్నారని, మిగిలిన ఒక్క సభ్యుడితో కూడా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయించారని జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఉన్న కుట్ర, అవినీతి రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.
కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి పొమ్మంటున్నారని చెప్పారు. ఎన్నో కష్టాలనెదుర్కొన్న జపాన్, జర్మనీ, నార్త్ కొరియా, సింగపూర్ దేశాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, ఆ దేశాలే మనకు ఆదర్శమన్నారు. 8వ తేదీన తాను ప్రమాణస్వీకారం చేసిన చోటే ఈ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తానని చెప్పారు. ప్రతి ఏడాది జూన్ రెండున నవ నిర్మాణ దీక్ష చేయాలని పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. అనంతరం రాష్ట్రాభివృద్ధికి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, మంత్రులు దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు తదితరులు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిని సీఎం చంద్రబాబు సన్మానిం చారు. ఈ కార్యక్రమం కోసం హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో నాలుగు గంటల పాటు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఎయిర్‌పోర్టు విస్తరణకు హామీ
పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా గన్నవరం ఎయిర్‌పోర్టును అత్యాధునిక ప్రమాణాలతో విస్తరించనున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏడాదిలోగా రూ. 108 కోట్లతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కొత్త భవన నిర్మాణం జరుగుతుందన్నారు. రూ. 2.96తో ఎయిర్‌పోర్టులో నిర్మించిన తాత్కాలిక టెర్మినల్‌ను సీఎం మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ మధ్యన గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల తాకిడి పెరిగిందనీ, వారికి అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.రాజమండ్రి ఎయిర్‌పోర్టులో విమానాలు రాత్రి వేళ కూడా ల్యాండ్ అయ్యేం దుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విశాఖ, పుట్టపర్తి, తిరుపతి ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు.
నవ నిర్మాణ దీక్షకు జనం కరువు
నవనిర్మాణ దీక్షకు అధికారులు, ఉద్యోగులు, ప్రజలను భారీగా తీసుకురావాలని జిల్లా యంత్రాంగం, టీడీపీ నేతలు విశ్వప్రయత్నం చేసినా కుదరలేదు. తొలుత 30 వేల మంది జనం అనుకుని చివరికి 15 వేలకు తగ్గించుకున్నా అందులో సగం మంది కూడా సభకు రాలేదు. దీంతో విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కార్మికులను దీక్షకు తరలించారు. ఉదయం 9.30 గంటలకు సభ ప్రారంభం కావాల్సివున్నా జనం లేకపోవడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ ఎయిర్‌పోర్టు నుంచి బెంజిసర్కిల్ వరకూ నెమ్మదిగా వచ్చింది. బాబు ప్రసంగం సుదీర్ఘంగా సాగడంతో వచ్చిన జనం చాలామంది వెళ్లిపోయారు.
క్యా సీన్ హై...
విజయవాడలో నవ నిర్మాణ దీక్షా వేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభికుల చేత ఒక అభివృద్ధి ప్రతిజ్ఞ చేయించారు. ‘అవినీతి లేని, అసమానతలు లేని రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ..’ అని ఆయన చదవగానే వింటున్నవారు విస్తుపోయారు. రెండు రోజుల ముందే తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే ఓటు కోసం రూ.5 కోట్లకు బేరమాడుతూ ఆ పార్టీ నేత దొరికిపోవటం.. చంద్రబాబే తనను పంపారని చెప్పటం, ఇదంతా టీవీల్లో రావటం, చంద్రబాబు ఒంటినిండా అవినీతి బురద అంటుకోవటం నేపథ్యంలో ఈ ‘అవినీతి లేని’ అనే ప్రతిజ్ఞ సభకు వచ్చినవారికి ఎబ్బెట్టుగా అనిపించింది.
సచివాలయంలో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ జరిగింది. మంగళవారం ఉదయం 9 గంటలకు పలువురు ఐఏఎస్ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న ఐఏఎస్ అధికారుల్లో అనిల్ చంద్ర పునేఠా, ఎల్వీ సుబ్రమణ్యం, జేసీ శర్మ, వీణా ఈష్, డి.శ్రీనివాసులు, ఎంకే మీనా తదితరులున్నారు.