నవ నిర్మాణ దీక్షకు సర్వం సిద్ధం | Ready for nava nirmana deeksha | Sakshi
Sakshi News home page

నవ నిర్మాణ దీక్షకు సర్వం సిద్ధం

Published Tue, Jun 2 2015 4:13 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

నవ నిర్మాణ దీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద...

300 బస్సుల్లో జనం తరలింపు
20 బృందాలతో డాక్టర్ల పర్యవేక్షణ
పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు
800 మందితో బందోబస్తు
ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు చంద్రబాబు ప్రసంగం
 
 విజయవాడ : నవ నిర్మాణ దీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన దీక్షా స్థలిలో అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసినట్లు చెప్పారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం ఆయన దీక్షపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నవ నిర్మాణ దీక్ష విజయవంతానికి అధికారులు తమకు కేటాయించిన విధులు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను అందరూ కలిసి చేపట్టాలని సూచించారు. నాలుగు మార్గాల ద్వారా ర్యాలీతో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో సభావేదిక వద్దకు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులను స్టెల్లా కాలేజ్, ఎన్టీఆర్ సర్కిల్, స్క్రూ బ్రిడ్జి, డీవీ మానర్ ప్రాంతాల్లో ర్యాలీకి ఇన్‌చార్జిలుగా నియమించినట్లు చెప్పారు.

 8.10కి ముఖ్యమంత్రి రాక
 మంగళవారం ఉదయం 8.10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టెల్లా కాలేజీలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. అక్కడి నుంచి బయలుదేరి 8.30కి ర్యాలీని ప్రారంభించి పాదయాత్రతో సభావేదిక వద్దకు చేరుకుంటారని చెప్పారు. 9.30 నుంచి 10 గంటల వరకు ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని వివరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను నవ నిర్మాణ దీక్షకు తరలించేందుకు 300 బస్సులు సిద్ధం చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

 20 వైద్య బృందాలు, ఎనిమిది 108 వాహనాలు సిద్ధం చేశామన్నారు. నాలుగు వేల మంది కార్యకర్తలతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ పర్యవేక్షిస్తారన్నారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 బందోబస్తు ఇలా...
 విజయవాడ సిటీ : నవ నిర్మాణ దీక్షకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నందున భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపుపై కమిషనరేట్ అధికారులతో సమీక్షించారు. నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శాంతిభద్రతల బాధ్యతను డీసీపీ (శాంతిభద్రతలు) ఎల్.కాళిదాస్, ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలను డీసీపీ (పరిపాలన) జీవీజీ అశోక్‌కుమార్ పర్యవేక్షించనున్నారు. 800 మంది అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులకు వినియోగిస్తున్నారు.

ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీసులు.. నగర పోలీసులతో పాటు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి 200, ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి మరో 200 మంది బందోబస్తు విధులు నిర్వహించనున్నట్టు కమిషనరేట్ అధికారులు తెలిపారు. దీక్షా వేదిక పరిసర ప్రాంతాల్లోని ఎత్తయిన భవనాలపై సాయుధ పహరా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వెయ్యిమందికి ఒక రోప్ పార్టీ చొప్పున సిద్ధం చేశారు. నవ నిర్మాణ వేదికలో పాల్గొనేవారు నిర్దేశిత ప్రాంతం నుంచి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. వాహనాలతో ఏ ఒక్కరినీ వేదిక ప్రాంతానికి అనుమతించబోమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

 వీఐపీలు ఇలా
 నవ నిర్మాణ దీక్షకు 300 వాహనాల్లో వీఐపీలు వస్తారని పోలీసు అధికారులు అంచనా వేశారు. వారిని పశువుల ఆస్పత్రి జంక్షన్ నుంచి నేరుగా జ్యోతి మహల్ వరకు అనుమతిస్తారు. అక్కడ వాహనాలు పార్క్ చేసుకొని నేరుగా దీక్షాస్థలికి వెళ్లాల్సి ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

 ఎయిర్‌పోర్టులో ముందస్తు ఏర్పాట్ల పరిశీలన
 విమానాశ్రయం (గన్నవరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాకను పురస్కరించుకుని అధికారులు సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ నేతృత్వంలో అధికారుల బృందం ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలుత సీఎం ప్రారంభించనున్న ఆధునికీకరించిన విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు.  విజయవాడ పర్యటన అనంతరం సీఎం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో విస్తరించిన టెర్మినల్‌ను ప్రారంభిస్తారని, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడతారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల అనంతరం సీఎం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement