కుటిల పన్నాగం | go shala to prepare the sector for the creation of office space TDP | Sakshi
Sakshi News home page

కుటిల పన్నాగం

Published Thu, Apr 7 2016 3:11 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM

కుటిల పన్నాగం - Sakshi

కుటిల పన్నాగం

గోశాల స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం
రూ. 53 కోట్ల విలువైన స్థలం కొట్టేసేందుకు యత్నం
కార్పొరేషన్‌కు బదిలీ చేసిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
అధికార పార్టీకి కట్టబెట్టేందుకు పక్కా ప్లాన్
గోశాల స్థలం ఖాళీ విషయంపై హైకోర్టు స్టే !
గోశాల తరలింపుపై నేడు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు

 
సాక్షి ప్రతినిధి అనంతపురం:- గోశాల స్థలం రద్దు విషయంలో తవ్వేకొద్దీ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. పర్యాటక అభివృద్ధి కోసం గోశాలను ఖాళీ చేయాలని, మరొక ప్రాంతంలో  స్థలం కేటాయిస్తామని అధికారులు ఇస్కాన్‌కు నోటీసులు జారీ చేశారు. దీని వెనుక అసలు సారాంశం వేరే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌పై చేసిన ఒత్తిళ్ల మేరకే గోశాలకు స్థలం రద్దు చేసినట్లు తెలిసింది. టీడీపీ ఆవిర్భవించి 32 ఏళ్లు గడిచినా దాదాపు ఏ జిల్లాలోనూ పార్టీ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. 2019లోపు అన్ని జిల్లాల్లోనూ సొంత భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. అన్ని జిల్లాల్లోనూ ఇప్పటికే స్థల సేకరణ పూర్తయ్యింది. ఇక్కడ స్థలసేకరణ కోసం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పలుచోట్ల స్థలాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ గేటు ఎదురుగా ఉన్న గోశాల స్థలం వారి దృష్టిలో పడింది. కలె క్టరేట్ ఎదురుగా ఉండటం, అత్యంత విలువైన స్థలం కావడంతో ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిసింది.


 స్థలం విలువ రూ.53.40కోట్లు
ఈ స్థలం బుక్కరాయసముద్రం మండల పరిధిలోకి వస్తుంది. సర్వే నంబరు 777లో 3.02 ఎకరాల స్థలముంది. ఇందులో కొంత స్థలాన్ని ఇప్పటికే కొందరు ఆక్రమించారు. ప్రస్తుతం 2.67 ఎకరాలు (267 సెంట్లు) మిగిలి ఉంది. దీన్ని కూడా ఆక్రమిస్తారన్న ఉద్దేశంతో పరిరక్షణ బాధ్యతను దుర్గాదాస్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులు నగర పాలక సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత అప్పటి కలెక్టర్ లోకేశ్ కుమార్, కమిషనర్ నీలకంఠారెడ్డి స్థలాన్ని గోశాలకు కేటాయించారు. ఇప్పుడు దాన్ని రెవెన్యూ అధికారులు తిరిగి తీసుకుని.. టీడీపీ ఆఫీస్ కోసం సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు.

అయితే..గోశాలను రద్దు చేయడం సమంజసం కాదని అక్కడి కీలక అధికారి ఒకరు ఫైలును పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కలెక్టరేట్ సమీపంలోని శివారు ప్రాంతాల్లో సెంటు స్థలం రూ.20లక్షల దాకా ఉంది. దీన్నిబట్టి 267 సెంట్ల విలువ రూ.53.40 కోట్లు. ఇంత విలువైన స్థలాన్ని టూరిజం అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించి  టీడీపీ ఆఫీసు నిర్మించి పచ్చరంగు వేయాలని ఆ పార్టీ నేతలు పన్నాగం పన్నారు. దీనికి కలెక్టర్ పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా కలెక్టరేట్ ఎదురుగా రోడ్డు, పక్కలో 2.67 ఎకరాలు, దాని వెనుక ఇళ్లు...ఇలాంటి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు.
 
నేడు నిరసన కార్యక్రమాలు
గోశాల కొనసాగించుకునేందుకు 2017 వరకూ అనుమతి ఉన్నా తమను ఖాళీ చేయమన్నారనే అంశంపై గోశాల ప్రతినిధులు,  మద్దతుదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తోంది. తదుపరి ఆదేశాలు వెలువరించేదాకా గోశాలను కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. దీనికి తోడు గోశాలను ప్రస్తుతమున్న స్థలంలోనే కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయించేందుకు వీల్లేదనే డిమాండ్‌తో  ప్రజాసంఘాలు గురువారం అనంతపురం ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement