నవ నిర్మాణ సభలో తమ్ముళ్ల రగడ
- ఎమ్యెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న విష్ణు వర్గీయులు
- కలెక్టర్ సమక్షంలో వాగ్వాదం
గూడూరు: తమలోని విభేదాల కారణంగా తెలుగు తమ్ముళ్లు ఆదివారం రచ్చకెక్కారు. ఇందుకు గూడూరులో ఏర్పాటు చేసిన నవనిర్మాణ సదస్సు వేదికైంది. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ నెల 2 నుంచి పట్టణంలో నవనిర్మాణ తాలుకా స్థాయి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సదస్సుకు కోడుమూరు ఎమ్యెల్యే ఎం.మణిగాంధీతో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఇతర అధికారులు హాజరయ్యారు.
సభలో ఎమ్యెల్యే ప్రసంగిస్తుండగా టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి డి.విష్ణువర్దన్‌రెడ్డి వర్గీయులు మాజీ వైస్ ఎంపీపీ కరుణాకరరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కె.రామాంజినేయులు, మరి కొందరు అడ్డు తగిలారు. పట్టణవాసుల దాహార్థిని తీర్చేందుకు కృషి చేస్తున్నామమని, ఇందుకోసం బుడగలవాని చెరువును ఎస్‌ఎస్ ట్యాంక్ మార్చే విషయంపై శనివారం చెరువును పరిశీలించానని, సీఎంతో మాట్లాడి అందుకు కృషి చేస్తానని ఎమ్యెల్యే చెబుతుండగా విష్ణు వర్గీయులు అడ్డు చెప్పారు. ఎస్‌ఎస్ ట్యాంక్ ప్రతిపాదనను విష్ణువర్దన్‌రెడ్డి గతంలోనే ప్రభుత్వానికి నివేదించారని, కొత్తగా ఇప్పుడు చేసిందేంటి అంటూ వాదనకు దిగారు. ఎమ్యెల్యే, ఆయన వర్గీయులు డి.సుందరరాజు, మరికొందరు ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళం ఏర్పడంది. నియోజకవర్గ ప్రత్యేకాధికారి మల్లికార్జున జోక్యం చేసుకుని ఇరు వర్గీయులను వారించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.